Monday, April 29, 2024

సనాతన ధర్మనిరతుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Chief Minister KCR is Hindu

 

14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయమార్గంలో అహింసాయుతంగాను, అత్యంత సమర్థవంతంగాను దేశమంతా అబ్బురపడే విధంగా నిర్వహించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ నిఖార్సయిన హిందువు. హిందూమతంలోని వసుధైక కుటుంబం ఆయన విధానం. ఆయనకు అన్ని మతాలు సమానమే. ఆయన మనసులో ఒకటి పైకొకటి వుండదు. నిష్కపటి. మనసులో ఏది అనుకున్నారో అదే మాట్లాడతారు; అదే చేస్తారు. ఆయనకు ఏ మతం పట్లా ద్వేషం లేదు, దురభిమానం లేదు. ఆయన నాయకత్వం క్రింద అన్ని మతాల వారు భద్రతను, సంతృప్తిని పొందుతున్నారు. అందుకే ఆయనకు మనసులోగల హిందూ మతాభిమానాన్ని ఆయన దాచుకోవడం లేదు. తననెవరైన హిందూ మతతత్త్వవాదిగా ముద్ర వేస్తారేమోనని భయపడలేదు. ఇది కేవలం నిష్కపటి, నిష్కళంకుడు, సర్వమతాభిమాని అయిన నాయకుడు మాత్రమే చేయగలడు.

పూర్వం మన దేశాన్ని పరిపాలించిన ధర్మప్రభువులైన కొందరు రాజులు హిందూ ధర్మ రక్షణకు ఎంతో కృషి చేశారని, కొందరైతే తమ ధన, మాన, ప్రాణాలను కూడా పణంగా పెట్టారని మనం చరిత్రలో చదువుకున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అంతటి ధర్మనిరతి గల నాయకులు బహు అరుదుగా మనకు లభించారు. వారు కూడా సెక్యులర్ సూత్రానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని మనసులో ఎంత హిందూ మతాభిమానం వున్నప్పటికీ, దానిని మనసులోనే దాచుకున్నారు. కెసిఆర్ మాత్రం హిందూ మతాన్ని ఎంతగా ప్రేమిస్తారో, ఇతర మతాల పట్ల కూడా అంతే ప్రేమతో వ్యవహరిస్తారు. అయితే, కెసిఆర్ ఈ మహోదాత్త తాత్విక చింతనను కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి, ఆయనకు హిందూ మతంపై అభిమానం లేదని, ఇతర మతాలకు అనుకూలుడని ప్రచారం చేయడం బాధాకరమైన విషయం.

కెసిఆర్ అనేక యాగాలు, యజ్ఞాలు చేయడమే కాదు జిల్లాలకు, ప్రాజెక్టులకు కూడా దేవుళ్ళ పేర్లు పెట్టి తన దైవభక్తిని, ధార్మికతను చాటుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి సాహసం ఏ నాయకుడూ చేయలేదు. భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి అని, గద్వాల జిల్లాకు జోగులాంబ గద్వాల అని, కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం అని, సిరిసిల్ల జిల్లాకు రాజన్న సిరిసిల్ల అని పేర్లు పెట్టారు. పరాయి పాలనలో ఎడారిగా మరిన తెలంగాణ పొలాలను పసిడి పంటల నిలయంగా మార్చాలని భగీరథ సంకల్పంతో కేవలం మూడేళ్ళలోనే దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కెసిఆర్. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మర్వెల్‌గా ప్రపంచ నీటి పారుదల నిపుణులంతా కొనియాడుతున్నారు. ఇంతటి బృహత్తర ప్రాజెక్టుకు ఇతర పార్టీల వారైతే వాళ్ళ నాయకుల పేర్లు, వారి తాతముత్తాతల పేర్లు పెట్టుకుని వుండేవారు. కెసిఆర్ మాత్రం అసలుసిసలైన హిందువుగా, ఆ ప్రాజెక్టుకు కాళేశ్వరం అని అక్కడికి దగ్గరలో వున్న సుప్రసిద్ధ శైవక్షేత్రం పేరు పెట్టారు. ఈ పని చేయగలమని ఏ పార్టీ నాయకులైనా బహిరంగంగా చెప్పగలరా?

