Friday, May 3, 2024

కరోనా కట్టడిలో తెలంగాణ భేష్

- Advertisement -
- Advertisement -

harshavardhan

 

ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి : వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రశంస

హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణలో తీసుకున్న పకడ్భందీ ప్రణాళికలను అనుసరించాలని ఆయన కోరారు. శుక్రవారం కరోనా అంశంపై ఆయన అన్ని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తున వైరస్ నియంత్రణ పట్ల తెలంగాణ ప్రభుత్వం వేగంగా తీసుకున్న నిర్ణయాలు, పనితీరు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఆయూష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ముందస్తు నివారణ మందులు పంపిణి చేస్తున్నామని, ఈ మందులను ప్రజలంతా వేసుకోవాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలతో కరోనా నుంచి దూరంగా ఉండవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు.

దేశంలో రోజురోజుకు అనుమానిత లక్షణాలు పెరుగుతున్నాయని, కానీ ల్యాబ్ పరీక్షలలో అవి కరోనాగా నిర్థారణ కావడం లేదన్నారు. చిన్నపాటి జలుబుతో కూడిన జ్వరం వచ్చినా ప్రజలు భయాందోళనకు గురవుతున్నరన్నారు. కరోనా వైరస్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, వైరస్‌ను నియంత్రించేకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు . గాలిద్వారా వ్యాప్తి చెందే వైరస్ కాదు కావున దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం పెద్దగా లేదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, దీనిలో భాగంగా కేంద్రం తరపున ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర బృందాలతో సమన్వయమై ఆయా రాష్ట్రాల అధికారులు కరోనా నియంత్రణ కోసం కృషి చేయాలని తెలిపారు.

మరో కరోనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయండి : మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణా రాష్ట్రంలో మరో కరోనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణాలతో కలసి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..కరోనా నియంత్రణ కోసం తాము ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటి వరకు కేవలం ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని, ప్రస్తుతం అతని ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని మంత్రి ఈటల కేంద్ర మంత్రికి వివరించారు. ప్రత్యేక ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసి మెరుగైన చికిత్సను అందిస్తున్నామన్నారు.

ఇప్పటికే ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, అన్ని ప్రాంతాల్లో కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై భారీ హోర్డింగ్‌లతో ప్రచారాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అదే విధంగా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి నిరంతరం దృష్టి పెట్టామని మంత్రి ఈటల కేంద్రానికి తెలిపారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్ 95 మాస్కులను అందించాలని కోరారు. దీంతో పాటు ప్రస్తుతం అనుమానిత లక్షణాలు పెరుగుతున్న తరుణంలో మరోక కరోనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల కేంద్ర మంత్రిని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణాకు వచ్చే వారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుందని, ఈక్రమంలో అనుమానిత లక్షణాల వారికి కేవలం ఒక్క ల్యాబ్‌తో పరీక్షలు వేగంగా నిర్థారణ చేయడం కష్టతరమని వైద్యమంత్రి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు వివరించారు. అనంతరం కరోనా నియంత్రణ కోసం కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

Corona control measures are good: Harshvardhan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News