Friday, May 3, 2024

‘విజయసిద్ధి’పేట

- Advertisement -
- Advertisement -

తెలంగాణను తెచ్చిన గడ్డ, సిద్దిపేట నా ప్రాణం. సిద్దిపేట లేకుంటే
కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేనిది తెలంగాణ లేదు, ఇక్కడ ప్రారంభమైన నీళ్ల
పథకమే మిషన్ భగీరథ, దేశంలోనే 98.31శాతం ఇండ్లకు నల్లాల ద్వారా
నీళ్లందిస్తున్న రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు
తెలంగాణకు అందమైన స్పాట్‌గా మారనున్న రంగనాయక సాగర్
ఆణిముత్యం లాంటి నాయకులు మంత్రి హరీశ్‌రావు

భగవంతుని దయ, అందరి దీవెనలతో ప్రతి పని విజయవంతం

గేటెడ్ కమ్యూనిటీ  తరహాలో సిద్దిపేట డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, ప్రజా ధనాన్ని
సద్వినియోగం చేసుకున్న గడ్డ ఇది, సిద్దిపేట అభివృద్దిని చూసి
నేర్చుకోవాలి, రాబోయే రోజుల్లో అద్భుతమైన పట్టణంగా సిద్దిపేట
రాష్ట్రానికి వచ్చే రెండో ఎయిర్‌పోర్టు ఈ ప్రాంతంలోనే : సిద్దిపేట
బహిరంగ సభలో సిఎం కె. చంద్రశేఖర్‌రావు, పర్యటనలో అడుగడుగునా
ఘన స్వాగతాలు సిఎంను చూసి పులకించిపోయిన ప్రజలు

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింప చేసిన గడ్డ సిద్దిపేట అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం సిద్దిపేట నియోజవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు చేసిజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట తన ప్రాణమని, సిద్దిపేట లేనిదే.. కేసీఆర్ లేడని.. కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం లేదని, సిద్దిపేటకు ఎంత చేసిన తక్కువేనని అన్నారు. సిద్దిపేట పేరులోనే ఓ ప్రత్యేకత ఉందని, ఏ కార్యం మొదలుపెట్టినా.. విజయం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్లున్న క్రమంలో ఆయనను ఆపి సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయించి ప్రత్యేక జిల్లాగా సిద్దిపేట ను ఏర్పాటు చేయాలని కోరుతూ మ్యాప్‌ను అందించామని  అన్నారు. అయినా ప్రత్యేక జిల్లా సాధ్యం కాలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక వెనుకబడ్డ, గిరిజన ప్రాంతాలతో పాటు, వెలుతురు లేని చోట అభివృద్ధి చేయాలనే లక్షంతో మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు కనిపించేవని, వాటిని తలుచుకుంటే కళ్లలోకి నీళ్లు వచ్చేవని తెలిపారు. ముఖ్యంగా రైతులు బోర్లు వేస్తే నీళ్లు పడక సాగు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవని గుర్తు చేశారు. ఓ వైపు నీళ్లు, మరో వైపు కరెంటు కష్టాలతో రైతులు సతమతమయ్యే వారని ట్రాన్స్‌ఫార్మర్లు పటాలకుల్లాగా పేలిపోయేవని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కరెంటు బాధలు లేకుండా చేసుకున్నామని అన్నారు. రంగనాయక సాగర్ గుట్టమీద నీళ్ల ట్యాంక్ కట్టడానికి ఎన్నోకష్టాలు ఆ కాలంలో పడ్డామని అన్నారు. ఐటీ టవర్ ప్రారంభం రోజే నాలుగు కంపెనీల ప్రతినిధులు ఒప్పందాలు కుదుర్చుకున్నారని అన్నారు. సిద్దిపేట ప్రాంతం రాబోయే రోజుల్లో అద్బుతంగా మారబోతుందని, రాష్ట్రానికి వచ్చే రెండో ఎయిర్ పోర్టు ఈ మార్గం వైపే రాబోతుందని అన్నారు. అలాగే త్వరలోనే రైలు కూత సైతం సిద్దిపేటలో వినబడబోతుందని అన్నారు .సిద్దిపేట ప్రజాధనాన్ని సద్వినియోగం చేసుకునే గడ్డ అని కొనియాడారు. రాష్ట్రంలోని నాయకులు సిద్దిపేటను చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

