Monday, April 29, 2024

ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

CM KCR review with state police and forest department officials

 

కలప స్మగ్లింగ్, గుడుంబాపై కఠిన చర్యలు

అటవీ, పోలీసు శాఖ సమన్వయంతో పక్కా వ్యూహాలు మహిళల
సంరక్షణకు మరింత శ్రమ నకిలీ సర్టిఫికెట్ల ముఠాల ఆటకట్టించండి
కారుణ్యనియామకాల్లో ఆలస్యం వద్దు దళితులపై దాడులు
జరగకుండా ముందస్తు చర్యలు దేశంలో పలుచోట్ల జరుగుతున్న
అకృత్యాలు శోచనీయం దురాచారాలకు సమాజం దూరం కావాలి
10 లక్షల సిసి కెమెరాల ఏర్పాటు వేగవంతం చేయండి
శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి తెలంగాణ ఆదర్శం
పోలీసు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు.  బుధవారం ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష చేశారు. సామాజిక రంగాలలో నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేయాల్సిన అవసరాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఆయన వివరించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తున్నదన్నారు. మహిళా సంరక్షణ కోసం పోలీసులు మరింతగా శ్రమించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను పూర్తిగా అరికట్టాలన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. కలప స్మగ్లింగును గత పాలకులు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కొందరికి అలుసుగా మారిందన్నారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం ఎంతమాత్రం సహించదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని సిఎం తెలిపారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడంలో కేవలం అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్ పోలీసు వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరముందన్నారు. సమాజంలో భాగస్వామ్యమై నేరాలను అరికట్టినట్టు, ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా పోలీసులు అడవుల పట్ల అవగాహన పెంచుకుని, స్మగ్లింగు వంటి అటవీ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు.

అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ దిశగా ముందుకు సాగాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఎప్పటికప్పుడు ఇరు శాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగు నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తద్వారా మాత్రమే సమాజానికి మనం అనుకున్న విధంగా సేవ చేయగలుగుతామన్నారు.

గుడంబా నిర్మూలనలో ఘన విజయం

తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

దళితులపై దాడులు జరగడం శోఛనీయం

దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఈ సందర్భంగా సిఎం ఆకాంక్షించారు. దళితుల మీద దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పోలీసులకు సిఎం వివరించారు. ఆ దిశగా ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మెలగాలన్నారు. బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థకున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారుల దగ్గరనుంచి కిందిస్థాయి పోలీసు వరకు సమాజంలో ఒకరిగా భాగస్వాములు కావాలన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా పౌరులందరికీ గౌరవాన్ని ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి పోలీసుకున్నదన్నారు. ఆ క్రమంలో తమ దగ్గరికి రక్షణ కోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సిఎం హితవు పలికారు.

నకిలీ సర్టిఫికెట్ల ముఠాపై కఠినంగా వ్యవహరించాలి

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని సిఎం కెసిఆర్ అన్నారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడుదారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.

కారులో ఇంటికాడ దించివచ్చే సంప్రదాయాన్ని కొనసాగించాలి

పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. తన జీవితకాలం పాటు డిపార్టుమెంటుకు సేవలందించిన ఉద్యోగి రిటైరయితే, వారిని సత్కరించి కారులో ఇంటికాడ దించివచ్చే మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలని అన్నారు.

కారుణ్య నియామకాలలో ఆలస్యం వొద్దు

పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదని సిఎం కెసిఆర్ అన్నారు. డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. దీనిపై తక్షణ తగు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్ లిస్టులో వున్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డిజిపి మహేందర్ రెడ్డికి ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ సూచించారు. అలాగే పోలీసు శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం మరింతగా కృషి జరగాల్సిన అవసరమున్నదన్నారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళల కోసం 33శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తున్న నేపథ్యంలో,ఆ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నదన్నారు. అందులో భాగంగా మహిళలు పనిచేసే పోలీసు కార్యాలయాలు స్థలాల్లో ప్రత్యేకించి రెస్ట్ రూములు, వసతులు కల్పించాలన్నారు.

10 లక్షల సిసి కెమెరాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి

హైదరాబాద్‌లో పది లక్షల సిసి కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డిజిపికి సిఎం సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటి పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలొ సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని తెలిపారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్ లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. వ్యవస్థీకృత నేరాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సిఎం కార్యదర్శులు స్మితాసభర్వాల్, ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్‌పిలు, పోలీస్ కమిషనర్లు, రేంజ్ డిఐజీలు, జోనల్ ఐజీలు, తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సిఎంఒ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News