Wednesday, May 1, 2024

అమెరికాను హెచ్చరించిన చైనా దూత!

- Advertisement -
- Advertisement -

China warning to America

ఒకవైపు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అఫ్ఘానిస్తాన్ సమస్యపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించిన తీర్మానం పై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్ యూనియన్ కాదు, మాతో పెట్టుకొనేటపుడు ఆలోచించుకోండి అన్నట్లుగా అమెరికాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైనా రాయబారి క్విన్ గాంగ్ వాషింగ్టన్ సభలో హెచ్చరిక. రెండూ మంగళవారం నాడు జరిగాయి. అమెరికా, చైనా సంబంధాలు జాతీయ కమిటీ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన స్వాగత సభలో రాయబారి మాట్లాడాడు. రెండు దేశాలు అపార్థాలకు, తప్పుడు అంచనాలకు, వివాదాలు లేదా ఘర్షణలకు తావివ్వకూడదు. చారిత్రక అవకాశాలను మనం కోల్పోవద్దు, అన్నింటికీ మించి మనం చారిత్రక తప్పిదాలు చేయవద్దు అన్నారు. చైనా అంటే సోవియట్ యూనియన్ కాదు, స్వయంకృతం వలన అది కుప్పకూలిందని, ప్రచ్చన్న యుద్ధ ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు.
ఒకవైపు అఫ్ఘానిస్తాన్ నుంచి సేనల ఉపసంహరణ నిర్ణయాన్ని అమలు జరుపుతూనే మరో యుద్ధ రంగాన్ని ఎక్కడ ప్రారంభించాలా అనే ఆలోచనలో అమెరికా వ్యూహకర్తలు నిమగ్నమయ్యారు. ప్రచ్చన్న యుద్ధం తరువాత జరిపిన అతిపెద్ద సైనిక విన్యాసాల్లో ఒక దానిని ఆగస్టు నెలలో పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అమెరికా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా నిర్వహించాయి. పాతిక వేల మంది మెరైన్‌లు పెద్ద సంఖ్యలో యుద్ధనావలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. మా భాగస్వాములు అది తైవాన్ కావచ్చు, అది ఇజ్రాయెల్, మరొకటి ఏదైనా మాతో భాగస్వామ్య కలిగిన వాటన్నింటికీ బాసటగా నిలుస్తామని అమెరికా అధికారి ప్రకటించాడు. చైనాకు సమీపంలోని జపాన్‌కు చెందిన ఒకినావా దీవుల్లో 50 వేల మంది, దక్షిణ కొరియాలో 29 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. తైవాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. అఫ్ఘానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత జపాన్, భారత్, ఆస్ట్రేలియాలతో మిలిటరీ సమన్వయానికి మరింత సామర్ధ్యాన్ని అమెరికా జత చేస్తుందని వార్తలు వచ్చాయి.
మరోవైపు తన మిత్రరాజ్యాల పట్ల అమెరికా సంబంధాలలో తీవ్ర అనిశ్చితిలను ముందుకు తెస్తాయని కూడా భావిస్తున్నారు. “అమెరికా విశ్వసనీయత, దాని మీద ఆధారపడటం గురించి జపాన్ అవగాహన మీద తీవ్రమైన దీర్ఘకాల పర్యవసానాలు ఉంటాయని టోకియో సమీపంలోని మెకై విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ టెసు కొటానీ వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పుడు తూర్పు ఆసియా మీద కేంద్రీకరించేందుకు దృష్టి సారించింది. అయితే అమెరికా అభిప్రాయాన్ని చూస్తే తన మిత్రదేశాలకు ఎంతకాలం మద్దతు కొనసాగిస్తుందో చెప్పలేము అని కూడా అన్నాడు. బైడెన్‌కు ప్రతిస్పందించే తెలివి తేటలు ఉన్నాయా లేదా అని రష్యన్లు లేదా చైనీయులు పరీక్షించబోతున్నారని ఐరోపా వ్యూహాల అధ్యయన సంస్థ సలహాదారు ఫ్రాంకోయిస్ హెయిస్ బర్గ్ అన్నాడు. ఎందుకంటే ఇప్పు డు అమెరికా విశ్వసనీయతను అందరూ అంగీకరించటం లేదు అన్నాడు.
