Home ఎడిటోరియల్ కరోనా వైరస్‌కు భారతీయ టీకా?

కరోనా వైరస్‌కు భారతీయ టీకా?

Corona vaccine invented by India

 

కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. దాని మూలాలు అంతుచిక్కట్లేదు. దాన్నుంచి తేరుకోవడం, ఆ మహమ్మారి అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవాళి ముందున్న పెను సవాలు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ (టీకా) కనుగొనడానికి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ, దీన్ని సురక్షిత ప్రమాణాల్లో ప్రభావవంతంగా పని చేస్తుందా, లేదా అన్నది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఈ వ్యాక్సిన్‌ను కూలంకషంగా పరీక్షించవలసి ఉంటుంది. ఇందుకు ఎంతోమంది కృషి, సమయం అవసరమవుతుంది. దీన్ని ప్రముఖ అధీకృత సంస్థ అంగీకరించాలి. తర్వాత ప్రజలకు వేయడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశముంటుంది. లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ డోసులను వృద్ధి చేయడానికి మరికొంత ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. మన దేశంతో సహా ప్రపంచ దేశాల దృష్టంతా కోవిడ్19 టీకా తయారీలో నిమగ్నమై ఉన్నాయి. 180కి పైగా పరిశోధనల్లో ప్రయోగ పరీక్షలు సాగుతున్నాయి. నిపుణులు, శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా పనిచేస్తున్నారు. మన దేశంలో 14 వ్యాక్సిన్ సంస్థలు విభిన్న స్థాయిల్లో పనిచేస్తున్నాయి. వీటిలో భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చింది. సాధారణంగా సంప్రదాయ టీకా అభివృద్ధికి 1015 ఏళ్లు పడుతుంది. అయితే చైనా జన్యుక్రమాన్ని విడుదల చేయడం, గతంలో జరిగిన పరిశోధనలు వంటి సానుకూలతలతో కరోనా టీకాను పరిమిత వ్యవధిలోనే అందుబాటులోకి తెచ్చే కృషి జరుగుతున్నది.

కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకోవడమే టీకా చేసే పని. దీని తయారీకి, బహీనపరచిన సజీవ వైరస్‌ల (లైవ్ ఎటెన్యుయేటెడ్)ను లేదా వేడి, రసాయనాల ద్వారా క్రియారహితం చేసిన (ఇనేక్టివేటెడ్) వైరస్‌లను లేదా వాటిలోని కొమ్ములు/పైపొర ప్రొటీన్ భాగాలను ఉపయోగిస్తారు. వీటిని ‘యాంటిజెన్’లుగా పిలుస్తారు. మానవ శరీరంలోకి టీకాను ప్రవేశపెట్టినప్పుడు అది వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని రోగ నిరోధక వ్యవస్థకు చూపిస్తుంది. ఎప్పుడైనా ఆ వైరస్ లేదా సంబంధిత ప్రొటీన్లు తారసపడినప్పుడు వాటిపై దాడి చేయాలని నిర్దేశిస్తుంది. దీంతో నిర్దిష్ట యాంటీబాడీలను మన రోగ నిరోధక వ్యవస్థ రూపొందించుకుంటుంది. సంబంధిత వైరస్ సోకినప్పుడు ఈ యాంటీబాడీలు భారీగా విడుదలై దాన్ని నిర్వీర్యం చేస్తాయి. వ్యాధి కారకాలైన వైరస్‌లను హానిరహితంగా మార్చి శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు రోగ నిరోధక శక్తి స్పందించి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే విధానం అమల్లో ఉంది. కానీ, కరోనా వైరస్‌కు మాత్రం వాటి జన్యు పదార్థాలను వినియోగించి టీకాలను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీకాలను స్థూలంగా నాలుగు పద్ధతుల్లో తయారుచేస్తారు. బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలో శరీర రోగ నిరోధక వ్యవస్థకు నేర్పించడం టీకా ప్రధాన ఉద్దేశం. తద్వారా బ్యాక్టీరియా, వైరస్‌ల ద్వారా వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి. శాస్త్రవేత్తలు టీకాలను తయారు చేసేటప్పుడు బ్యాక్టీరియా/వైరస్‌లకు రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఎవరికి టీకా అవసరం, టీకా తయారీకి మేలైన పద్ధతి, టెక్నాలజీ ఏది అన్న అంశాలను ముందుగా పరిగణలోకి తీసుకుంటారు. వీటి ఆధారంగా నాలుగు రకాల టీకాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటారు.

వైరస్ నివారణకు వ్యాక్సినే సమర్ధవంతమైన విరుగుడు. ఇది అందివచ్చేవరకు చికిత్స నిమిత్తం మందులు కొన్ని మార్కెట్లోకి వచ్చాయి. మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాలను వాడుక చేస్తున్నాయి. ఆయా దేశాల విజ్ఞప్తుల మేరకు భూటాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, నేపాల్, మయన్మార్, సీషెల్స్, మారిషస్, ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు పారాసిటమాల్‌తో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను మన దేశం ఉచితంగా పంపించింది. అమెరికా, స్పెయిన్, బ్రెజిల్, జర్మనీ, బ్రిటన్‌తో ఇదివరకే మన ఔషధ సంస్థలు కుదుర్చుకున్న వాణిజ్య వొప్పందాలకు లోబడి ఈ మందులను ఎగుమతి చేసింది. ఆయా దేశాల్లో ఈ మందులను తొలుత వాడుక చేశాయి. తాజాగా ఫాబి ప్లూ, కొవిఫర్, సిప్రెమి, లోపినావిర్‌రిటోనావిర్, రైబవిరన్, ఇంటర్‌ఫెరాన్ బీటా 1బి… తదితరమైనవి మార్కెట్లోకి వచ్చాయి. ఈ మందులన్నీ కూడా కరోనా వైరస్ చికిత్సకు సపోర్టివ్ మెడిసిన్‌గా భావించాలి. ఉపశమనం కలిగించేవేగానీ, పూర్తిగా వైరస్‌ను తుదముట్టించేవి కావు. ఫాబి ప్లూ ఔషధాన్ని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారుచేసింది. కరోనా సోకినవారిలో కొద్దిపాటి లక్షణాలున్నవారి నుంచి తీవ్ర లక్షణాలున్నవారికి వాడే మందు ఇది.

