Wednesday, May 1, 2024

43 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

Corona positive cases

 

జిహెచ్‌ఎంసి పరిధిలో 31, గద్వాలలో 7, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున నమోదు
600కు పైగా కేసులు మర్కజ్ లింక్‌వే, లారీ డ్రైవర్‌కు, అంబర్‌పేటలో నర్సుకు, గాంధీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు కరోనా
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రెండునెలల పసిగుడ్డుకు, ఏడాదిన్నర బాలుడికీ వైరస్ 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 78 శాతం నిజాముద్దీన్ మర్కజ్‌కు చెందినవారివేనని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖకు కూడా ఇదే విషయాన్ని నివేదించారు. ఇందులో ప్రధానంగా జిహెచ్‌ఎంసి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోనే ఎక్కువ కేసులు వచ్చినట్లు పేర్కొన్నారు. గత నెల 30వ తేదీన మర్కజ్ లింక్‌ను రాష్ట్ర అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మర్కజ్ వెళ్లొచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు చేసిన పరీక్షలు నిర్వహించారు. దాదాపు 631 కేసులు మర్కజ్‌తో ముడిపడినవేనని పేర్కొన్నారు. ఇంకా కొందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇక శనివారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43గా ఉంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్‌రావు విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపారు. దీంతో మొత్తం కొవిడ్19 బాధితుల సంఖ్య 809కి చేరుకుంది. ఇందులో 186 మంది డిశ్ఛార్జ్ కాగా, 18 మంది చనిపోయారు. మిగిలిన 605 మంది ప్రభుత్వం నోటిఫై చేసిన వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 37, గద్వాలలో 7, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, నల్లగొండ జిల్లాలో ఒక కేసు నమోదైంది.

లారీ డ్రైవర్‌కు.. అంబర్‌పేటలో నర్సుకు
నిత్యావసర సరకులు తరలించే లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎపిలోని కృష్ణా జిల్లా నుజివీడు నుంచి మామిడి పండ్లను ఓ లారీలో మహారాష్ట్రకు ఎగుమతి చేశారు. ఈ లోడ్‌ను తీసుకెళ్లిన లారీ డ్రైవర్‌కు మహారాష్ట్రలో పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు వచ్చే లోపే అతడు మామిడి పండ్లను ఆన్‌లోడ్ చేసి తిరుగు ప్రయాణం అయ్యాడు. పాజిటివ్ అని తేలగానే ఇక్కడి అధికారులు అప్రమత్తమై నిర్మల్ జిల్లాలో అదుపులోకి తీసుకుని గాంధీకి తరలించారు. ఇక అంబర్‌పేటలోని గంగానగర్‌లో నివసించే ఓ నర్సుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, కుటుంబ సభ్యులను క్వారంటైన్ తరలించారు. వారి ఇంట్లో ఉండే కుక్కను కూడా క్వారంటైన్ చేయాలని పట్టుబట్టడం గమనార్హం.

గాంధీలో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్‌కు కరోనా
గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. గత గురువారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన అతనికి తుమ్ములు, జలుబు ఎక్కవ ఉండటంతో కుటుంబ సభ్యులు 104కు సమాచారం ఇచ్చారు. క్వారంటైన్ తరలించి పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఉంటున్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ, మునుగనూర్ పరిధిలో శానిటేషన్ పనులు చేపట్టారు. ఆయనకు సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ తరలించారు.

ఏడాదిన్నర బాబు.. రెండు నెలల శిశువుకు
ఇటీవల కొవిడ్ 19తో మృతి చెందిన వ్యక్తి మనువడికి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఆ బాలుడి వయస్సు ఏడాదిన్నర. మిగిలిన ఏడుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్ తరలించారు. ఇక రెండు నెలల శిశువుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అభంగాపూర్ గ్రామానికి చెందిన అంజనేయులు, కవిత దంపతులకు పుట్టిన రెండు నెలల శిశువుకు అనారోగ్యం వస్తే పాలమూరు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిలోఫర్‌కు రిఫర్ చేశారు. పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

 

Corona positive cases is 43
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News