ఉగ్రవాద ముఠాలను నిరోధించాలని, ఇతరుల మీద దాడులు, విద్రోహ చర్యలు జరిపేందుకు తమ గడ్డను అడ్డాగా చేసుకోనివ్వొద్దని, దేశం వదలి పోవాలనుకుంటున్న అఫ్ఘాన్లను సురక్షితంగా వెళ్లిపోనివ్వాలనే వాగ్దానానికి తాలిబన్లు కట్టుబడి ఉండాలంటూ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆగస్టు నెలలో మన దేశ అధ్యక్ష పదవి చివరి రోజున ఈ పరిణామం జరిగింది.ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు? గత రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష జోక్యం, అంతకు ముందు 23 ఏండ్లు పరోక్ష జోక్యం చేసుకొని ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన, దాన్ని అడ్డాగా చేసుకొని ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు. తాము వ్యక్తం చేసిన ఆందోళనను తీర్మానం ప్రతిబింబించటం సంతృప్తి కలిగించిందని మన దేశం పేర్కొన్నది. తీర్మానాన్ని వీటో చేయలేదు గాని చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు. తగినంత కసరత్తు చేసి ఏకగ్రీవానికి ప్రయత్నించకపోవటం లేదా రాజకీయాలు దీని వెనుక ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నెలలో ఆమోదించబోయే మరొక తీర్మానంలో స్పష్టత రావచ్చు. తాలిబన్లను అమెరికాయే గుర్తించి ఒప్పందం చేసుకుంది. అందువలన ఎవరైనా వారిని నిందించి ప్రయోజనం లేదు. ఒప్పందానికి, వారు చేస్తున్న ప్రకటనలకు కట్టుబడి ఉండే విధంగా వత్తిడి చేయటం తప్ప మరొక మార్గం ఏమిటన్నది ప్రశ్న. తాలిబన్లను అధికారికంగా గుర్తించేందుకు నరేంద్ర మోడీ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసింది. కతార్‌లో మన రాయబారి దీపక్ మిట్టల్ తాలిబన్ రాజకీయ విభాగనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానెకజాయ్‌ను కలుసుకొని మన వైఖరిని వివరించారు.
ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మధ్య ఆసియాలో అమెరికా శకం ప్రస్తుతానికి ముగిసింది. అఫ్ఘాన్ బదులు మరొక దేశాన్ని తమ స్థావరంగా మార్చుకోవాలని అమెరికా పథకం వేసిందనే వార్తలు వచ్చాయి. ఇరాక్ నుంచి వైదొలిగేది లేదని అమెరికాయే బహిరంగంగా ప్రకటించింది. తాలిబన్ల చేతిలో పరాభవం, చావు దెబ్బతిన్నంత మాత్రాన అమెరికా ముప్పును తక్కువ అంచనా వేయకూడదు. మధ్య ఆసియాలో అమెరికా ప్రభావం, ప్రాభవం తగ్గి చైనా, రష్యాలు పై చేయి సాధించనున్నాయి.
భద్రతా మండలి తీర్మానానికి ఈ రెండు దేశాలు ఎందుకు దూరంగా ఉన్నాయి. అఫ్ఘాన్ దుస్ధితికి తాలిబన్లు ఎంత బాధ్యులో, వారిని తయారు చేసి వారితో పాటు తాము కూడా సర్వనాశనం చేసిన అమెరికా, ఇతర దేశాలది అంతకంటే ఎక్కువ బాధ్యత. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తమ నిర్వాకాన్ని విస్మరించి బాధ్యతను ఇతరుల మీద నెట్టేయత్నం ఈ తీర్మానంలో కనిపించిందని అవి చెబుతున్నాయి. అన్ని ఉగ్రవాద ముఠాల పేర్లు ప్రత్యేకించి ఇస్లామిక్ స్టేట్, ఉఘుర్ ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మువ్‌మెంట్ వంటి వాటి పేర్లను తీర్మానంలో చేర్చలేదని అభ్యంతరం తెలిపాయి. అమెరికా బాధ్యతను దోష రహితం చేయటం, ఉగ్రవాద ముఠాలను రెండు తరగతులుగా చేసి కొందరిని మినహాయించటాన్ని రష్యా, చైనా తప్పుపడుతున్నాయి. అఫ్ఘాన్ ఆర్ధిక ఆస్తులను స్తంభింప చేయటాన్ని రష్యా తప్పు పట్టింది. సంప్రదింపుల సమయంలో రెండు దేశాలూ లేవనెత్తిన అంశాలు, చేసిన సూచనలను పూర్తిగా పట్టించుకోలేదని చైనా పేర్కొన్నది.
