Saturday, April 27, 2024

పాము ఇంకా చావలేదు!

- Advertisement -
- Advertisement -

coronavirus is not dead yet in india

కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న భారతదేశంలోని కేరళలో కుడి కాలు ముందు పెట్టి శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసేసింది. దాదాపు 10 నెలలు పూర్తి అవుతున్నా దాని హొయలు, జిలుగు, పరుగులో ఎలాంటి భంగపాటు కలుగలేదు. వర్లో మీటర్ అక్టోబర్ 5, 2020 లెక్క ప్రకారం కరోనా మహమ్మారి ఇప్పటికీ 214 దేశాలలోని ప్రజల్ని, ప్రభుత్వాల్ని భయభ్రాంతుల్ని చేస్తూనే వుంది. 3 కోట్ల 54 లక్షల మందికి కరోనా సోకింది. ఆసియా, ఐరోపా దేశాలలో ఇంకా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగానే వుంది. యూరప్‌లోని 48 దేశాల్లో 53.66 లక్షల మందికి కరోనా సోకి 2.25 లక్షల మంది చనిపోయారు. ప్రపంచంలో 76,36,912 కరోనా సోకి అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, 66,23,815 మందితో భారతదేశం రెండో స్థానంలో వుంది.

తర్వాత స్థానాలు బ్రెజిల్, రష్యా, కొలంబియా దేశాలు ఆక్రమిస్తున్నాయి. ఇక మరణాలుపరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 10.41 లక్షలు మరణిస్తే అమెరికాలో 2.14 లక్షలు, బ్రెజిల్‌లో 1.46 లక్షలు, ఇండియాలో 1.2 లక్షలు, మెక్సికోలో 79,088 అత్యధికంగా మరణాలు అని చెప్పవచ్చు. కరోనా వైరస్ 2002లో వచ్చిన సార్స్ కన్నా ప్రమాదకరమైనది. వందలు, వేలుతో ఆరంభమైన కరోనా బాధితుల సంఖ్య 10 నెలల కాలంలో లక్షలు దాటేసింది. ఈ రోజుకీ ఇది ఆగడం లేదు. ఒక్కొసారి మనకు తెలీకనే వచ్చి, తెలీకుండానే వెళ్ళిపోతూ వుంది. ఇలా ఆగస్టు నెలలో ఇండియాలో దాదాపు 20 కోట్ల మందికి కరోనా సోకి అదృశ్యం కూడా అయిపోయిందని ఐసిఎంఆర్ ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వార్త కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ నెల 4వ తేదీకి మన దేశంలో 65,49,374 మంది కరోనా బాధితులు కాగా, ఇప్పటి వరకు లక్షా 2 వేల మంది మరణించటం జరిగింది. నాల్గవ తారీఖు ఒక్క రోజే దేశంలో 75 వేల మందికి కరోనా సోకగా వెయ్యి మంది మరణించటం జరిగింది. వెన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధనల్లో జూన్‌లో కొద్దిగా కరోనా తగ్గు ముఖం పట్టిందని చెప్పినా నేటికీ దీని విజృంభణ ఇంకా ఆగడం లేదు. కాకుంటే మనదేశంలో కరోనా రికవరీ రేటు 84.34 శాతం వుండగా, మరణాలు 1.55 శాతంగా వున్నాయి. దీని ప్రకారం ఇండియాలో 55,09,966 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవడం కూడా జరిగింది.

ఇక మన తెలంగాణ విషయం పరిశీలిద్దాం. ఇక్కడ మొత్తం 1,99,278 మందికి కరోనా సోకగా 28 వేలు ఏక్టివ్ కేసులు మిగిలాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,163 మంది మరణించడం జరిగింది. ఇందులో వి.ఐ.పిలు, సెలెబ్రిటీలు, బిజినెస్‌మెన్, కామన్‌మెన్, జర్నలిస్టులు, డాక్టర్లు, నర్సులు మొదలగు అన్ని వర్గాలూ వున్నారు. కాకుంటే కరోనా విజృంభణ అన్నిచోట్లా ఒకే రీతిలో లేదు. ఏప్రిల్ నెలలో కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు తగ్గు ముఖం పట్టినట్లు అన్పించినా అక్టోబర్ వచ్చే సరికి ఆ అంకెలు, ఆ రాష్ట్ర స్థానాలు పూర్తిగా మారిపోయాయి. మన ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య మొదట్లో చాలా స్పల్పంగా వున్నా రానురాను కాలంలో ఆ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగి ప్రమాదకర స్థాయికి చేరాయి. ఇప్పుడు బాధితుల సంఖ్య 7,19,256 కాగా, పూర్తిగా కోలుకున్నవారు 6,58,875 మంది, మరణించిన వారు 5, 981 మంది. మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో బాధితులు 6,40,661 కాగా డిశ్చార్జి అయిన వారు 5,15,782, మరణాలు 7,286. మరో వైపున తమిళనాడులో సోకినవారు 6,19,996 మంది కాగా డిశ్చార్జి అయిన వారు 5,64,092, మరణాలు 9,784 మంది.

