Saturday, April 27, 2024

ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీల నిరసన

- Advertisement -
- Advertisement -

Congress MPs protest against price hike

రాహుల్, ప్రియాంకసహా పలువురి అరెస్టు

న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువులపై జిఎస్‌టి పెంపు, నిరుద్యోగతకు నిరసనగా నలుపు రంగు దుస్తులతో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం దేశ రాజధానిలో ధర్నాలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతోసహా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిత్యావసర వస్తువులపై పెంచిన జిఎస్‌టిని వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంట్‌కు చెందిన గేట్ నంబర్ 1 వెలుపల ప్రదర్శన నిర్వహించిన మహిళా ఎంపీలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వం వహించారు. అనంతరం..మహిళా ఎంపీలంతా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా..వీరి వెంట యాత్రలో సోనియా గాంధీ పాల్గొనలేదు.

విజయ్ చౌక్ వద్ద మిగిలిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీతోపాటు పార్టీ సీనియర్ నాయకులు కెసి వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్‌తోసహా 64 మంది ఎంపీలను విజయ్ చౌక్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక బస్సులో తీసుకువెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విజయ్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ధరల పెరుగుదల సమస్యను లేవనెత్తేందుకే తాము ఇక్కడకు వచ్చామని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆయన ఆరోపించారు. ఎంపీల పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారా అన్న ప్రశ్నకు రాహుల్ అవునని సమాధానమిచ్చారు. కొంతమంది ఎంపీలను పోలీసులు కొట్టారని ఆయన చెప్పారు. విజయ్ చౌక్ వద్ద నుంచి కొన్ని ఫోటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ప్రజాస్వామ్యం ఒక జ్ఞాపకం మాత్రమేనంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News