Friday, May 10, 2024

దేశంలో ఆరుగురికి బ్రిటన్ స్ట్రెయిన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వరంగల్ అర్బన్ వ్యక్తికి సోకిన కొత్త వైరస్

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితుడు
ఎపిలో రాజమండ్రి వాసికి కొత్త స్ట్రెయిన్
కొత్త వైరస్‌కు ప్రాణాలు తీసే శక్తి లేదు : ఈటల
ఆందోళన వద్దు : సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా

మన తెలంగాణ/హైదరాబాద్: బ్రిటన్‌లో ఆందోళన రేకిత్తిస్తున్న మ్యూటేషన్(జన్యుపరివర్తనం) స్ట్రెయిన్ భారతదేశంలోకి ప్రవేశించింది. యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు ఆరుగురికి సోకినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా వెల్లడించింది. వీరిలో బెంగళూరు నుంచి ముగ్గురు, పూణేలో మరోకరుతో పాటు తెలంగాణ, ఏపి రాష్ట్రాల నుంచి ఒక్కోక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కొత్త స్ట్రెయిన్ సోకిన వ్యక్తి వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఉండగా, ఏపిలో రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తికి న్యూ స్ట్రెయిన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ బ్రిటన్ స్ట్రెయిన్‌కు ప్రస్తుతానికి ఎలాంటి నామకరణం చేయలేదని, దీని పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడానికి మరి కొంత సమయం పడుతుందని కేంద్ర అధికారులు తెలిపారు. మరోవైపు ఇతర దేశాల్లో ఈ స్ట్రెయిన్‌ను పరిశీలిస్తే వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ, మరణాలు లేకపోవడం కాస్త ఊరటని కలిగించే అంశమని సెంట్రల్ ఆఫీసర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అప్రమత్తమైన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ….పేషెంట్లకు వేర్వేరు వార్డులు
రాష్ట్రంలో బ్రిటన్ వైరస్ నిర్ధారణ అయిందని కేంద్రం వెల్లడించగానే వైద్యారోగ్యశాఖ మరింత అప్రమత్తమైంది. న్యూ స్ట్రెయిన్ సోకిన వ్యక్తి ప్రస్తుతం వరంగల్ పట్ణణంలో ఓప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యశాఖ వెల్లడించింది. అంతేగాక అతని తల్లి శాంపిల్‌ను కూడా జీనోమ్ సిక్వెన్సీకి పంపించామని, అతి త్వరలో ఆ రిపోర్టు కూడా వస్తుందని హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. ఇదిలా ఉండగా కొత్త స్ట్రెయిన్ సోకినోళ్ల కోసం ప్రస్తుతం గచ్చిబౌలిలో మూడు ఫ్లోర్లలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కానీ ఈ న్యూ స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా ఒక్కో పేషెంట్‌ను ఒక్కో రూంలో ఉంచి చికిత్సను అందిస్తామని ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇప్పటికే వీటి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.
యూకే స్ట్రెయిన్‌కు చంపే శక్తి లేదుః ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
మ్యూటేషనైన యూకే స్ట్రెయిన్‌కు మనిషిని చంపేశక్తి లేదని నిపుణులు చెబుతున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో ప్రజలెవ్వరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సాధారణ కరోనాతో పాటు న్యూ స్ట్రెయిన్‌కూ పాత పద్ధతిలోనే చికిత్సను అందిస్తామని తెలిపారు. అయితే కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కావున ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్, సంక్రాంతి సెలబ్రేషన్స్‌ను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఆయన తెలిపారు. పండుగల కంటే ప్రాణాలు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఇప్పటికే వైరస్ వ్యాప్తి ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు.కానీ ప్రజలంతా మరిన్ని రోజులు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. పాత వైరస్‌ను కట్టడి చేసినట్లే మ్యూటేషనైన వైరస్‌నూ కట్టడి చేస్తామని మంత్రి ధీమాను వ్యక్తం చేశారు.
కొత్త రకంపై ఆందోళన వద్దు….సిసిఎంబి డైరెక్టర్ డా రాకేశ్ మిశ్రా
దేశంలో కొత్త రకం కరోనా బయపడినప్పటికీ ప్రజలెవ్వరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సిసిఎంబి(సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ) డైరెక్టర్ డా రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. ఇది చూడటానికి కొత్తగా కనిపించినప్పటికీ, దీనితో ఎలాంటి సమస్య ఉండదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లక్షణాలు, తీవ్రత అన్నీ ఒకే విధంగా ఉంటాయని కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 17 మ్యూటేషన్లు చెందినట్లు పలు సర్వేలు చెబుతున్నాయని, కానీ ఎక్కడా మరణాలు అత్యధికంగా లేవన్నారు. కానీ వ్యాప్తి మాత్రం 71 శాతంగా రికార్డు కావొచ్చని తెలిపారు. కానీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలికారు.

Centre announces 6 UK Returnees tested positive for Strain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News