అదే విధంగా మేడిగడ్డ బ్యారేజ్‌కు లక్ష్మీ బ్యారేజ్ అని, అన్నారం బ్యారేజ్‌కు సరస్వతీ బ్యారేజ్ అని, సుందిళ్ళ బ్యారేజ్‌కు పార్వతీ బ్యారేజ్ అని, రామడుగు బ్యారేజ్‌కు గాయత్రీ పంప్ హౌస్ అని, మిడ్ మానేర్‌కు శ్రీ రాజరాజేశ్వర అని, అనంతగిరికి అన్నపూర్ణ రిజర్వాయర్ అని, తపాస్ పల్లికి కొండ పోచమ్మ సాగర్ అని, తుపాకులగూడెంకు సమ్మక్క బ్యారేజ్ అని, దుమ్ముగూడెంకు సీతమ్మ సాగర్ అని పేర్లు పెట్టారు. జిల్లాలకు, ప్రాజెక్టులకు ఇంత వరకు నాయకుల పేర్లే పెట్టుకున్న చరిత్ర మనది. ఈ సంప్రదాయాన్ని మార్చి హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టే సాహసం కెసిఆర్ తప్ప ఇంకెవరూ చేయలేకపోయారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కూడా కెసిఆర్ ఎన్నో ధర్మకార్యాలు నిర్వర్తించారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని కెసిఆర్ సంకల్పం. దానికి అనుగుణంగా దైవబలాన్ని పొందటానికి యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాల పునర్నిర్మాణం చేపట్టారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ. 57.00 లక్షల విలువైన 2 కిలోల బరువైన బంగారు కిరీటం ముఖ్యమంత్రి చేయించారు. వరంగల్ లోని కురవి వీరభద్రస్వామి వారికి రూ.75.00 వేల విలువైన బంగారు మీసాలను బహుకరించారు.

కొమురవెల్లి మల్లన్నకు బంగారు కోర మీసాలు సమర్పించారు. అంతేకాదు, పదవిలో వున్నవారు వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శిస్తే పదవి పోతుందనే ఒక మూఢ నమ్మకం ప్రజలలో వుంది. ఈ అపప్రథను తొలగించడానికి ఎలాంటి జంకు, గొంకు లేకుండా కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించి, మొక్కులు చెల్లించుకుని ఆలయం మీద వున్న అపప్రథను పటాపంచలు చేసిన పరిపూర్ణమైన హిందువు కెసిఆర్. తెలంగాణలో రెండేళ్ళకొకసారి జరిగే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క- సారలమ్మ జాతర. చారిత్రిక ప్రాముఖ్యత గల ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది గిరిజనులతో పాటు సాధారణ భక్తులు కూడా వెళ్ళి అమ్మవార్లను సందర్శించుకుంటారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ జాతరకు ఇంత ప్రాధాన్యత లేదు. ముఖ్యమంత్రి ఈ జాతరపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇక్కడకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రోడ్లు, రవాణా, స్నానాలకు, బట్టలు మార్చుకోడానికి వసతులు మొదలైన అనేక చర్యలను చేపట్టింది. అంతేకాక, కెసిఆర్ ఈ జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ కూడా రాశారు. ఈ జాతరకు ఇచ్చిన ప్రాధాన్యత అంతకుముందు గిరిజనులకే పరిమితమైన ఈ ఉత్సవాలకు తెలంగాణ కుంభమేళాగా జాతీయ ప్రాధాన్యత లభించింది. కరీంనగర్ జిల్లాలోని మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు వెలసిన ధర్మపురి. ఈ దేవుని పై శేషప్ప కవి 18వ శతాబ్దంలో వ్రాసిన నరసింహ శతకం, శతక సాహిత్యంలోనే ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన రచన.

ఈ శతకంలోని పద్యాలలో కొన్నయిన దాదాపుగా చదువుకున్న తెలుగు వారికి వచ్చు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఈ క్షేత్రానికున్న ప్రాచుర్యాన్ని పునరుద్ధరించడమే కాక, దేవాలయ అభివృద్ధికి రూ. 100.00 కోట్లు మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం కృష్ణ, గోదావరి, తుంగభద్ర మొదలైన పుష్కరాలకు, రాష్ట్రంలో నుంచే నదులు ప్రవహిస్తున్నప్పటికీ, ఇక్కడ సౌకర్యాలు అరకొరగా వుండేవి. అందుచేత భక్తులు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళి, పుణ్య స్నానాలకు చేయడానికి ఆసక్తిని చూపేవారు. రాష్ట్రం ఏర్పడి, కెసిఆర్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులకు అనేక పుష్కర ఘాట్‌లను నిర్మించడంతో పాటు, స్నానాదికాలకు సౌకర్యాలు కల్పించడం వల్ల ఇక్కడ నదులకు ప్రాధాన్యత లభించింది. భక్తులు పుణ్య స్నానాలకు ఇతర రాష్ట్రాలలోని దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి తప్పింది.

