Monday, April 29, 2024

యుద్ధ మేఘాల్లో చిక్కుబడిన బాల్యం

- Advertisement -
- Advertisement -

యుద్ధ మేఘాలు కమ్ముకుని బాంబు లు, రాకెట్ లాంఛర్లు, క్షిపణిల వర్షం కురుస్తుండగా లేలేత పసిబుగ్గలు చావు భయం తో వణుకుతున్నా యి. ముక్కుపచ్చలారని బాల్యం బిక్కుబిక్కుమంటోంది. ఆటపాటలతో ఆనందంగా సాగాల్సిన జీవనం అతలాకుతలమైంది. కన్నవారిని కోల్పోతూ దైన్యంగా మారింది. పసివారిపైనా లైంగిక దాడులు… కసి తీరకుంటే నిర్దాక్షిణ్యంగా హత్య. తల్లులను వీడి కొందరు, ఆహారం దొరక్క కొందరు బంకు ల్లో ఇరుక్కుపోయి ఊపిరాడక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
రష్యా దురాక్రమణ చర్యలతో పిల్లల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇదీ ఉక్రెయిన్ పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న 75 లక్షల మంది చిన్నారుల్లో, 43 లక్షల మంది తమ ఇంటిని విడిచి వెళ్లిపోయారు. వీరిలో 20 లక్షలకు పైగా దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) బాలల విభాగం లెక్కలు తెలియజేస్తున్నాయి. మానవతా శిబిరాలు, తరలింపు కేంద్రాలు, రైళ్లు తదితర ప్రాంతాలన్నీ చిన్నారులతో కిక్కిరిసి వుంటున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి, తప్పిపోయి మరణించిన పిల్లలతో ఆయా ప్రాంతాలన్నీ తీవ్రంగా కలచివేస్తున్నాయి. బంకర్లలో తలదాచుకున్న గర్భిణీల ప్రసవాలతో హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంఘటనలతో కలత చెందిన ఉక్రె యిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సతీమణి వొలెనా ఇన్‌స్టాగ్రావ్‌ు వేదికగా భావోద్వేగ సందేశం ఉంచారు. “బాంబు షెల్టర్‌లో భిన్నమైన పరిస్థితుల్లో చిన్నారు భూమిపైకి వచ్చారు. వీరంతా తనను తాను రక్షించుకున్న ప్రశాంతమైన దేశంలో కలకాలం జీవిస్తారు” అని ఆమె కాంక్షించారు.
యుద్ధాలు, అంతర్యుద్ధాలతో అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల బతుకు, భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతున్నాయి. దేశాలు, మిలీషియా దళాలు పిల్లలను బలవంతంగా సైన్యంలో చేర్పించడం, విద్యా సంస్థలపై దాడులు, పిల్లల కిడ్నాప్‌లు, చంపడం, బాలికలపై అత్యాచారాలు పెరగడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకుగురవుతున్నారు. పురుషులను దేశం నుంచి వెళ్లకుండా ఉక్రెయిన్ ప్రభుత్వం అడ్డుకుంటుండడంతో వారి కుటుంబాల్లోని మహిళలు, పిల్ల లు మగతోడు లేకుండా పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో వీళ్లు దిక్కులేనివారవుతున్నారు. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ పిల్లల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. కుటుంబ రక్షణ కొరవడుతున్న పిల్లలు చాలా మంది అనాథలుగా మిగులుతున్నారు. దేశంలోనే ఉండిపోయిన పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయింది. స్కూలు, కిండర్ గార్డెన్ భవనాలపై అదే పనిగా పడుతున్న బాంబులకు పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది.
ఉక్రెయిన్‌పై దాడిని ఏ ఒక్కరు తప్పు పట్టినా భరించలేని పరిస్థితిలో ఉన్న రష్యా చివరికి చిన్నారులను కూడా ఉపేక్షించటం లేదు. రష్యా సేనలు ఇర్పిన్‌లో పదేళ్ల వయసున్న ఇద్దరిపై అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి హత్య చేశాయి. మైకోలైవ్‌లో పిల్లల ఆసుపత్రిపై, క్రమాటోర్క్స్‌లో పాఠశాల భవనంపై క్షిపణి దాడుల్లో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఖర్కివ్ రీజియన్‌లో రష్యా 54 దాడులకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతినిత్యం ఇలాంటి దాడులతో చాలా మంది పిల్లలు చనిపోతుండగా, మరెంతోమంది నిరాశ్రుయులవుతున్నారు. మరోపక్క అక్కడ ఉండలేక పిల్లలను వెంట బెట్టుకుని తల్లులు పోలండ్, హంగరీ, స్లోవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు వలస వెడుతున్నారు. మరికొందరు స్వచ్చంధ సంస్థల సాయంతో విదేశాల్లోని తమ బంధువుల ఇళ్లకు చేరుతుండగా, మిగతా వారంతా శరణార్ధి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి.
