Wednesday, May 1, 2024

సహకార బ్యాంకులు బలోపేతం

- Advertisement -
- Advertisement -

bank

బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు
కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో జమ చేసిన సామాన్యుల డబ్బును సురక్షితంగా ఉంచడానికి చట్టంలో మార్పునకు మోడీ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,540 సహకార బ్యాంకులు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పరిధిలోకి వచ్చాయి. వీటిని సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆడిట్ చేయనున్నారు. పిఎంసి బ్యాంకులో ఇటీవల జరిగిన మోసం తర్వాత ఇలాంటి సంఘటనలను తనిఖీ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఈ చర్య తీసుకుంది. దీనికి గాను డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు బ్యాంకింగ్ చట్టం సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

8.60 కోట్ల డిపాజిటర్లను కల్గివున్న 1540 బ్యాంకుల్లో దాదాపు రూ.5 లక్షల కోట్ల సేవింగ్స్ ఉన్నాయి. ఈ సహకార బ్యాంకుల్లో ఆర్‌బిఐ బ్యాంకింగ్ నియంత్రణ నిబంధనలు అమలు చేసేందుకు ఈ చర్యలను కేంద్రం చేపట్టింది. అధికార యంత్రాంగ సమస్యలను ఇప్పటికీ కొఆపరేటివ్ రిజిస్ట్రార్ మార్గనిర్దేశం చేయనుంది. కేబినెట్ నిర్ణయాల గురించి మీడియా సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఆర్థిక స్థిరత్వం పటిష్టం కోసం మార్పులను పరిశీలిస్తున్నామని అన్నారు. సహకార బ్యాంకుల సిఇఒల నియామకానికి అర్హత నిబంధనలను రూపొందిస్తామని, వాణిజ్య బ్యాంకుల విషయంలో మాదిరిగా నియామకాలకు ముందు ఆర్‌బిఐ అనుమతి కోరాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఐదు లక్షల కోట్లు జమ

బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు చేయడం ద్వారా సహకార బ్యాంకులు బలోపేతం కానున్నాయని జవదేకర్ అన్నారు. దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో ప్రస్తుతం 8.60కోట్ల మంది కి సుమారు రూ .5 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం, సహకార బ్యాంకులు ఇప్పు డు ఆర్‌బిఐ నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాంకుల ఆడిట్ కూడా ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఒక బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే, ఆర్‌బిఐ కూడా ఆయా బోర్డుపై నిఘా ఉంచుతుంది.

నిబంధనలకు గడువు

ఆర్‌బిఐ మార్గదర్శకాలను అవలంబించడానికి సహకార బ్యాంకులకు నిర్ణీత కాలపరిమితి ఇస్తామని జవదేకర్ తెలిపారు. 2020-21 బడ్జెట్‌లో చేసిన ప్రకటనల తర్వాత మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో సహకార బ్యాంకులను ప్రొఫెషనల్‌గా మార్చడానికి, అందులోని డిపాజిట్లను భద్రపరచడానికి దాని చట్టంలో మార్పులు తెస్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.

బాధ్యత రిజిస్ట్రార్‌దే

నిబంధనలలో మార్పు వచ్చిన తర్వాత కూడా సహకార బ్యాంకుల నిర్వహణ బాధ్యత రిజిస్ట్రార్ వద్దనే ఉంటుంది. బ్యాంకుల ఆర్థిక బలం కోసం ఈ మార్పు జరిగింది. ఈ బ్యాంకుల్లో సిఇఒల నియామకానికి అవసరమైన అర్హతలను కూడా ఆర్‌బిఐ ఆమోదించాలి. ఇంతకుముందు ప్రభుత్వం బ్యాంకుల్లో డిపాజిట్ల భద్రతా హామీని బడ్జెట్‌లో లక్ష రూపాయలకు పెంచింది.

Cabinet clears amendments to banking regulation law

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News