Wednesday, May 15, 2024

ఉంటే ఉండండి.. పోతే పోండి

- Advertisement -
- Advertisement -

Congress leader Adhir Chowdhury attacks Kapil Sibal

ఎసి గదుల్లో కూర్చుని ప్రవచనాలు చెబుతున్నారు
బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రాలేదు
కపిల్ సిబల్‌పై అధిర్ రంజన్ చౌదరి మండిపాటు

కోల్‌కత: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ ఆత్మశోధన చేసుకోవాలంటూ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. పార్టీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న వారు పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా ఇబ్బంది పెట్టే కన్నా పార్టీని విడిచిపెట్టి వెళ్లవచ్చని చౌదరి సూచించారు. ఎసి గదుల్లో కూర్చుని కపిల్ సిబల్ ప్రవచనాలు చెబుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న వారు ఇతర పార్టీలలో చేరడం లేదా సొంత పార్టీ పెట్టుకోవడం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

బుధవారం నాడిక్కడ విలేకరులతో చౌదరి మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ప్రచారంలో కపిల్ సిబల్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఏమీ చేయకుండా మాట్లాడడం ఆత్మశోధన కాదంటూ పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు కూడా అయిన చౌదరి వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఇటువంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడానికి బదులు పార్టీ వేదికపై సిబల్ లేవనెత్తితే సమంజసంగా ఉంటుందని ఆయన అన్నారు. సిబల్ పార్టీలో సీనియర్ నాయకుడని, ఆయనకు పార్టీ అధినాయకత్వం వద్దకు వెళ్లే చొరవ కూడా ఉందని చౌదరి చెప్పారు. తమకు కాంగ్రెస్ అనువైన పార్టీ కాదని భావించేవారు కొత్త పార్టీ పెట్టుకోవడమో వేరే పార్టీలో చేరడమో నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్ నాయకత్వ తీరును విమర్శిస్తూ సిబల్ మంగళవారం కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 70 సీట్లలో పోటీచేసి కేవలం 19 మాత్రమే గెలుచుకోవడంపై ఆయన పార్టీని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి సలహాలు ఇస్తూ ఈ ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ గురించి కపిల్ సిబల్ చాలా కలత చెందుతున్నట్లు కనపడుతోందని, అందుకే ఆయన పార్టీలో ఆత్మశోధన ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నారని చౌదరి వ్యాఖ్యానించారు. గతంలో కూడా సిబల్ బహిరంగంగా పార్టీపై వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే, బీహార్‌లో కాని గత ఏడాది ఇతర రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాని సిబల్ మాత్రం ప్రచారం చేయలేదని చౌదరి వ్యాఖ్యానించారు. ఎసి గదుల్లో కూర్చుని ప్రవచనాలు ఇవ్వడానికి బదులు క్షేత్రస్థాయిలో పనిచేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. తాను మాత్రం పనిచేయకుండా ఇతరులకు పాఠాలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదని ఆయన హితవు చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారని, ఇప్పుడు ఎవరూ రాహుల్ లేదా సోనియా గాంధీ ఉద్దేశాన్ని తప్పుపట్టలేరని చౌదరి చెప్పారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీకి సారథ్యం వహించవలసిందిగా వారు ఆహ్వానించిన విషయాన్ని కూడా చౌదరి గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News