Friday, April 26, 2024

ఐజిఎస్‌టి రూ.2,640 కోట్లు తక్షణమే ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

 వారం రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడండి 

 తెలంగాణకు రూ.3 కోట్లు తగ్గుతోంది… దీనిపై మళ్లీ చర్చిస్తాం
 ఐజిఎస్‌టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన ఐజిఎస్‌టి మొత్తం రూ.2641 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఈ మొత్తం రాష్ట్రాలకు అవసరమని, వచ్చె నెల ఐదో తేదీన జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశానికి ముందే ఐజిఎస్‌టి చెల్లింపులు చేయాలని సిఫార్సు చేయాలన్నారు. ఐజిఎస్‌టి (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ టాక్స్)పై బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడి అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమైంది. ఈ సందర్భంగా ఐజిఎస్‌టి సెటిల్‌మెంట్‌పై చర్చ జరిగింది. బిఆర్‌కె భవన్ నుంచి మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఐజిఎస్‌టి మొత్తం రూ.2641 కోట్లు ఉందన్నారు. అయితే జిఎస్‌టి కౌన్సిల్ మాత్రం రూ.2638 కోట్లు ఐజిఎస్‌టి చెల్లించాల్సి ఉందని లెక్కలు వేసిందన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐజిఎస్‌టిలో మొత్తంలో రూ.3 కోట్లు తగ్గిందన్నారు. దీనిపై రాష్ట్ర అధికారులు చర్చిస్తారన్నారు. ఈ లెక్కలపై ఎలాంటి సమస్య లేదన్నారు. ఐజిఎస్‌టి మొత్తం రాష్ట్రాలకు చెల్లించాలని వారం రోజుల్లో సిఫార్సు చేయాలని ఐజిఎస్‌టి గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కన్వీనర్ సుశీల్ కుమార్ మోడీని మంత్రి హరీశ్‌రావు కోరారు.

వచ్చే నెల ఐదో తేదీన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం కానుంది. ఆ సమావేశానికి ముందే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజిఎస్‌టి మొత్తాన్ని చెల్లించాలని సిఫార్సు చేయాలన్నారు. కరోనా సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ నిధులు వస్తే చాలా ఊరట కలుగుతుందన్నారు. వచ్చే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే మూడు నెలలు ఆగాల్సి వస్తుందని, దీంతో వెంటనే ఐజిఎస్‌టి నిధులు రాష్ట్రాలకు అందేలా సిఫార్సు చేయాలన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఐజిఎస్‌టి గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ సుశీల్ కుమార్ మోడీ అక్టోబర్ ఒకటో తేదీన తిరిగి సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. 2018 నుంచి రాష్ట్రంతో పాటు మరో 16 రాష్ట్రాలకు రూ.25,058 కోట్లు ఐజిఎస్‌టి నిధులు రావాల్సి ఉందని తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి వసూలు చేయాల్సినవి రూ.1015 కోట్లు కన్సాలిటేడెట్ ఫండ్ నుంచి భవిష్యత్‌లో చెల్లింపుల సమయంలో అడ్జస్ట్ చేయాలని సూచించారు. ఇక 18 రాష్ట్రాల నుంచి రికవరీ చేయాల్సిన కాంపెన్సేషన్ ఫండ్‌ను ఆ రాష్ట్రాలకు భవిష్యత్‌లో చెల్లించే పరిహార మొత్తం సర్దుబాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Central will Pay IGST Rs 2640 crore Dues: Harish Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News