Saturday, April 27, 2024

బొగ్గు కొరత-బయటపడేదెలా?

- Advertisement -
- Advertisement -

మన దేశంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటే మరో వైపు బొగ్గు కొరత విస్తరిస్తోంది. దేశీయం గా ఉత్పత్తి అవుతున్న బొగ్గు ఇక్కడి అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి ఆలోచించాలంటున్నారు సైంటిస్టులు. సహజంగా ఏ దేశ అభివృద్ధి అయినా విద్యుత్‌పైనే ఆధారపడి ఉంటుంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే సంప్రదాయ విద్యుత్‌లో 53 శాతం వాటా థర్మల్ పవర్‌దే. అంటే నల్ల బంగారానిదే.
మన దేశంలో కొంత కాలంగా విద్యుత్ వాడకం పెరిగింది. పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు ఇళ్లలో విద్యుత్ వాడకం ఎక్కువైంది. దీంతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరగాలి.

కానీ అది జరగడం లేదు. అనేక థర్మల్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. బొగ్గు కొరత నేపథ్యంలో అనేక థర్మల్ కేంద్రాలు మూతపడే స్థితికి చేరుకుంటున్నా యి. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు థర్మల్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రానున్న రోజుల్లో ప్రైవేటు గనులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతర దేశాల బొగ్గు గనుల యాజమాన్యాలు ధరలను ఎడాపెడా పెంచేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు బొగ్గు కొనలేక అనేక థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో అనేక ప్రైవేటు కంపెనీలు వేలంలో బొగ్గు గనులను చేజిక్కించుకుంటున్నాయి. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందనే పేరుతో బొగ్గు ధరలను ప్రైవేటు కంపెనీలు పెంచి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా పెరిగిన రేట్లకు బొగ్గు కొంటే ఆ ప్రభావం అంతిమంగా ప్రజలపై పడటం ఖాయం అంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. నెలవారీ కరెంటు బిల్లులు ఎడాపెడా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
బొగ్గు కొరత నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సన్నద్ధం చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులను కేంద్రం కూడా అర్థం చేసుకోవాలి. దాహం వేసినప్పుడు బావి తవ్వడం కాకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. అనేక దేశాలు విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం బొగ్గు మీదే ఆధారపడటం మానేసి చాలా కాలమైంది. భారత్ మాత్రం ఇప్పటికీ నల్ల బంగారాన్నే నమ్ముకుంది. ఈ వైఖరి ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఇంధన రంగ నిపుణులు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. అలా జరిగినప్పుడే బొగ్గు నిల్వల్లో తేడాలు వచ్చినా ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడదు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ సేఫ్ జోన్‌లో ఉంటుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనగానే అందరికీ వెంటనే గుర్తుకువచ్చేది… సౌర విద్యుత్. సూర్య కిరణాల నుంచి విద్యుత్ తయారు చేసుకోవడమే సౌర విద్యుత్. ఇళ్లు లేదా పరిశ్రమల పైకప్పులకు పలకలు ఏర్పాటు చేసుకుంటే చాలా సులభంగా కరెంటు తయారు చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
గుజరాత్ మెహసాని జిల్లాలోని ఓ చిన్న గ్రామం మొధేరా. ఈ గ్రామం సౌర విద్యుత్ తయారీలో దేశవ్యాప్తంగా రికార్డు సృష్టిస్తోంది. మొధేరా గ్రామంలోఎటు చూసినా సోలార్ ప్యానెల్సే కనిపిస్తుంటాయి. గ్రామస్థులెవరూ, సంప్రదాయ విద్యుత్ మీద ఆధారపడరు. సౌర విద్యుత్‌కే జై కొడతారు. మొధేరా గ్రామం ప్రత్యేకత మరోటి ఉంది. ఊళ్లో కరెంటు పోవడం అనే మాటే వినపడదు. ఇరవై నాలుగు గంటలూ సౌర విద్యుత్ అందుబాటులో ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వం సౌరవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి మొధేరా గ్రామానికి కొంత భూమిని కూడా అందచేసింది.

కిందటేడాది నవంబరు నెలలో ప్రధాని నరేంద్ర మోడీ, మొధేరా గ్రామానికి వెళ్లారు. సోలార్ పవర్‌లో మొధేరా సాధించిన విజయాన్ని చూసి గ్రామస్థులను అభినందించారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో సోలార్ పవర్ తరువాత వినిపిస్తున్న పేరు విండ్ పవర్. ప్రపంచమంతటా విండ్ పవర్ చాలా పాపులర్. క్లీన్ ఎనర్జీగా విండ్ పవర్‌కు పేరుంది. పవన విద్యుత్‌లో భారత్ సత్తా చాటింది. ఏడాదికి 39.2 గిగావాట్ల విండ్ పవర్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది. వచ్చే ఐదేళ్లలో మరో ఇరవై గిగావాట్ల విండ్ పవర్‌ను తయారు చేసే సామర్థ్యం భారత్‌కు వస్తుందని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ జోస్యం చెప్పింది.
అమెరికా అయితే విండ్ పవర్ సెక్టార్‌కు టాప్ ప్రయారిటీ ఇస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో లక్ష మందికిపైగా అమ్మాయిలు, అబ్బాయిలు విండ్ పవర్ సెక్టార్‌లో పని చేస్తున్నారు. విండ్ పవర్ టెక్నీషియన్ ఉద్యోగానికి అమెరికాలో ప్రస్తుతం బోలెడంత క్రేజ్ ఉంది. మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో 2050 నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోందన్నది వాషింగ్టన్ డీసీ వర్గాల సమాచారం. బొగ్గు కొరతకు ఉన్న మరో ప్రత్యామ్నాయమే బయో గ్యాస్ పవర్.
వ్యర్థాలతో కూడా విద్యుత్ తయారు చేయవచ్చంటున్నారు సైంటిస్టులు. ఈ ప్రక్రియలో కాలు ష్యం అనే ముచ్చటే ఉండదు. ఎక్కువగా పరిశ్రమల్లో వినియోగించే వ్యర్థాలతో బయోగ్యాస్‌ను తయారు చేస్తారు. విదేశాల్లో చాలా చోట్ల బయోగ్యాస్‌పై ఆధారపడి వాహనాలు నడపడం కనిపిస్తుంది. మాములు ఇంధనాల వాడకం వల్ల వచ్చిన కర్బన పదార్ధాల కంటే ఇలా బయోగ్యాస్‌తో విడుదలయ్యే వ్యర్థాలు 95 శాతం మేర తక్కువగా ఉంటాయన్నారు సైంటిస్టులు. ఒక్కమాటలో చెప్పాలంటే బయో గ్యాస్ పవర్‌తో పర్యావరణానికి మేలు జరిగినట్లే. బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.దేశంలో విద్యుత్ సంక్షోభం రాకముందే కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలి. రానున్న రోజుల గడ్డు రోజులను అంచనా వేసి దూరదృష్టితో వ్యవహరించాలి. భవిష్యత్‌లో దేశంలో విద్యుత్ కొరత అనేది లేకుండా చూడాలంటున్నారు ఇంధనరంగ నిపుణులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News