Saturday, April 27, 2024

గెలిస్తే మహిళా నేతృత్వ కుటుంబాలకు నెలకు రూ. 2000: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి మహిళా నేతృత్వ కుటుంబానికి నెలకు రూ. 2000 ఇస్తామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వాగ్దానం చేశారు. కర్నాటకలోని ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఆమె అక్కడ పర్యటిస్తున్నారు. ‘నా నాయకి’ సమావేశంలో ప్రసంగిస్తూ ఆమె గృహ లక్ష్మి పథకంను ప్రకటించారు. ‘ ఈ స్కీమ్ కింద సమాజ నిర్మాణం కోసం రాత్రింబవళ్లు పనిచేసే మహిళలకు, ముఖ్యంగా ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మహిళకు నెలకు రూ. 2000, అంటే సంవత్సరానికి రూ. 24000 ఇస్తారు. అది కూడా నేరుగా ఆ మహిళా బ్యాంకు అకౌంట్లో వేస్తారు’ అని ప్రియాంక గాంధీ వివరించారు.
గత వారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా మహిళా నేతృత్వంలోని కుటుంబాలకు వచ్చే 2023-24 బడ్జెట్‌లో ఇలాంటి స్కీమ్‌నే తెస్తామన్నారు.

కాంగ్రెస్ గత వారం గృహజ్యోతి స్కీమ్ కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కూడా ఇస్తానని ప్రకటించింది. కర్నాటకలో మొత్తం 5.15 కోట్ల ఓటర్లలో మహిళా ఓటర్లు 2.55 కోట్ల మంది ఉన్నారు. ఇదిలావుండగా అధికారంలో ఉన్న బిజెపి పాలనలో తమ జీవితం ఎలా ఉందన్నది మహిళా ఓటర్లు బేరీజు వేసుకోవాలని ప్రియాంక గాంధీ అన్నారు. ‘కర్నాటకలో పరిస్థితి సిగ్గుపడేలా ఉందని నేనన్నాను. మీ మంత్రులు ఉద్యోగం ఇవ్వడానికి 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారు. అవినీతితో రూ. 1.5 లక్ష కోట్లను మంత్రులు లూటీ చేశారని చెప్పాను’ అన్నారు. బెంగళూరు అభివృద్ధికి కేటాయించిన రూ. 8000 కోట్లలో రూ. 3200 కోట్లు కమిషన్ కింద పోతున్నాయని ప్రియాంక గాంధీ అన్నారు. ‘పిఎస్‌ఐ స్కామ్ కింద పోలీసు ఉద్యోగాలను అమ్ముకున్నారు. ఇదా మీరు అధికారంలో ఉన్న వారి నుంచి కోరుకుంటున్నది? బోర్ బావులు, ద్రైవింగ్ లైసెన్సులు, హౌసింగ్…ఇలా అన్నింటికీ లంచాలు ఇచ్చుకోక తప్పడంలేదు’ అని చెప్పుకొచ్చారు.

‘ప్రభుత్వం కొవిడ్ వ్యాధి ప్రబలినప్పుడు గార్మెంట్ కార్మికులకు ఎలాంటి సాయం అందించలేదు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉన్నాయి. మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. రోజు కనీసం వారిపై 40 కేసులైనా ఉంటున్నాయి. ఇది వరకు మీరు గ్యాస్ సిలిండర్‌కు ఎంత చెల్లించేవారు…ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నారో తెలుసా? జీవితం దుర్భరంగా మారిపోతోంది. ఎవరూ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితిలో లేరు’ అని ఆమె అన్నారు. ‘ధనికులు మరింత ధనికులవుతుంటే…పేదలు మరింత పేదలవుతున్నారు’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీది క్రోని క్యాపిటలిజం అని నిందించారు. ‘ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన తన మిత్రులకు అమ్ముకుంటున్నారు’ అని ఆరోపించారు. ‘మీరు మీ శక్తిని గుర్తించండి. మీరే మార్పు తీసుకురాగలరు. ఈ ఎన్నికల ద్వారా మీ భవిష్యత్తును మీరే రాసుకోండి’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News