Monday, April 29, 2024

రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు

- Advertisement -
- Advertisement -

cm-kcr

 

దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు కొంత మెరుగా ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. దేశ వ్యాపితంగా ప్రజల కొనుగోలు శక్తితో పోల్చుకున్నప్పుడు తెలంగాణలో ప్రజల కొనుగోలు శక్తి మెరుగ్గా ఉంది అని ఆ లెక్కలు చెప్పాయి. అలాగే సగటు తలసరి ఆదాయం విషయంలో కూడా దేశంలో సగటు తలసరి ఆదాయం కన్నా తెలంగాణ సగటు తలసరి ఆదాయం చాలా ఎక్కువ వుంది అని కూడా ఆ లెక్కలలో ఉంది. ఇంకా అనేక రంగాలలో ఆదాయం పెరిగింది అని కూడా కేంద్రం పార్లమెంట్‌లో విడుదల చేసిన గణాంకాలలోఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా విడుదల చేసిన తెలంగాణ సోషో, ఎకనమిక్ కండీషన్స్ పుస్తకంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలకే ఆర్ధికంగా నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తున్న ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి త్వరిత గతిన వాటిని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడం, ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వడం, రైతు బంధు పేరుతో ఎకరానికి సంవత్సరానికి రూ.10 వేలు నగదు ఇవ్వడం, అలాగే రైతు బీమా పేరుతో చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడం, అలాగే పేద వర్గాలకు, వివిధ వృత్తులు చేసుకునే వారికి ఆర్ధికంగా చేయూతను ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయడ. పారిశ్రామిక అభివృద్ధి త్వరిత గతిన జరిగే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చారు. తద్వారా ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన పరిశ్రమలు ముందుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. దీనితో ఉపాధి అవకాశాలు పెరిగాయి.

ఇలా అన్ని రంగాలు అభివృద్ధి బాటలో పురోగమిస్తున్నాయి. దేశంలో ఆర్ధిక మాంద్యం ఉన్నా మనం కొంత ఆర్ధికంగా నిలదొక్కుకున్నం అని చెప్పవచ్చు. సజావుగా సాగుతున్న పరిస్థితులలో కరోనా మహమ్మారి మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కొద్దిగా దెబ్బ తీసిందనే చెప్పాలి. కాకపోతే మనం త్వరగానే కోలుకుంటామనే నమ్మకం ఉంది. కేంద్రం సహాయం ఉంటే ఇంకా ముందే కోలుకుంటాం. ఇతర రాష్ట్రాల కన్నా మనం బెటర్ పొజిషన్‌లో ఉంటాం. కానీ కేంద్రం సహాయం అందేది డౌటే. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్‌తో సంబంధం లేకుండానే రాష్ట్రం నుండి వసూలైన పన్నులలో చట్టబద్ధంగా మనకు రావాల్సిన వాటా మనకు రాలేదు. కొంత పెండింగ్‌లో ఉంది. మిషన్ భగీరథకు, కాళేశ్వరం లాంటి భారీ బహుళార్ధక ప్రాజెక్ట్‌కు కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందలేదు. కరోనా లాక్‌డౌన్ మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించింది.

పాత బకాయిలతో పాటు ఇప్పుడైనా సకాలంలో పన్నులలో మన వాటా మనకు చెల్లిస్తే బాగుంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రా నున్న కొద్ది నెలలు ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. దానికి మన రాష్ట్రం కూడా మినహాయింపు కాదు. కాకపోతే మన రాష్ట్రం త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన వ్యవసాయ రంగం జెట్ స్పీడ్‌లో దూసుకొనిపోతుంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి పంట ఒక కోటి ఐదు లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అలాగే 14 లక్షల టన్నుల మొక్కజొన్న పండింది. దీన్నిబట్టి తెలంగాణలో వ్యవసాయ రంగం ఏ రకంగా దూసుకొనిపోతుందో అర్ధం అవుతుంది. భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగానికి డోకా లేదు. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. విద్యుత్త పుష్కలంగా ఉంది. కావాల్సినంత సాగు భూమి ఉంది. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రం వ్యవసాయ అనుబంధ పరిశ్రమల మీద దృష్టి పెడుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టేందుకు అవకాశాలు ఎక్కువున్నాయి.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కొంత మేరకు ప్రోత్సహకాలు అందిస్తే చాలు తద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఐదు, ఆరు నెలలు తిరిగే లోపు మన ఆర్ధిక పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని విశ్లేషిస్తున్నారు. కాకపోతే అప్పటి దాకా ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని చెబుతున్నారు. ఇందుకోసం ఇతర ఖర్చులు తగ్గించుకొని అత్యవసర అవసరాలకు కేటాయించాలని చెబుతున్నారు. బహుశా అందుకే కెసిఆర్ ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల జీతాలతో పాటు ఉద్యోగుల జీతాలతో కూడా కొంత కోత పెట్టారనుకుంటున్నాం. అన్నదాతల విషయం లో ముందు చూపుతో వారు పండించిన పంటను తక్షణమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం మంచిదయింది. లేదంటే వారు నష్టపోయే ప్రమాదం ఉంది.

