Saturday, April 27, 2024

మరో నలుగురు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే లక్షంతో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ఎలక్షన్స్ కమిటీ (సిఈసి) తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 8 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటికి అభ్యర్థులను ఎంపిక చేసింది. మరో నాలుగింటిని వాయిదా వేసింది. మొ త్తం 14మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, నిజామాబాద్ లోక్‌సభ స్థానం అభ్యర్థ్ధిగా తాటిపర్తి జీవన్‌రెడ్డి, మెదక్ నియోజకవర్గం లో నీలం మధు, భువనగిరి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇంకనూ వరంగల్లు లోక్‌సభ నియోజకవర్గంతో పాటుగా ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థ్ధులను ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంతోపాటుగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలు, జార్ఖండ్‌లో మూడు స్థానాలకు అభ్యర్థ్ధులను ఖరారు చేస్తూ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బుధవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేశారు.

ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి అగ్రనేత ప్రియాంకగాంధీని పోటీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కోరారని, దీనిపైనే సిఈసి సమావేశంలో సుధీర్ఘమైన చర్చలు జరిగాయని తెలిసింది. ఖమ్మం లోక్‌సభ స్థానం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉందని, ఆ నియోజకవర్గం స్థానంలో ఓటర్లలో 75 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ముఖ్యంగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో అత్యంత బలమైన సామాజిక వర్గం కమ్మ అని, కమ్మ వారు ఎంతో చైతన్యవంతులని, కమ్మ సామాజికవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్నారని సిఈసి సమావేశంలోపాల్గొన్న కాంగ్రెస్ అధిస్ఠానం పెద్దలను సిఎం రేవంత్‌రెడ్డి బృందం అభ్యర్థించినట్లు తెలిసింది. అంతేగాక సీనియర్‌నేత, మాజీ మంత్రి రేణుకాచౌదరి తన సామాజిక వర్గమైన కమ్మ వారి అభ్యున్నతి కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారని, ఆమెతోపాటుగా మరికొందరు సీనియర్ కాంగ్రెస్ కమ్మనేతలు కోరిన వెంటనే కొద్ది గంటల వ్యవధిలోనే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవోను కూడా విడుదల చేశామని, ఈ విధంగా ఆ సామాజిక వర్గం నేతలు అడిగిందే తడవుగా కోరికలన్నీ నెరవేరుస్తూ వచ్చామని వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన సిఈసి సమావేశంలోని అధిష్టానం పెద్దలు తుది నిర్ణయాన్ని ప్రియాంకగాంధీకే వదిలిపెడుతూ తీర్మానం చేశారని తెలిసింది. ఇలా మిగతా లోక్‌సభ స్థానాలైన వరంగల్లు, హైదరాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఎంపికచేసేందుకు మరోసారి భేటీ కావాలని, ఆ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపికచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు మరోసారి న్యూఢిల్లీకి రావాల్సి ఉంటుందని అధిష్ఠానం పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఈ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఇలా అభ్యర్థ్ధులను ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆచీతూచీ అడుగులేస్తోందని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తుండటం ఒక్కటే సరిపోదని, అభ్యర్థ్ధుల ప్రొఫైల్ కూడా అత్యంత ప్రధానమేనని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని, అందుకే అభ్యర్ధుల ఎంపికపైన సుధీర్ఘమైన కసరత్తే చేస్తోందని ఆ నాయకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News