అఫ్ఘాన్ వ్యవహారంలో మూడు విధాలుగా అమెరికా, దాని మిత్రపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఒకటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, రెండవది ప్రజాస్వామిక సంస్కరణలు, బాధ్య తా రహితంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వెళ్లిపోవటం. తన తప్పిదాలను గుర్తించకపోగా ఈ స్ధితికి ఇరుగుపొరుగు దేశాలే బాధ్యత వహించాలని మాట్లాడటం. ప్రతి యుద్ధంలో అమెరికా తన ఆయుధాలను పరీక్షించుకోవటానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. కాబూల్ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దళ చర్యలో తమ సైనికుల మరణానికి ప్రతిగా జరిపినట్లు చెప్పిన దాడిలో ఉగ్రవాదుల మరణాల సంగతేమోగాని పౌరులు మరణించినట్లు నిర్ధారణ అయింది. గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి చర్యల వలన వేలాది మంది అమాయకులు బలైన కారణంగానే సామాన్య జనంలో అమెరికా, అది ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పట్ల విశ్వాసం లేకపోవటం, వారిని వ్యతిరేకిస్తున్న తాలిబన్ల విధానాలను వ్యతిరేకించటంతో పాటు వారి పట్ల ఒక విధమైన సానుకూలత ఏర్పడటానికి దారి తీసింది.
ఫోర్బ్స్ పత్రిక ఆగస్టు 16 నాటి సమాచారం ప్రకారం రెండు లక్షల కోట్ల డాలర్లు (కొందరి అంచనా మూడు) అంటే రోజుకు 30 కోట్ల డాలర్లు ( మన రూపాయల్లో 2,200 కోట్లు) అమెరికా ఖర్చు చేసింది. అమెరికా సైనికులు రెండున్నరవేల మంది మరణించారు. అఫ్ఘాన్ మిలిటరీ, పోలీసులు 69 వేలు, సామాన్య పౌరులు 47 వేల మంది మరణించారు. అఫ్ఘాన్ వ్యవహారం అమెరికా చరిత్రలో చెరిగిపోని మచ్చ, ప్రపంచ వ్యవహారాలను ఎంత దరిద్రంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికీ వెల్లడించింది. అమెరికా కనుసన్నలలోని ప్రభుత్వాలు మూడు లక్షల మంది మిలిటెంట్లను నిర్బంధించటం లేదా పౌర జీవనంలోకి అనుమతించాయని అంచనా. ఇప్పుడు వారంతా తిరిగి ఆయుధాలు పట్టుకొని తెగబడితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న.
మన దేశం విషయానికి వస్తే తీసుకోవాల్సిన గుణపాఠం ఏమిటి? అమెరికా, ఇతర దాని మిత్రపక్షాలు ఏమి చేస్తాయి అనే దానితో నిమిత్తం లేకుండా చైనా, రష్యా, అఫ్ఘాన్ ప్రభుత్వంతో స్వతంత్రంగా వ్యవహరించాలని రష్యన్ పరిశీలకుడు అలెగ్జాండర్ వి లోమనోవ్ చెప్పారు. అఫ్ఘాన్ కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు గనుక వారి మాటలు వినండి వారి చర్యలను గమనించండి అన్న కన్ఫ్యూసియస్ బోధనల సారాన్ని గమనంలో ఉంచుకొని రెండు దేశాలూ వ్యవహరించాలి. దాని అర్ధం చూస్తూ ఉండమని కాదు అని లోమనోవ్ అన్నారు. పశ్చిమ దేశాల వార్తా సంస్థలు, మీడియా కథనాలు గత కొద్ది వారాలుగా అతిశయోక్తులను ప్రచారం చేశాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన అఫ్ఘాన్ పౌరులు తప్ప సామాన్య జనం పెద్ద సంఖ్యలో శరణార్ధులుగా ఇరుగుపొరుగు దేశాలకు తరలిపోతున్న సమాచారం, పరిస్ధితిగానీ లేదు. తమ దేశాల్లో ఉన్న నగదు, ఇతర ఆస్తులను వినియోగించుకోనివ్వకుండా నూతన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అమెరికా కూటమి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమ దేశాలకు భిన్నంగా తాముంటామని చైనా, రష్యా స్పష్టం చేశాయి. మన దేశం ఇప్పటికైనా స్వతంత్ర వైఖరిని అనుసరిస్తుందా, అమెరికా తోక పట్టుకొని వెళుతుందా?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News