Saturday, April 27, 2024

గోదావరి ప్రాజెక్టులపై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష..

- Advertisement -
- Advertisement -

 రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టుల్లో 77టిఎంసిల నిలువ
 డెడ్‌స్టోరేజి కింద 40టిఎంసీలు మినహాయింపు
 రాష్ట్ర అవసరాలకు అందుబాటులో 37టిఎంసిలు
 తాగునీటి అవసరాలపై ముందు జాగ్రత్తలు
 రిజర్వాయర్లలో నీటినిల్వపై నేడు సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచిపోయింది. ప్రధాన నదు లు నీటి ప్రవాహాలు లేక ఇసుక తెన్నెలతో ఇంకా వేసవి కాలపు నాటి పరిస్థితులనే తలపిస్తున్నాయి. కృష్ణానదీ పరివాహకంగా ఎగువన మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి ఉజ్జయినీ, ఆల్మట్టి, నారాయణ పూర్, తుంగభద్ర తదితర అక్కడి రిజర్వాయర్లన్నీ నిండితే తప్ప తెలంగాణ రాష్ట్ర భూభాగంలోకి కృష్ణానదీజలాలు వచ్చే పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల జాప్యం వల్ల ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కేంద్ర జలసఘం అంచానాలను బట్టి చూస్తే ఈ నెలాఖరుకు గాని కృష్ణమ్మ పరవళ్లు తొక్కే పరిస్థితులు లేవంటున్నారు.

ఇక తెలంగాణ వ్యవసాయరంగం ఆశలన్ని గోదావరి నదీజలాలపైనే ఉన్నాయి. గోదావరి నదిలో చుక్క నీరు ప్రహహించినా తెలంగాణ రాష్ట్రం దాటి దిగువకు పోయే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర తాగు , సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేసిఆర్ సర్కారు ఎంతో ముందు చూపుతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టి సత్వర ఫలితాలను చేకూర్చేలా చర్యలు తీసుకున్నారు. గోదావరి నదీపరిహాకంగా ఉన్న ప్రధాన ప్రాజెక్టులు ఇప్పుడున్న పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా చేశాయి. మిషన్ భగీరధ ద్వారా ఉత్తర తెలంగాణ రాష్టమంతటికీ తాగునీరు అందుతొంది. కృష్ణనదీ బేసిన్ పరిధిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలకు కూడా గోదావరి జలాలే దూప తీర్చగలుగుతున్నాయి.

గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపైన ముఖ్యమంత్రికేసిఆర్ ఆదివారం నీటిపారుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మేల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన నున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అత్యంత కీలకమైన ఈ సమావేశంలో రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నిలువ నీటిపైనే సమీక్ష జరగనున్నట్టు సమాచారం, తెలంగాణ పరిధిలోని గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో శనివారం నాటికి 77టిఎంసీల నీరు నిలువ ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజి కింద సుమారు 40టిఎంసీలు మినహాయిస్తే ఇంకా 37టిఎంసీల మేరకు లభ్యత నీరు అందుబాటులో ఉండనుందని అధికారులు అంచనా వేశారు. ఈ నీటిని ఖరీఫ్ పంటల సాగు అవసరాలకు ఏంత వరకు ఉపయోగించుకోవచ్చన్నది సిఎం సమీక్షలో చర్చించనున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగు ఆలస్యం కాకుండా నారుమళ్లు పోసుకునేందుకు ఇందులో ఎంత నీటని ఉపయోగించుకోవచ్చనేదానిపై అంచనాకు రానున్నారు.

వర్షాల జాప్యంతో సర్కారు మరింత అప్రమత్తం
వర్షాలు జాప్యం వల్ల తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గోదావరి నదిలో నీటి ప్రహాహాలు అడుగంటాయి. మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరి నదిపై ఉన్న బాబ్లీ గేట్లు శనివారం తెరుచుకునాయి.అయితే బాబ్లీ గేట్ల ద్వారా దిగువకు వస్తున్న నీరు లెక్కలోకి తీసుకునేంతగా కూడా లేదు. మరో వైపు శ్రీరాం సాగర్‌లో ప్రాజెక్టులోకి నదీలో ఊటనీటిగా 553క్యూసెక్కుల ఇన్‌ప్లో చేరుతోంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 20టిఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది జులై 1నాటికి ఈ ప్రాజెక్టులో 23.43టిఎంసీల నీరు నిలువ ఉండేది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో ఉన్న నిలువ నీటి నుంచి స్పిల్‌వే ద్వారా 50 క్యూసెక్కులు , కాలువల ద్వారా 152క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 351క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. దిగువన ఎల్లపల్లి ప్రాజెక్టులో 11.92 టిఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది ఈ సమయానికి ఎల్లంపల్లిలో 8.56టిఎంసీలు నిలువ వుండేది.

ఆదుకుంటున్న కాళేళ్వరం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగానికి కాళేశ్వరం పెద్ద వరంగా మారింది. ఖరీఫ్ పంటల సాగుకు నారుమళ్లు పోసుకునేందుకు కాళేశ్వరం జలాలే ఇప్పుడు పెద్ద భరోసా నిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాలమేరకు గత నెల 21నుంచే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి పంపుల ద్వారా గోదావరి నదీజలాల ఎత్తిపోతను ప్రారంభించింది. మిడ్‌మానేరు నుంచి రంగనాయక సాగర్‌కు 3400క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ వస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులో 18.16టిఎంసీల నీరు నిలువ ఉంది.గత ఏడాది ఈ సమాయానికి ఈ ప్రాజెక్టులో 7.43టిఎంసీలు మాత్రమే నిలువ వుండేది. రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి 2టిఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్టు అధికారులు వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 3.63టిఎంసీల నీరు నిలువ ఉంది. ఈ నీరు ఆయకట్టుకు ఆగస్ట్ దాక మూడు తడులు అందించేందుకు సరిపోతాయిని అంచాన వేశారు. ఆగస్ట్ తర్వాత మరో మూడు తడులు అందిచాలంటే 5టిఎంసీల నీరు అవసరం అని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా 1405క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీరాం సాగర్ పునరుజ్జీవన పథకం కింద 30టిఎంసీల నీటిని కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయాలన్న అభిప్రాయంతో ఉన్నారు . ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో మరో 10టిఎంసీలు నింపుతున్నారు.సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 17.13టిఎంసీలనీరు నిలువ ఉంది.గత ఏడాది ఈ సమయానికి ఈ ప్రాజెక్టులో 19టిఎంసీల నీరు నిలువ వుండేది.ప్రధాన గోదావరి నదిలో నీటి ప్రవాహం ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేనప్పటికీ ,తక్షణ అవసరాల కోసం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న ప్రాణహితపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రాణహిత పరిహాహరంగా వర్షాలు కురిసి నదిలో మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరిగితే ఉత్తర తెలంగాణలో బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

Also Read: నేడు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News