లాక్‌డౌన్ 03 తర్వాత తెలంగాణలో గణనీయమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. ఇక లాక్‌డౌన్ 05 తర్వాత మనుషుల్లో – స్వచ్ఛా విహంగాలు ఆకాశంలో ఎగురుతున్నాయి. భయంకాని, బెరుకుగానీ ఏవీ లేవు. ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ విలువలు వదిలి, భయాన్ని వదిలి సినీ గీతం తప్పక గుర్తుకొస్తుంది. ఇంతకాలం బిక్కు బిక్కుమంటూ బ్రతికిన జనమంతా స్వేచ్ఛ గా తిరిగేస్తున్నారు. ఇంటి షెడ్లకే పరిమితమైన పెద్ద పెద్ద కార్లన్నీ ఈ రోజు రోడ్లపై చిందులేస్తున్నాయి. మందు బాబులు, తెరుచుకొన్న బార్లు విందులు చేసుకొంటున్నారు. యథాపూర్వం ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పిచ్చెక్కిస్తున్న ట్రాఫిక్ మళ్ళీ కొత్త కళను తెచ్చుకొన్న షాపులు, బజార్లు ఒక్కటేమిటి ఒక్క స్కూల్స్, ఒక్క థియేటర్లు తప్ప అన్నీ నిద్ర లేచాయి. అసలు ఈ నగరానికి ఏమైంది. ఒక్క సారిగా అంత ధైర్యం, అంత ఆత్మవిశ్వాసం ఎలా వచ్చింది? ఎక్కడ్నించి వచ్చింది ఎవరి అండ చూసుకొని ఈ జనం నిత్యం జాతర్లు చేసుకొంటున్నారు.

కూకట్‌పల్లి, మలక్‌పేట, అబిడ్స్, మాదాపూర్, టోలీచౌక్ అన్నీ అన్నీ కూడళ్ళలో రద్దీ రద్దీ. మెజారిటీ జనాలు నియమాల్ని అటకెక్కించారు. కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు అయితే ఇంత కాలం మాన్లు తమ అందాల్ని దాచి పెట్టాయన్న కోపంతో అవి గిరాటువేసి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. భౌతిక దూరం బంధాల్ని ఇంత కాలం దూరం చేశాయన్న బాధో ఏంటో కానీ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఆదివారం వస్తే ఫిష్ మార్కెట్, చికెన్ అంగళ్ళు దగ్గర జనాలు చూస్తే పిచ్చెక్కడం ఖాయం తోసుకొంటున్నారు. దూసుకెళ్తున్నారు. ‘ఎగురుతాడు, దూకుతాడు, దుంకుతాడు. అముల్ పాలు తాగుతుంది ఇండియా యాడ్ ప్రజలు ప్రవర్తిస్తున్నారు. బ్రతుకు దెరువు కోసం కూలీనాలీ కోసం దేశం నలువైపుల నుంచి హైద్రాబాద్ చేరిన వలస జీవులు మళ్ళీ మన నగరం చేరుకొంటున్నారు. మల్టీ స్టోరీస్ బిల్డింగ్స్ నిర్మాణాలు మళ్ళీ ఊపందుకొన్నాయి. ఏమైంది ఈ మనషులకు భారత ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక జీవితమంతా నియమాలు, భౌతిక దూరం తప్పనిసరి అని సెలవిచ్చారు.

మరి వాళ్ల పలుకులు గాల్లో కలిపేశారు. సానిటైజర్ వాడకం కూడా తగ్గించారు. ఆంధ్రులు ఆడంబరశూర్లు అనిపించుకున్నారు. మనిషి బుద్ధి మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. ఎవరికి ఏ కోషానా భయం కనడడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి సినీ నటి కాజల్ వరకు అందరూ ఓ వైపు కరోనా బారినపడుతూనే వున్నారు. అవేవీ వీళ్ళు లెక్కలో పెట్టడం లేదు. అత్యంత గొప్ప ట్రీట్‌మెంట్ అందుకొన్న భారత దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీని బారినపడి అసువులు బాశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, దాదాపు 6 దేశాల వైద్యులు పర్యవేక్షించినా మన గాన గాంధర్వుడు బాలును బతికించుకోలేక పోయాము. ఇటీవల కేంద్రం రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కూడా కరోనా కాటుకు బలయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది చనిపోయారు. 2020లో సెప్టెంబర్ నెలను అత్యంత దురదృష్టకర నెలగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో ఇండియాలోని కరోనా బాధితుల సంఖ్య 41 శాతాన్ని, మరణాలు 34 శాతాన్ని పెరిగాయి. సెప్టెంబర్ మనందరికీ పీడ నెల అయితే, కరోనాకు పండుగ నెలే.

