Saturday, April 27, 2024

చరిత్రాత్మకం చరితార్థులం

- Advertisement -
- Advertisement -

CM KCR lays foundation stone for TRS office in Delhi

నాడు జలదృశ్యం వద్ద ఊపిరిపోసుకున్న టిఆర్‌ఎస్:
నేడు ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన జరుపుకున్నది

అప్పుడు పార్టీకి ప్రాణ ప్రతిష్ట చేసిన ఉద్యమ నేత కెసిఆర్ చేతుల మీదగానే ఇప్పుడు భూమి పూజ జరుపుకోవడం చారిత్రక సన్నివేశం. ఈ రోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలోనూ టిఆర్‌ఎస్ పార్టీ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుంది : ఢిల్లీలో టిఆర్‌ఎస్ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ః

14 ఏళ్ల ఉద్యమ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది తెలంగాణ
పదమే నిషిద్ధమైన రోజుల నుంచి ముందుకు సాగి ఇంతవరకు వచ్చింది చంద్రబాబు కక్షపూరిత
పాలన, తెలంగాణ ఆశను చిదిమేయాలని చూసిన వైఎస్‌ఆర్ హయాంలలో ఎదురైన అడ్డంకులన్నీ
తొలగించుకుంటూ విజయగమ్యాన్ని చేరుకున్నది ఈ చరిత్రాత్మక ప్రస్థానంలో తెలంగాణ
ఆకాంక్షకు కెసిఆర్ అందరి మద్దతు విస్తృతంగా కూడగట్టుకున్నారు : కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: రెండు దశాబ్దాల టిఆర్‌ఎస్‌లో మరో కీలక ఘట్టానికి పునాది పడింది. దేశ రాజధానిలో టిఆర్‌ఎస్ భవన్ నిర్మాణానికి గురువారం తొలి అడుగు పడింది. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో తెలంగాణ భవన నిర్మాణం కోసం కేంద్రం కేటాయించిన స్థలంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. భవన్ నిర్మాణ స్థలం దగ్గర ప్రత్యేకంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. సరిగ్గా ఒంటిగంట 48 నిమిషాలకు కార్యాలయం నిర్మాణం కోసం కెసిఆర్ భూమిపూజ చేశారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో పార్టీకి చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కోసం సిఎం కెసిఆర్ దంపతులతో పాటు పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రెండు రోజుల క్రితమే ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఏడాదిలోగా పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు చేసింది.

టిఆర్‌ఎస్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భం , ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన ఘట్టం ఒకేసారి జరగడం చరిత్రాత్మకం. ఇది ఒక కీలక మైలురాయిగా భాషిస్తుంది. భవిష్యత్తులో కేంద్ర రాజకీయాలకు ఇది నాందిగా టిఆర్‌ఎస్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. సుమారు రూ. 40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జి ప్లస్ 3 భవన సముదాయంతో భవనాన్ని నిర్మించనున్నారు. మీటింగ్ హాల్‌తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని వసతులుండేలా ఈ భవన నిర్మాణాన్ని డిజైన్ చేశారు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ వల్ల కార్యక్రమం ఎప్పటికప్పడు వాయిదా పడుతూ వచ్చింది. రెండు దశాబ్దాల క్రితంహైదరాబాద్‌లోని జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టిఆర్‌ఎస్ ఇవ్వాళ దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి అదే నాయకుడి చేతుల మీదుగా భూమి పూజ జరుపుకోవడం ఒక చారిత్రక సన్నివేశమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు.

ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు టిఆర్‌ఎస్ పార్టీ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్ర తో పాటు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రయాణాన్ని ఆయన ప్రస్తావించారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదన్నారు. తెలంగాణ పదమే నిషిద్ధమైన రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఉన్న జలదృశ్యం నుండి సామాన్లు అన్నీ రోడ్డున పడేసిన చంద్రబాబు కక్షపూరిత పాలన, తదనంతరం తెలంగాణ ఆశను చిదిమేయాలని చూసిన వైఎస్‌ఆర్ పాలన వరకు ఎదురైన అన్ని అడ్డంకులన్నీ ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ టిఆర్‌ఎస్ ముందుకు సాగిందన్నారు. రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటూ, చిక్కుముళ్లని విప్పుకుంటూ, తెలంగాణ గల్లీలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూనే అటు ఢిల్లీ పవర్ కారిడార్లలో లాబీయింగ్ ద్వారా తెలంగాణ ఆకాంక్షకు కెసిఆర్ విస్తృతంగా మద్దతు కూడగట్టారన్నారు. తన తొలి అడుగే త్యాగంతో మొదలు పెట్టిన ఆయన నేతృత్వంలో టిఆర్‌ఎస్ నాయకులు ఎన్నో సార్లు పదవులను పూచిక పుల్లల్లా విసిరేశారన్నారు.

అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు జాతీయా పార్టీలు తెలంగాణ అంశంపై ఎన్ని దాగుడుమూతలు ఆడినా, మడమతిప్పకుండా ఉద్యమాన్ని కొనసాగించి, చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి చివరికి డిల్లీ మెడలువంచి ఆరు దశాబ్దాల ఆకాంక్షను కెసిఆర్ నెరవేర్చారన్నారు. గత ఏడేళ్ల స్వయం పాలనలో కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అప్రతిహతంగా పురోగమిస్తున్నదని కెటిఆర్ అన్నారు. తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్ద పీట వేస్తూ, ఉమ్మడి పాలనలో జరిగిన విధ్వంసం నుండి ఒక మహత్తరమైన పునర్నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఉద్యమానికి ముందు ప్రత్యేక రాష్ట్రానికి తర్వాత సైతం రెండు దశాబ్దాలుగా తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పర్యాయపదంగా తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచిందంటే అతిశయోక్తి కానే కాదన్నారు. తెలంగాణ సాధన, పునర్నిర్మాణం అనే రెండు చారిత్రక కర్తవ్యాలను విజయవంతంగా నెరవేర్చిన టిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు దేశ రాజధానిలో ఒక గొప్ప కార్యాలయం నిర్మాణానికి సిఎం కెసిఆర్ చేతులమీదుగా భూమిపూజ జరిగిందన్నారు. రాష్ట్రం నుండి వచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తల నడుమ ఒక పండుగలా ఈ వేడుక జరిగిందన్నారు. పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో నిర్వహించిన కార్ల ర్యాలీ నుంచి మొదలు కొని తెలంగాణ ఏర్పాటు కోసం నిరంతరం ఢిల్లీకి చేసిన అనేక ప్రయాణాలను ఉద్వేగంతో స్మరించుకున్న విషయాన్ని కెటిఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ సర్ మాటలాగ, ఇవ్వాళ తెలంగాణ గులాబీ పతాకం ఢిల్లీ గడ్డ మీద రెపరెపలాడటం ప్రతి తెలంగాణ బిడ్డ ఒక గొప్ప భరోసాను ఇస్తుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. దక్షిణ భారత దేశం నుండి ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో ఒక కార్యాలయం స్థాపించడం ఇది రెండవది కావడం టిఆర్‌ఎస్ శ్రేణులకు గర్వకారణమన్నారు. పార్టీ కోసం అనునిత్యం పాటుపడుతున్న పార్టీ ప్రజాప్రతినిధులకూ, నాయకులకూ, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఢిల్లీ నడిబొడ్డున రాష్ట్ర కీర్తి పతాకం : మంత్రి వేముల

2001లో ఒక్క అడుగుతో టిఆర్‌ఎస్ ప్రస్థానం మొదలై నేడు దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున రాష్ట్ర కీర్తిని ఎగురవేసేలా సిఎం కెసిఆర్ కృషి చేశారని రాష్ట్ర రోడ్లు, -భవనాలు గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణానికి టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ భూమి గురువారం భూమి పూజ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ పార్టీ కార్యాలయ భవనం నమూనాలు కొన్ని సిద్ధమయ్యాయని, నమూనాలను పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్లాన్ ఓకే చేసిన వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలుకు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఢిల్లీలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించినందుకు తాను కూడా ఒక కార్యకర్తగా గర్వపడుతున్నానన్నారు. తనను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. మొదటి నుంచి పార్టీతో ఉన్నవాళ్లలో తాను ఒక్కణ్ణి అని ఆయన తెలిపారు. రాష్ట్ర కల సాకారమై, ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఎన్నో పథకాలు ఇతర రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో ఏర్పాటయ్యే టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ద్వారా ప్రభుత్వ పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయవచ్చన్నారు. దేశ రాజకీయాల్లో టిఆర్‌ఎస్ సూచనలు, సలహాలు అవసరమని తాను భావిస్తున్నానన్నారు. దేశ రాజకీయాల్లో కెసిఆర్ కీలక భూమిక పోషించాలని తాను కోరుకుంటున్నానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News