Saturday, May 11, 2024

ఆగని కరోనా తీవ్రత

- Advertisement -
- Advertisement -

Corona

 

దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు
4,789కు చేరిన బాధితుల సంఖ్య
మృతులు 124మంది
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,789కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 124 మంది మరణించగా 4,312 మందికి పైగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో దేశంలో 354 కొత్త కేసులు నమోదు కాగా ఎనిమిది మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. 352 మంది కోలుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. గత 24 గంటల్లో దేశంలో 13 మరణాలు సంభవించగా, వీరిలో మధ్యప్రదేశ్‌లో నలుగురు, రాజస్థాన్‌లో ముగ్గురు, గుజరాత్, ఒడిశా, పంజాబ్‌లో ఒక్కొక్కరు చనిపోయారు. అయితే సోమవారం రాత్రి నేరుగా రాష్ట్రాలనుంచి అందిన సమాచారం మేరకు దేశంలో కనీసం 143 మంది చనిపోయినట్లు పిటిఐ వెల్లడించింది.

మొత్తం కేసుల సంఖ్య 4,998 కాగా, వీరిలో 414 మంది కోలుకున్నారు. కరోనా కట్టడి కోసం రెడ్ జోన్ల ప్రకటన లాంటి చర్యలు ఆగ్రా, గౌతం బుద్ధ నగర్, భిల్వారా,తూర్పు ఢిల్లీ, ముంబయిలాంటి కొన్ని ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలనిచ్చినట్లు అగర్వాల్ తెలిపారు. ఈ వ్యూహాలను మిగతా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కూడా అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే.

రాబోయే వారం రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా 45 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 748కి చేరుకుంది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 621గా ఉండగా, ఢిల్లీలో 523కు పెరిగింది. తమిళనాడులో ఒక్క రోజే కొత్తగా 50కి పైగా కేసులు నమోదైనాయి. కేరళలో 327, తెలంగాణలో 364, యుపిలో 305, ఎపిలో 304 కేసులు నమోదైనాయి.

భోపాల్‌లో మరో 12 కేసులు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మంగళవారం కొత్తగా మరో 12 కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా కరోనా సోకిన వారిలో ఏడుగురు పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉండగా, ఐదుగురు ఆరోగ్యశాఖకు చెందిన వారున్నారని, భోపాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ కుమార్ దహరియా చెప్పారు. దీంతో నగరంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74కు చేరుకోగా, రాష్ట్రంలో కేసుల సంఖ్య 268కు చేరుకుంది. ఈ కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక్క ఇండోర్‌లోనే నమోదైనాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మంది కరోనా కారణంగా మృత్యువాతపడగా, వారిలో 13 మంది ఇండోర్‌కు చెందిన వారే ఉన్నారు.

Corona intensity is increasing in country
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News