అలా జరిగితే వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో పడేది. దానితో మన ఆర్థికపరిస్థితి ఎక్కువ దిగజారుతుంది. అది గ్రహిం చే సిఎం కెసిఆర్ పంటల కొనుగోలు కోసం రూ. 30 వేల కోట్ల ను తక్షణమే విడుదల చేశారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌తో రోజు వారీ కూలీలు ఉపాధి కోల్పోయారని గ్రహించి వారి కోసం 12 కిలోల బియ్యం రూ. 1500 నగదు ఇచ్చారు. అలాగే వలస కార్మికుల విషయంలో గొప్ప ప్రకటన చేశారు. వాళ్ళు తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు వాళ్లూ మా బిడ్డలే అని చెప్పడమే కాకుండా వారికి కూడా12 కిలోల బియ్యం రూ. 500 నగదు ఇస్తున్నారు.వలస కార్మికుల విషయంలో కెసిఅర్ ముందు చూపు చాలా గొప్పది. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో, ఇతర రంగాలలో పని చేసి స్కిల్డ్ లేబర్ అంత ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిని వారే ఉన్నారు.

లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత వారందరి అవసరం మళ్లీ ఉంటుంది. అందుకే ముందు చూపుతో వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నారు. అయితే ఉద్యోగుల జీతాలలో కొంత కోత విధించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. పిఅర్‌సి అలస్యం చేశారు, ఐఅర్ ఇవ్వలేదు అంటున్నారు. ధనిక రాష్ట్రం అన్నారు ఎందుకు జీతాలలో కోత విధించారు అని కొన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. నిజమే ధనిక రాష్ట్రమని ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా కొంత ఆర్ధిక క్రమశిక్షణను పాటించకపోతే భవిష్యత్ గందరగోళంలోపడే ప్రమాదం ఉందంటున్నారు ఆర్ధిక నిపుణులు. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు అంటున్నారు. ఉద్యోగులు ఆవేదన చెందారు అంటే కొంత అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.

కాని రాజకీయ పార్టీలు మాట్లాడడం విచారకరం, ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో పాలకుడు ముందు చూపుతో ఉండాలి, తగినన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి లేకుంటే రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళే ప్రమాదం వస్తుంది అంటున్నారు. అప్పుడు అందరూ బాధపడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. అప్పుడు ఎవరు బాధ్యులు అవుతారు. ఈ రోజు మాట్లాడే విపక్ష నాయకులు కాదుగా, పాలకుడే బాధ్యుడు అవుతారు. మంచి జరిగితే మెచ్చుకుంటారు, చెడు జరిగితే విమర్శిస్తారు. అయినా జీతాలలో కోత కాదు కొద్ది మొత్తాన్ని కట్ చేశారు అంతే. ఆ మొత్తాన్నికూడా పరిస్థితి చక్కబడ్డాక మళ్లీ తిరిగి చెల్లిస్తారు.

లాక్‌డౌన్ పిరియడ్‌లోవారి ఖర్చులు కూడా తగ్గుతాయి కదా. కరోనా దెబ్బకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలే పోతున్నాయి. వేలాది మంది రోడ్డు మీదకు వస్తారని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగులకు జాబ్ గ్యారంటీ ఉంది. కట్ చేసిన జీతం వస్తుంది. ఉపాధి లేక రోడ్డున పడ్డవారి పరిస్థితి ఏమిటి? ఈ పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకుంటారు. నిధులను సర్కార్ జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి. రోజు కూలీతో తమ జీవితాలను గడిపే నిరుపేదలు పస్తులతో ఉండకుండా, ఆకలి చావులు లేకుండా చూసుకోవాలి. మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయిన వలస కూలీలను ఆదుకోవాలి. అన్నం పెట్టే రైతన్నను కాపాడుకోవాలి. ఆన్ గోయింగ్ వర్క్ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో పడకుండ చూసుకోవాలి. అనేక రకాలుగా ఆలోచించి పాలకులు నిర్ణయం తీసుకోవాలి.

కెసిఆర్ ఆ పని చేస్తున్నాడు అంటున్నారు ఆర్ధిక నిపుణులు. ప్రజలకు సర్వీస్ చేసే ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని ఏ ప్రభుత్వం మాత్రం అనుకుంటుంది. రాజకీయ పార్టీలకు ఈ విషయాలు తెలియదా. మీరు అధికారంలో ఉన్నా ఇదే చేస్తారు, చేయాలి కూడా అంటున్నారు . ఎవరు అధికారంలో ఉన్నా తెలివి గల పాలకుడు ఎవరైనా ఇలాంటి విపత్కర పరిస్థితులలో కొంత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రాష్ట్ర అర్ధిక పరిస్థితి కుప్పకూలుతుంది. ప్రత్యక పరిస్థితులను అందరూ అర్థం చేసుకుంటారు. లాక్‌డౌన్ తరువాత కూడా మన ఆర్థిక పరిస్థితి బాగుండాలని కోరుకోవాలి. ఉద్యోగులు కూడా ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అందుకే వారు ఎక్కడ రియాక్ట్ కాలేదు. పైగా వారు కూడా తమ ఒక్క రోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహా య నిధికి విరాళంగా ప్రకటించి చెక్‌ను కెసిఆర్‌కి అందించారు. పాలకుడు ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి. ప్రజలు పాలకుడిని నమ్మాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రంలో ఈ రెండు ఉన్నాయనిపిస్తోంది. అందుకే ప్రజలు కెసిఆర్‌ని విశ్వసిస్తున్నారు కెసిఆర్ కూడా ప్రజలకు ఏమి కావాలో అది చేస్తున్నాడు.

CM KCR decisions on Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News