తెలంగాణ రాష్ట్రం వెలుపల పుణ్యక్షేత్రాల అభివృద్ధి గురించి కూడా కెసిఆర్ ఆలోచించారు. లక్షల మంది తెలంగాణ ప్రజలు కఠోర దీక్షతో ఆరాధించే అయ్యప్పస్వామి నిలయమైన శబరిమలలో మన భక్తుల కోసం విడిది వుండాలనే ఆలోచన కెసిఆర్‌కి తప్ప ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన మరే నాయకుడికీ రాలేదు. కేరళను యు.డి.ఎఫ్ పాలిస్తున్న సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి ఉమన్ చాందితో స్వయంగా ఈ విషయమై కెసిఆర్ మాట్లాడారు. ఆ తరువాత వచ్చిన ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వంతో అనేక సార్లు సంప్రదించిన పిమ్మట కేరళ ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఒక నిఖార్సయిన హిందువు తప్ప ఇంతగా ఆలోచించగల నాయకుడు ఇంకెవరున్నారు. బిజెపి పార్టీ నాయకత్వాన క్రింద అనేక రాష్ట్రాలున్నాయి. అయితే ఆ రాష్ట్రాలకు చెందిన ఏ ముఖ్యమంత్రీ ఇంతవరకు ఈ దిశగా ఆలోచించలేదు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి రూ. 5 కోట్లతో శ్రీ మూలవర్ణ కమలం నమూనా సాలగ్రామ హారాన్ని, పీటల కంటెమ్‌ను, తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి రూ. 45.00 వేలు విలువైన 10-15 గ్రాముల విలువైన ముక్కుపుడకను ముఖ్యమంత్రి బహుకరించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రూ.45.00 వేలు విలువైన ముక్కుపుడక సమర్పించుకున్నారు. చరిత్రలో ఏ మహారాజులో, ఎప్పుడో నిర్వహించిన ఆయుత చండీయాగాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ లోకకల్యాణం కోసం, ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో జయప్రదంగా మన తెలంగాణ గడ్డ మీద నిర్వహించారు. పదవుల కోసం రహస్యంగా నగ్నభావాలను ఆశ్రయించే వాళ్ళు, క్షుద్రపూజలు చేసేవాళ్ళు ఎంత విమర్శించినా దాన్ని ఆయన ఖాతరు చేయలేదు. ఈ ఆయుత చండీయాగం జరిగినన్ని రోజులు దానిని దర్శించి, తరించడానికి లక్షల మంది తరలివస్తే, అంతకుమించిన సంఖ్యలో ప్రజలు టివిలలో చూసి ప్రజలు తరించారు. ప్రభువు ధార్మికుడైతే, ప్రజలు ధర్మవర్తనులు అవుతారు. ఆయుత చండీయాగం అందరికీ ఆదర్శమైంది. ఆ యాగం తరువాత రాష్ట్రం లోపల, వెలుపల అనేక మంది స్ఫూర్తి పొంది, ఈనాడు భారీ ఎత్తున యజ్ఞయాగాలను నిర్వహిస్తున్నారు.

ఆయుత చండీయాగం వంటి మహాకార్యాన్ని ఏ ముఖ్యమంత్రీ కూడా ఇంతవరకు చేపట్టలేదు. కెసిఆర్ నిర్వహించిన ఈ యాగం చరిత్రాత్మకమైంది. యాగఫలం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుఖ సంతోషాలు పొందుతారు అని శృంగేరి శంకర పీఠాధిపతి శ్రీ భారతీతీర్థ స్వామి వారు పేర్కొన్నారు. కెసిఆర్ ధార్మిక ఉద్యమ యుగపురుషుడు. దేశ చరిత్రలో ఆలయాలకు నిధులిచ్చిన ప్రభుత్వాలు లేవు. కెసిఆర్ బడ్జెట్ లో నేరుగా నిధులిచ్చిన సాహసి. ఇప్పటి దాకా దేవాదాయశాఖ ప్రభుత్వాలకు నిధులిచ్చేది. ఆ రకంగా ప్రభుత్వాలు పాపాలు మూటగట్టుకున్నాయి. కెసిఆర్ ఆ పాపాలను కడుగుతున్నారు. యాదగిరిగుట్ట నుంచి ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించిన కెసిఆర్‌కు జాతి రుణపడి వుంటుంది అని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు పేర్కొన్నారు.