తెలంగాణలోని కరీంనగర్, మాల్కాజ్‌గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, జి.హెచ్.యం.సి పరిధిలోని అనేక ఏరియాల్లో ఇప్పటికీ ప్రతి రోజూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఇదిలా వుండగా హైద్రాబాద్, సికింద్రాబాద్ నగరంలో గవర్నమెంటు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకా కిటకిటలాడుతూనే వున్నాయి. ఇంకా కరోనా వైరస్‌ను అరికట్టే మందులు ఇంకా ప్రపంచ మార్కెట్‌లోకే అధికారికంగా విడుదల కాలేదు. ప్రపంచంలోని వివిధ దేశాలలో దాదాపు 70 వ్యాక్సిన్స్ వివిధ ప్రయోగ దశల్లోనే వున్నాయి. భారత దేశంలో కూడా 3 రకాల వ్యాక్సిన్స్ ప్రయోగాలలో ముందంజలో వున్నాయి. ఏది ఎమైనా ఇవి ఈ ఏడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదంటున్నారు. మరి మన జనాలు ఎందుకంత బరి తెగిస్తున్నారు? వీళ్ళ ధీమా ఎమిటీ? కోవిడ్ పై ఎందుకంత నిర్లక్ష్యం! అంత ఈజీగా ఎందుకు తీసుకొంటున్నారు.

ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి డా॥ హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాలకు లేఖ రాస్తూ వచ్చే ఏడాది జూలై నాటికి 50 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోన్లు అందుబాటులోకి రానున్నవి. కనుక ఈ నెల ఆఖరు లోపల మీ ప్రాధాన్యత క్రమ జాబితాలు తయారు చేసి పంపండి అని పేర్కొన్నారు. దీనిని బట్టి వ్యాక్సిన్ రావడం ఇంకా ఆలస్యం కావచ్చు. మరి అంత వరకు మనలో ప్రతి ఒక్కరిలో పూర్వపు క్రమ శిక్షణ, కట్టుబాట్లు చాలా అవసరం. ఆదమరిస్తే ముప్పు చొచ్చుకొచ్చి అందర్నీ కబళించే అవకాశం వుంది. గతవారం ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లిలో జరిగిన ఓ చిన్న ఘటన మనం గుర్తుకు తెచ్చుకొందాం. ఓ స్కూల్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ అర్థం కానట్టి 15 మంది విద్యార్థుల్ని స్పెషల్ క్లాస్‌కు స్కూల్‌కు రావాల్సిందిగా ప్రిన్సిపల్ ఆదేశించారు. మరి ఆ క్లాస్‌కు అటెండ్ అయిన వారిలో 13 మంది చిన్నారులకు కరోనా వచ్చినట్లు తేలింది. ఇది ఎంత బాధాకర ఘటన. చదువుల ఆత్రుతతో ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం భావ్యం కాదు. ఇక కొంత మందిలో కరోనా వచ్చి వెళ్లాకా కొంత కాలానికి తిరిగి రావడం జరుగుతున్నది. ఇది నిజంగా షాకింగే. ఈ నెల 4న విశాఖలో ఒక మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఇలాంటి ఘటనతోనే చనిపోవడం మనం చూశాం.

ఈ కరోనా అన్ని వయస్సుల వారికి కూడా వస్తుండడం జరుగుతున్నది. తెలంగాణలో వయసుల వారీగా చూద్దాం. 10 సం॥ల లోపు : 4. 18శాతం/ 21- 30 లోపు : 23.83 / 41 50 లోపు : 17.18 / 51 60 లోపు : 12.95 / 61. 70 లోపు : 6.89 / 71 80 లోపు : 2.37 / 80 సం॥ పై బడ్డవారిలో : 0.55 – ఇలా మన తెలంగాణలో అన్ని వయస్సుల వారిని కూడా ఈ కరోనా కాటేస్తున్నది. అందరమూ ఇంకా దాదాపు మరో ఏడాది పాటు – జాగ్రతలో వుండాల్సిన అవసరం వుంది.

కాల వ్యావధి ఎక్కువ కావడం, ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలడం, బడుగు జీవులకు బతుకు గడవడమే కష్టం కావడం తదితర అనేక కారణాల వల్ల లాక్‌డౌన్‌ను వివిధ దశలుగా కేంద్రం ఎత్తివేసింది. మరి ఇదేదో వరంలా జనం భావించి, విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. ఎవరికి వాళ్ళు స్వంతంగా తమ చుట్టూ గిరిగీసుకోండి, జాగ్రత్తగా వుండండి. రానున్నవి ‘దసరా’, ’దీపావళి’ పండుగలు. ఇదివరికటిలాగా అత్యుత్సాహాలకు, ఆనందోత్సాలకు, ఆడ ంబరాలకు పోకండి. మీ, మా ఇళ్ళల్లో మీ కుటుంబాలతో కలిపి పండగలు చేసుకోండి, కట్టుబాట్లు విస్మరిస్తే అనవసరంగా‘క్వారంటైంలో వుండాల్సి వస్తుంది. ఎవరి మాటలు నమ్మకండి. ఆ కరోనా పాము పూర్తిగా చచ్చిపోయేవరకు జాగ్రత్త సుమా!

 

డా. సమ్మెట విజయ్ కుమార్- 8886381999

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News