రష్యా బలగాల భీకర దాడులతో భీతిల్లిన జనం తలోదిక్కున వెళ్లిపోతుండగా జపోరిజియాకు చెందిన ఓ తల్లి మాత్రం అనారోగ్యంతో ఉన్న బంధువు కోసం అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఏక్షణాన ఏం జరుగుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితుల నుంచి తన 11 ఏళ్ల కుమారుడిని కాపాడుకోవాలనుకుంది. వెంటనే పొరుగున ఉన్న స్లొవేకియాకు పంపించాలని భావించింది. కొడుక్కి ధైర్యం చెప్పి, చిన్న ప్లాస్టిక్ బ్యాగు, పాస్‌పోర్టు, చేతిపై అక్కడి బంధువుల ఫోన్ నంబర్ రాసి స్లొవేకియా వెళ్లే రైలు ఎక్కించింది. తల్లి చెప్పినట్లే రైలులో వలసదారులతో కలసి దేశ సరిహద్దులు దాటి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న స్లొవేకియాకు చేరుకున్నాడు. వొంటరిగా వచ్చిన ఆ బాలుడి ధైర్యాన్ని చూసి అక్కడి అధికారులు అవాక్కయ్యారు. ఆ పిల్లవాడికి ఆహారం, దుస్తులు అందజేసి ప్రేమగా చూసుకున్నారు. అతడి చేతిపై ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి, బంధువులకు అప్పగించారు.
బాలుడి పాస్‌పోర్ట్‌లో ‘నా కుమారుడిని కాపాడిన స్లొవేకియా అధికారులకు ధన్యవాదాలు’ అని తల్లి రాసిన నోట్‌తో అధికారులు ఆశ్యర్యానికి గురయ్యారు. యుద్ధం మొదలవగానే కీవ్ నుంచి పోలండ్‌కు వచ్చిన మేరీ అనే బాలికది మరో దీన గాథ. తన తల్లిదండ్రులు యుద్ధ మేఘాల మధ్యనే చిక్కుకుపోయారు. తల్లిని తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ సరిహద్దుకు రాలేకపోయింది.దీంతో అక్కడే వదిలేసి వచ్చింది. ఆ బాలికకు తన కుటుంబమే అనుక్షణం గుర్తుకు వస్తోంది. ఎక్కడున్నారో, ఎలావున్నారో తెలుసుకోలేకపోతుంది. ‘యు ద్ధం క్రూరమైందని, ఈ గాయం ఇప్పట్లో మానదని’ తలుస్తూ వలంటీర్‌గా పని చేస్తూ కుటుంబ జ్ఞాపకాల్లో తడిసి ముద్దవుతున్నది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌కు చెందిన బిట్రీస్ అనే మహిళ కూడా తన కొడుకుతో శరణార్ధుల క్యాంపులో దుర్భర పరిస్థితిలో బతుకుతోంది. “సరిగా తిండి లేదు. ఏ సౌకర్యాలూ లేవు. అంతా స్వార్ధంతో బతుకుతున్నారు. ఈ వాతావరణం లో పెరుగుతున్న నా కొడుకు భవిష్యత్తు ఏవుతుందో” అంటూ ఆవేదన చెందుతున్నది. మాజీ మిస్ ఉక్రెయిన్ వెరొనికా దిద్‌సెంకో తన ఏడేళ్ల కొడుకుతో కీవ్ నుంచి బయలుదేరి నానా కష్టాలు పడి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌కు చేరుకుంది. తన భయంకరమైన ప్రయాణంలో బాంబుల మోతలు వినిపించని ప్రాంతమే లేదని వాపోయింది. తమ దేశాన్ని కాపాడుకోవటానికి ఉక్రెయిన్ పౌరులకు మరిన్ని ఆయుధాలు కావాలని కోరుతూ వారి పోరాట స్ఫూర్తిని కొనియాడింది.
ఇటలీలోని రోవ్‌ులో ఓ పిల్లల ఆసుపత్రిలో ఉక్రెయిన్‌కు చెందిన పిల్లలు ఎంతో మంది చికిత్స పొందుతున్నారు. మారియుపోల్‌లో తన ఇంటి ముందే బాంబులు పడుతుండటంతో పిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలని కుటుంబంతో హంగరీ రాజధాని బుడాపెస్ట్‌కు వలస వచ్చిన డేవిడ్, తన ఇద్దరు పసికందుల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళన మొదలయింది. మెకానిక్‌గా అనుభవం ఉన్న తనకు హంగరీలో ఏం చేయాలో తోచక పిల్లలను ఎలా సాకాలన్న దిగులుతో ఉన్నాడు. ఇలాంటి ఘటనలు రష్యా వొంటెద్దు పోకడను నిలదీస్తున్నాయి. ఈ మేరకు మాస్కోలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఎదుట పలువురు చిన్నారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కనికరం లేని రష్యా ప్రభుత్వం వీరిని పోలీస్ వ్యాన్‌లో తరలించడం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నది.
రష్యా యుద్ధకాండ ఉక్రెయిన్‌ను అన్ని విధాలా కుంగదీస్తున్నది. నెల రోజులకు పైగా వచ్చిపడుతున్న బాంబుల వర్షంలో దేశం శిథిలాల దిబ్బగా మారింది. రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు యుద్ధంలో సమిధలుగా మారుతున్నారు. లక్షలాది మంది ఉక్రెయిన్ చిన్నారుల భవిష్యత్తును యుద్ధం అంధకారమయం చేసింది. ఉక్రెయిన్‌తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న పోలండ్‌కు భారీగా వలస పోతున్నారు. రాజధాని వార్సాకు శరణార్ధుల తాకిడి పెరిగింది. ఆరు నెలల పాటు ఆ దేశంలో ఉండేందుకు అవకాశం కల్పించడమే కాకుండా ఉద్యోగం చేసుకునే వెసలుబాటు కల్పించింది. అంతేకాదు పిల్లలకు నెలకు 110 యూరోలు ఇస్తున్నది. అయితే రాత్రిళ్లు మైనస్ డిగ్రీల చలిలో పిల్లలు అల్లాడుతున్నారు. లక్షల సంఖ్య లో వలస వస్తుండటంతో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేకపోతున్నది. ఇదిలా వుండగా, యుద్ధంతో చెల్లాచెదురవుతున్న తమ చిన్నారుల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ‘పిల్లల గుర్తింపు’లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి శరీరాలపై పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలు రాస్తున్నారు. ఎప్పటికైనా తమ వద్దకు చేరుతారని తల్లిదండ్రుల భరోసా కాబోలు.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News