Monday, April 29, 2024

వంటిమామిడి మార్కెట్‌ను సందర్శించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

వంటిమామిడిలో 50 ఎకరాల్లో కోల్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తాం
ఏజెంట్లు రూ.4ల కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దు
సిద్దిపేటలోని మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కెసిఆర్
అక్కడి పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్న సిఎం

CM KCR review on Agriculture and Marketing Department

మన తెలంగాణ/హైదరాబాద్/సిద్దిపేట/ములుగు: రైతులు కూరగాయాలు నిల్వ చేసుకునేందుకు వీలుగా 50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజి నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకు అనువైన స్థలాన్ని గుర్తించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను సిఎం కెసిఆర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలతో సంబంధిత అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులపై ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆరా తీశారు. మార్కెట్‌లో ఉన్న పలువురు రైతులు, వ్యాపారులతో ఆయన నేరుగా ముచ్చటించారు. మార్కెట్‌లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమిటీ? ఏజెంట్‌లు ఎంత కమీషన్ తీసుకుంటున్నారని సిఎం ప్రశ్నించారు. మార్కెట్ అభివృద్ధికి ఇంకా ప్రభుత్వం చేయాల్సింది ఏమైనా ఉందా? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులతో పంట సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ సౌకర్యం, బహిరంగ విపణిలో కూరగాయాల ధరల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. సంప్రదాయ పంటల సాగు స్థానంలో సాగు మెళకువలు తెలుసుకుంటూ శాస్త్రీయ విధానంలో పంటల సాగు చేపడితే వ్యవసాయం, కూరగాయల సాగు లాభసాటిగా ఉంటుందని సిఎం కెసిఆర్ సూచించారు. వంటి మామిడి మార్కెట్ యార్డును మరో 14 ఎకరాలు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్‌లో 107 షాపులకుగాను 16 షాపులు ఖాళీగా ఉన్న దృష్టా వీటిని ఏజెంట్లు లేకుండా ప్రభుత్వమే చేపట్టాలని సూచించారు. ఈ మార్కెట్ నుంచే కూరగాయలను సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.

మార్కెట్‌ల్లో మరింత కనీస సౌకర్యాలపై దృష్టి సారించే విధంగా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా పలువురు సిఎంకు ఫిర్యాదు చేశారు. మార్కెట్‌కు వచ్చిన కూరగాయలను విక్రయాల జరిగిన తరువాత మిగిలిపోయిన వాటిని పారబోయాల్సి వస్తోందని వారు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్‌లోని ఏజెంట్‌లు రూ.10లు కమీషన్ తీసుకుంటున్నారని కూడా సిఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై సిఎం వెంటనే స్పందించారు. ఏజెంట్లు రూ.4 కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దని స్పష్టం చేశారు. విత్తనాల కోసం రైతులు ఆగ్రా, ఢిల్లీకి వెళ్లే సమస్య లేకుండా చేస్తామన్నారు. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి రైతులకు ఇక్కడే విత్తనాలు అందజేస్తామని పేర్కొన్నారు. రైతుల కోసం వంటిమామిడి మార్కెట్లో ఎటిఎం సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం కల్పించడంతో పాటు ప్రజలకు ఫ్రెష్‌గా కూరగాయలు అందించాలన్నదే తన లక్షమన్నారు. మార్కెట్‌లో పారిశుద్ధ పనులపై సంబంధిత అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకునేలా తగు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. దీనిపై రైతులు, వ్యాపారులు కూడా తగు శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.
అనంతరం సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజవర్గ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డితో సిఎం చర్చించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం వెంట రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, వంటి మామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ జహంగీర్, రాష్ట్ర మార్కెటింగ్ శాఖా డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆర్‌డిఒ విజయేంద్రరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ తదితరులు ఉన్నారు.

CM KCR Inspects Siddipet Vantimamidi Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News