భగవంతుడి సంపూర్ణ అనుగ్రహాన్ని సంపాదించిన రాజనీతిజ్ఞుడు కెసిఆర్. భారతదేశంలో ఏ పాలకులు కూడా దేవాలయాల పునరుద్ధరణకు పాటుపడలేదు. కెసిఆర్ యాదాద్రి ఆలయ నిర్మాణం చేపట్టి, దానికి సాధికార సంస్థను కూడా ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించడం మామూలు విషయం కాదు. భగవంతుని కరుణ పొందిన పాలకులు మాత్రమే ఆధ్యాత్మిక రంగంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు. భూమండలం మీద కెసిఆర్ వంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి కూడా లేరు. ఇది ఆ రాష్ట్ర ప్రజల సుకృతం అని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో ఒక అర్చకుడు ఆర్థిక ఇబ్బందులకు లోనై గుడిగంటలకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. అది ఆనాటి అర్చకుల దైన్యం. అనేక ఆలయాల మాన్యాలు అన్యాక్రాంతం కాగా, ఆదాయం ప్రభుత్వం పాలు కాగా పట్టించుకునే దిక్కులేక అవస్థలు పడ్డారు అర్చకులు. ఆ అర్చకులను ఆదుకునేందుకు వేతన వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత మన సిఎం కెసిఆర్‌ది. ఇందుకోసం ఎన్నో న్యాయపరమైన చిక్కులు, నిబంధనల అడ్డంకులు అధిగమించి, నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి అర్చకులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించి, వారి ఆశీరాదాన్ని అందుకున్న ఘనత కెసిఆర్‌ది.

తెలంగాణలోని హిందూ దేవాలయాలలో నిత్య ధూప, దీప, నైవేద్యాల కోసం ఒక్కో గుడికి రూ.6 వేలు చొప్పున 4,805 దేవాలయాలకు ప్రతినెలా రూ. 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నుంచి చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని 18,500 మంది అర్చకుల వేతనాలను రూ.8,440/- నుంచి రూ. 24,960 వరకు పేస్కేల్ నిర్ణయించింది కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం. 2015 జనవరిలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా రూ. 2 కోట్లకు పైబడి వెచ్చిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ, బోనాల పండుగలను ప్రభుత్వ పండగలుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ప్రభుత్వం ఈ ఉత్సవాలకు 2014 నుంచి ఏటా రూ. 10 కోట్లు విడుదల చేస్తుండగా 2019లో ఈ మొత్తాన్ని రూ.15 కోట్లకు పెంచింది. రాష్ట్రంలోని పేద మహిళలందరికీ బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం చీరలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది.

ఇటీవల కెసిఆర్ కుటుంబం దేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వారణాసికి వెళ్ళి, పవిత్ర గంగా జలాలలో స్నానమాచరించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణ అమ్మవార్లను దర్శించుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పూజలు చేశారు. ఆ విధంగా కెసిఆర్ పరిపూర్ణుడైన హిందువు. హిందూమతం ప్రవచించిన దైవభక్తి, పెద్దల పట్ల గౌరవం, పండితుల, కళాకారుల పట్ల ఆదరాభిమానాలు, గురువులను గౌరవించడం వంటి సదాచారాలలో ఆయనకు సాటిరాగలవారు లేరు. దైవభక్తి గల పెద్దలు మన రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన ఇఎస్‌ఎల్. నరసింహన్‌కి, రాష్ట్రపతిగా పని చేసిన ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేసిన వినయసంపన్నులు మన కెసిఆర్. ప్రపంచ తెలుగు మహాసభల నిండు వేదిక మీద తన గురువుకి సాష్టాంగ ప్రమాణం చేసిన గొప్ప హిందువు కెసిఆర్.

రవీంద్రభారతిలో సరస్వతి పుత్రుడైన పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి పల్లకిని స్వయంగా మోసి, తన జన్మధన్యమైందని ప్రకటించిన ముఖ్యమంత్రి మన కెసిఆర్. కళాకారులను, సాహిత్యకారులను సమున్నత రీతిలో సత్కరించడంలో ఆయనకు సాటిరాగలవారు దేశంలో మరెవరూ లేరు. దేశమాత గర్వించదగ్గ తెలంగాణ హిందూ బిడ్డ కెసిఆర్. కెసిఆర్ హిందూ మత వ్యతిరేకి అని ఆయనను విమర్శించడం ఆత్మవంచన చేసుకోవడమే కాదు ఆత్మద్రోహం కూడాను. తరతరాల తెలంగాణ ప్రజల పుణ్యఫలంగా మనకు లభించిన ముఖ్యమంత్రి కెసిఆర్. తన బిడ్డ కెసిఆర్‌ని చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News