ఇక, రెమ్డెసివిర్ మందు జనరిక్ వర్షన్ తయారీకి హెటెరో, సిప్లా సంస్థలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. హెటిరో సంస్థ ‘కోవిఫర్’, సిప్లా సంస్థ ‘సిప్రెమి’ పేర్లతో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇవన్నీ కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే దివ్యౌషధాలు కావు. కోవిడ్19కు లక్షణాల ఆధారంగా చేస్తున్న చికిత్సే తప్ప, ఆ వైరస్ బారినుంచి కాపాడే సమర్థవంతమైన చికిత్స, వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాలేదు. ‘డెక్సామెథసోన్’ పేరుతో ఓ ఔషధాన్ని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటిలేటర్‌పై ఉన్న రోగుల ఈ ఔషధాన్ని వాడగా మరణాల ముప్పును 40 నుంచి 28% తగ్గగా, ఆక్సిజన్ అవసరమైన రోగులకు మరణగండం 25 నుంచి 20% మేర తగ్గినట్లు గుర్తించారు. హెచ్‌ఐవి చికిత్సకు ఉపయోగించే లోపినావిర్‌రిటోనావిర్, నోటి హైపటైటిస్ సి ఔషధం రైబవిరన్, కండరాల బలహీనత చికిత్సకు ఉపయోగించే ఇంటర్‌ఫెరాన్ బీటా 1బి, ఈ మూడు వేర్వేరు యాంటీవైరల్ ఔషధాల కలయికతో హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది.

ఈ కాంబో ఔషధాలను విడతల వారిగా వైరస్ సోకిన వారికి ఇవ్వడంతో ఫలితాలు వచ్చినట్లు ప్రకటించింది. మలే రియా ఆయా దేశాలు తాత్కాలిక ఉపశమనం కలిగించేలా ఔషధాలను తయారు చేస్తున్నప్పటికీ, కరోనా పూర్తి కట్టడికి టీకాయే శాశ్వత పరిష్కారంగా విశ్వసిస్తున్నాయి. కోవిడ్ టీకా వెలుగు చూడాలంటే దానికయ్యే వ్యయంతో పాటు సమయమూ కీలకమే. అధ్యయనం, ప్రి క్లినికల్, క్లినికల్ ట్రయల్స్ (మనుషులపై జరిపే పరిశోధనలు), అనుమతులు, ఉత్పత్తి, పంపిణీలతో ముడిపడిన సంప్రదాయ పద్ధతిలో ఒక టీకాకు రూపం రావాలంటే కనీసం పది, పదిహేను సంవత్సరాల సమయం పడుతుండటం గత అనుభవం. అయితే కోవిడ్19 పరిస్థితుల్లో దీన్ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, చైనాలతో పాటు మన దేశంలోనూ టీకాల అభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి.

ఎడినో వైరస్ ఆధారంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ, లండన్ ఇంపీరియల్ కాలేజీ శాస్త్రజ్ఞులు గ్లోబల్ హెల్త్ అనే సోషల్ ఎంటర్‌ప్రైజ్‌తో కలిసి ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ముగించుకున్నాయి. చైనాలో ఐదు వ్యాక్సిన్‌లను పరీక్షిస్తుండగా, వీటిలో ఒకటి రెండవ దశ ట్రయల్స్‌కు చేరుకుంది. చైనా సంస్థ సినోవాక్ చెందిన వ్యాక్సిన్ మనుషులపై జరిపే ప్రయోగాలతో చివరిదశకు చేరుకుంది. అమెరికాకు చెందిన మోడెర్నా ఇన్ కార్పొరేషన్ ‘ఎంఆర్‌ఎన్‌ఏ1273’ వ్యాక్సిన్ తొలిదశ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందడుగు వేసింది. ఆయా దేశాల్లో మరో 13 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలోను, 129 వ్యాక్సిన్లు ఫ్రీక్లినికల్ దశలో ఉన్నాయి. మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ స్వదేశీ టీకాను రూపొందించింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్)తో కలసి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సేకరించిన వైరస్ రకాన్ని ఉపయోగించుకుని ‘కోవాగ్జిన్’ పేరుతో టీకాను తీసుకురానున్నది. దీనిపై క్లినికల్ పరీక్షలు చేయడానికి హైదరాబాద్‌లోని నివ్‌‌సు, విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆసుపత్రులతో పాటు దేశంలోని మరో 12 ఆసుపత్రులను ఎంపిక చేసింది. వీటిలో మనుషులపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహించి, ఫలితాలను బట్టి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తారు. ఆగస్టు 15లోగా ఈ టీకాను తీసుకురావాలని భారత్ బయోటెక్ సన్నాహాలు చేస్తుండగా, మన దేశం సొంతంగా ఆవిష్కరించే తొలి వ్యాక్సిన్ ఇదే అవుతుంది.

కోడం పవన్‌కుమార్
9848992825