Friday, April 26, 2024

మరికొద్ది వారాల్లో కరోనా టీకా

- Advertisement -
- Advertisement -

Corona vaccine in India in few more weeks

 

శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్
వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత
వ్యాక్సిన్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి

న్యూఢిల్లీ: కొవిడ్ కోరలనుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్ కోసం యావద్భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. మరికొద్ది వారాల్లోనే భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యత కింద ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు అందిస్తామని చెప్పారు. శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కాగా టీకా ధరపై రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత నిర్ణయిస్తామని ప్రధాని చెప్పారు. దేశంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈసందర్భంగా కరోనా పరిస్థితి, వ్యాక్సిన్ పురోగతి, టీకా పంపిణీ తదితర అంశాలను ప్రతిపక్షాలకు ప్రభుత్వం వివరించింది. ‘ కొవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తామని మన శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు. భద్రమైన, చవకైన వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి అంతా భారత్ వైపు ఉంది’ అని ప్రధాని అన్నారు.

ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు తొలి ప్రాధాన్యం

‘మరికొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. టీకాను ఆమోదించిన తక్షణమే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెడతాం. ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో తొలి ప్రాధాన్యత కల్పిస్తాం’ అని ప్రధాని అన్నారు. కాగా టీకా ధరపై కొందరిలో అనుమానాలు ఉన్నాయని మోడీ అంటూ, అలాంటి అనుమానాలు ఉండడం సహజమేనని, అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ విషయంలో ప్రజలఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని, రాష్ట్రాలకు పూర్తి భాగస్వామ్యం కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో కొవిడ్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ఈ అంశంపై చర్చించడం కోసం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇది రెండో సారి.

ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమైన ఈ సమావేశంలో పార్లమెంటులో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు అధిర్ రంజన్‌చౌదరి, గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్), శరద్ పవార్(ఎన్‌సిపి) సుదీప్ బందోపాధ్యాయ (ఎన్‌సిపి), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్‌పి), నామా నాగేశ్వర రావు,కె. కేశవరావు (టిఆర్‌ఎస్), వినాయక్ రౌత్ (శివసేన) తదితరులు తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, ఆ శాఖ సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి మురళీధరన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు వ్యాక్సిన్ పంపిణీలో విశేషమైన అనుభవం, సామర్థం ఉంది. వ్యాక్సినేషన్ రంగంలో అతిపెద్ద, అపారమైన అనుభవం కలిగిన నెట్‌వర్క్ ఉంది. వాటిని పూర్తిగా వినియోగించుకుంటాం’ అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ముందుగా కోటిమంది హెల్త్ వర్కర్లకు టీకా

కాగా కొవిడ్19 వ్యాక్సిన్‌ను ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని దాదాపు కోటిమంది హెల్త్ వర్కర్లకు ఇవ్వడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అఖిలపక్ష సమావేశంలో తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ మేరకు ప్రజంటేషన్ ఇచ్చారు. వీరిలో డాక్టర్లు, నర్సులు కూడా ఉంటారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు, సాయుధ దళాల సిబ్బంది, మున్సిపల్ వర్కర్లతో పాటుగా దాదాపు రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వడం జరుగుతుందని కూడా తన ప్రజంటేషన్‌లో మంత్రిత్వ శాఖ తెలియజేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్, హైదరాబాద్, పుణెలలోని వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఫార్మా కంపెనీలను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలతో వ్యాక్సిన్ తయారీ పురోగతిని సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News