సిద్దిపేటలో పుట్టిన పథకమే మిషన్ భగీరథ

ఒకప్పుడు సిద్ధిపేటలోనే మంచి నీళ్ల పథకం నేడు రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంగా మారిందని అన్నారు. దేశంలోనే 98.31 శాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు నీటి సమస్య అధికంగా ఉండేదని తెలిపారు. అప్పట్లో పట్టణ ప్రజలకు వ్యవసాయ బోర్ల వద్ద నుంచి ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని అందించామని, అవి కూడా సరిపోని పరిస్థితి ఉండేదని అన్నారు. ఆ నీటి కష్టాలను తీర్చేందుకు లోయర్ మానేరు ద్వారా నీటిని సిద్దిపేటకు తరలించామని తెలిపారు. అప్పుడు మొదలైన నీటి పథకమే నేడు మిషన్ భగీరథగా రాష్ట్రంలో అమలవుతుందన్నారు.

తెలంగాణకు అందమైన పర్యాటక కేంద్రంగా రంగనాయకసాగర్

రంగనాయక సాగర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఇది రాష్ట్రానికే పర్యాటక కేంద్రంగా మారబోతుందన్నారు. రంగనాయక స్వామి, కాళేశ్వరం దేవుని దయతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని అన్నారు. 365 రోజులు గోదావరి జలాలతో రంగనాయక సాగర్ నిండుకుండలా ఉండి ఈ ప్రాంతానికి సాగు నీరు అందిస్తుందని అన్నారు. రంగనాయక్ సాగర్ అభివృద్ధికి మరో రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నానని, ఈ నిధులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, అన్ని కార్యక్రమాలకు వేదికగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ అభివృద్ది కళ్లతోచూసిన సరిపోనివిధంగా ఉండాలన్నారు. ప్రపంచ స్థాయి శుభ కార్యక్రమాలు సైతం ఇక్కడే జరిగే విధంగా తీర్చిదిద్దాలన్నారు.
ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 80 కోట్లు మంజూరు
సిద్దిపేట నియోజవర్గంతో పాటు దుబ్బాక, గజ్వెల్ నియోజవర్గాలకు చెందిన పలు గ్రామాలకు కాళేశ్వరం జలాలను అందించడానికి ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 80 కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. దీంతో ఆ గ్రామాల్లోని పంట పొలాలకు గోదావరి జలాలు అందుతాయని దీంతో పంట పొలాలన్ని సస్యశ్యామలం అవుతాయని అన్నారు.

రూ. 160కోట్లతో నియోజవర్గ స్థాయి ఔటర్ రింగ్ రోడ్డు

సిద్దిపేటకు రూ. 160 కోట్లతో మరో ఔటర్‌రింగ్‌రోడ్డును మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇది దుద్దెడ రాజీవ్ రహదారి నుంచి పొన్నాల రాజీవ్ రహదారిని కలుపుతూ మొత్తం 76 కి.మీ, 22 గ్రామాల చుట్టూ ఈ రింగ్ రోడ్డు నిర్మాణమవుతుందని అన్నారు. అలాగే సిద్దిపేట నుంచి సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట వరకు 25 కి.మీ మేర నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తామని తెలిపారు. ఈ నాలుగు లైన్ల రహదారి నిర్మాణంతో ఆ ప్రాంతంలో ఉన్న అనంతగిరి పోచమ్మ ప్రాజెక్టుకు సైతం పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News