Wednesday, May 1, 2024

రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర

- Advertisement -
- Advertisement -

భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన ఫోటోను పోస్టులో పెట్టి పెడర్థాలు తీస్తున్నారు. ‘న మోడీ , న యోగి, న జైశ్రీరామ్, దేశ్ పర్ రాజ్ కర్నా మజ్దూర్ ఇన్సాన్’ అనే బ్యానర్ ఉన్న పాత ఫోటోను ప్రచారంలో పెట్టి భావోద్వేగాల్ని రెచ్చగొట్టే ఉద్దేశం కనబడుతోంది. రైతులకు ఆపాదిస్తూ ‘వుయ్ వాంట్ ఖలిస్థాన్’ అనే అట్ట పట్టుకున్న పాత ఫోటో ఒకటి ముమ్ముర ప్రచారంలో ఉంది.

Social media support to Farmer protest

నేడు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చిన విషయాల్ని కీర్తిస్తూ, నచ్చని సమాచారాన్ని దూషిస్తూ, కించపరుస్తూ వాటిని ప్రచారంలో పెట్టడమే పనిగా మారిపోయింది.. అదొక మానసిక ప్రవృత్తికి సంబంధించిన అంశం. తమ నమ్మకానికి, భావజాలానికి అనుకూలంగా ఉన్న పోస్టు పూర్తిగా అబద్ధమని తెలిసినా దాని ప్రచారంలో ఉన్న ఆనందం వేరు. ఇప్పుడు ఈ వెర్రితలలే సమాంతర సమాచార వ్యవస్థను నిర్మిస్తున్నాయి. పనిలోపనిగా గత రెండు వారాలుగా ఢిల్లీలో సాగుతున్న రైతుల ఆందోళనపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని ఈ పైత్యానికి పరాకాష్ట భావించాలి.
కింది కులాల ఎదుగుదలను జీర్ణించుకోలేని అగ్ర వర్ణాలు బిజెపి రాజ్యాధికారం తర్వాత తమ ద్వేషాన్ని బహిరంగంగా, అధికారికంగా వెలకక్కడానికి సిద్ధమయ్యాయి. గ్రామాల్లో భూస్వామి ఊర్లోని చిన్న రైతులు తన అదుపాజ్ఞల్లో బతుకాలని కోరుకుంటాడు. మధ్యలో కొంత పట్టు తప్పినా మతపర భావనల వ్యాప్తి, సంకుచిత జాతీయ శక్తుల పాలన వల్ల ధనిక వర్గాల క్రూర పంజాల గోళ్లు మరింత పదునెక్కాయి. దాంతో ప్రత్యక్ష దాడులతో పాటు సామాజిక మాధ్యమాలు సకల ఆధిపత్య భావనలకు దుష్ప్రచారాలకు వేదికలయ్యాయి. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనను ఇప్పుడు అబద్ధపు వార్తలతో తప్పుడు వీడియో క్లిప్పింగులతో దేశ ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం భారీ ఎత్తున సాగుతోంది.
రైతుల ఉద్యమానికి సంబంధం లేని, అసలు పొంతన లేని ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి రైతుల గోడుకు ఉగ్రవాదరంగు పులిమి వారి ఆందోళన దేశ భద్రతకే ముప్పులా ప్రచారం మొదలైంది. రైతుల సమస్యల పట్ల సానుభూతి ఉన్నా లేకున్నా పర్వాలేదు కాని నిరసనలను సత్యాగ్రహ మార్గంలో వ్యక్తపరిచే హక్కును బద్నామ్ చేయడం పైశాచికం. చట్టాలపై చర్చోపచర్చలు చేయవచ్చు. విషయాన్ని విశదపరచి సమాధానపరచవచ్చు. కోట్లాది మంది ఇష్టపడని నిర్ణయాలను జనాభిప్రాయమే శిరోధార్యంగా ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవచ్చు, పునరాలోచన చేయవచ్చు. అదేదీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనను ఎలా దొంగ దెబ్బ తీయాలనే పనిగా పడినట్లుంది. దానిని ఉగ్ర ముప్పుగా చిత్రించి రైతుల చర్య పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకతను సృష్టించేందుకు బిజెపి, ఐటి విభాగం నడుము కట్టింది. వారి అవాస్తవాల చిట్టా ఈ విధంగా ఉంది. ఏనాడో బ్రిటన్‌లో జరిగిన ఖలిస్థాన్ అనుకూల నినాదాల చిత్రాన్నిపోస్టు పెట్టి రైతు ఉద్యమానికి ఖలిస్తానీ రంగు పూసే యత్నం జరుగుతోంది. 2019 లో ఐఐసి వరల్డ్ కప్ ఆట మైదానంలో కొందరు సిక్కులు ఇచ్చిన పాకిస్తాన్ అనుకూల నినాదాల వీడియోను ఇప్పుడు రైతుల కంటగడుతున్నారు. అయితే ఖలిస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ కు అనుకూల నినాదాలు అంతా అబద్ధం. పాత వీడియోలతో ఇది దుష్ప్రచారమని పంజా బ్ బిజెపి నాయకుడు, మాజీ మంత్రి మనోరంజన్ కాలియా ప్రకటించడం విశేషం.
భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన ఫోటోను పోస్టులో పెట్టి పెడర్థాలు తీస్తున్నారు. ‘న మోడీ , న యోగి, న జై శ్రీరామ్, దేశ్ పర్ రాజ్ కర్నా మజ్దూర్ ఇన్సాన్’ అనే బ్యానర్ ఉన్న పాత ఫోటోను ప్రచారంలో పెట్టి భావోద్వేగాల్ని రెచ్చగొట్టే ఉద్దేశం కనబడుతోంది. రైతులకు ఆపాదిస్తూ ‘వుయ్ వాంట్ ఖలిస్థాన్’ అనే అట్ట పట్టుకున్న పాత ఫోటో ఒకటి ముమ్ముర ప్రచారంలో ఉంది. మార్ఫింగ్ ద్వారా సిక్కు మీసాలు తొలగించి ముస్లిం తీవ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు. నిహంగ్ సిక్కుల గుర్రాల, ఏనుగులతో కూడిన ర్యాలీకి చెందిన పాత వీడియోను పోస్ట్ చేసి సిక్కులు భారీ ఎత్తున ఢిల్లీపై దండయాత్రకు వస్తున్నారని భయానికి గురి చేస్తున్నారు. తలపై పాగాను తొలగించి సిక్కు వేషంలో ముస్లిం ఆందోళనలో పాల్గొంటున్న రహస్యాన్ని బయటపెట్టినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి అది 2011 లో పంజాబ్ లోని మొహాలీలో జరిగింది. ఆలా అవమానపరచినందుకు యునైటెడ్ సిక్స్ చండీగఢ్ ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీసు అధికారులు సస్పెండయ్యారు. ఇదే ఫోటోను సిటిజెన్ షిప్ అమెండ్‌మెంట్ వ్యతిరేక ఆందోళనలో కూడా వాడబడింది. భయంతో పరుగు తీస్తున్న ఓ వృద్ధ రైతుపై పోలీసు లాఠీ ఎత్తిన ఫోటోను జై కిసాన్ పై జై జవాన్ దండయాత్ర అని ప్రచారం కావడంతో బిజెపి అధికార ఐటి సెల్, సిఇఒ అమిత్ మాలివ్య ఆ దెబ్బ రైతుకు తాకలేదని రెండు ఫోటోలతో ట్వీట్ చేశాడు..
సిఎఎ, ఎన్‌ఆర్‌సి లకు వ్యతిరేకంగా ఢిల్లీ షాహిన్ బాగ్‌లో మూడు నెలల పాటు జరిగిన నిరసన కార్యక్రమంలో 82 ఏళ్ల దాది బిల్కిస్ బానో పాల్గొన్న సంగతి తెలిసిందే. రైతు ఆందోళనలో ఆమె పాల్గొందంటూ ఓ వీడియో వచ్చింది. రైతు కాని ఈవిడ రోజుకు రూ.100 ఇస్తే ఎక్కడికైనా వస్తుందంటూ అవమానకరంగా హిందీ నటి కంగనా రౌత్ ట్వీట్ చేశారు. వాస్తమేమిటంటే బానో ఇన్ని రోజులు బయటకే రాలేదు. తన తల్లికి రైతు ఆందోళన పట్ల సంఘీభావమున్నా ఆరోగ్యం బాగాలేక ఇంట్లోనే ఉందని ఆమె కొడుకు తెలియజేశాడు. అయితే ప్రచారంలో ఉన్న క్లిప్పింగులో ఉన్నది మొహిందర్ కౌర్ అనే కిసాన్ యూనియన్ సభ్యురాలు. ఆమె బహదూర్ ఘడ్ నివాసి. వంగిపోయిన నడుముతో ఆమె పాదయాత్రలో పాల్గొనడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందనవచ్చు. అయితే ఈ తప్పుడు ట్వీట్‌లపై, వాట్సాప్, పేస్‌బుక్‌ల్లో పోస్టులపై ఎలాంటి చట్టపర చర్యలకు సంబంధిత అధికారులు ఉపక్రమించినట్లు సమాచారమేమి లేదు. సైబర్ నేరాల చట్టం, 2015 ఆధారంగా దేశంలో ఎందరో జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల నిర్వాహకులు పోలీసు కేసులు, అరెస్టులను ఎదుర్కొంటున్నారు. అయోధ్య రామ మందిర చిత్రాన్ని మార్ఫింగ్ చేశాడని, బిజెపి నాయకుల మాటలను వక్రీకరించి ట్వీట్లు పెట్టాడనే అభియోగంపై లక్నోకు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్లతో కూడిన కేసు పెట్టి మూడు సార్లు అరెస్టు చేశారు. రైతులపై జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి ఏడాది వర్తించకపోవడం విచిత్రం.
అయినా పై ప్రచారానికి దీటుగా రైతుకు తోడు నిలువాలనుకొనేవారు ఫార్మర్స్ ప్రొటెస్ట్, ఐ స్టాండ్ విత్ ఫార్మర్ పేర్లతో ట్విట్టర్ ఖాతాలు తెరిచారు. అందులో ఈ దుష్ప్రచారాల అసలు రంగు బయట పెడుతున్నారు. అలాగే అన్నదాతలకు బాసటగా నిలిచే పత్రికలు, సోషల్ మీడియా అసంబద్ధ ప్రచారం వాటి వెనుక నిజానిజాలు, వాస్తవ సందర్భాలు శోధించి బయటపెడుతున్నాయి. తామంతా రైతులమే తప్ప మాలో ఖలిస్థానీలు, ఉగ్రవాదులెవ్వరూ లేరని, మీడియా మాపై చల్లుతున్న బురదను నమ్మవద్దని కనబడ్డ పత్రికల వాళ్ళకు వారు చెబుతున్నారు. ఇన్ని అభాండాలు వేసి కూడా వారిని కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుండడంతోనే వారు అసలు సిసలైన రైతులు, రైతు నేతలని అర్థమవుతోంది.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News