Wednesday, May 1, 2024

66 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

CORONA CASES

 

రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు

ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18

గ్రీన్‌జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా

గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు నర్సులు, వైద్యునికి
పాజిటివ్ లక్షణాలు
హైదరాబాద్‌కు కేంద్ర బృందం, వివిధ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై వివరాల సేకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. గురువారం 50 కేసులుండగా, శుక్రవారం కొత్తగా 66 కేసులు నమోదయ్యాయి. దీంతో మొ త్తం కరోనా కేసుల సంఖ్య 766కు చేరుకుంది. ఇందులో 186 మందిని డిశ్ఛార్జ్ చేయగా, 18 మంది చనిపోయారు. ఇక 562 మంది ప్రభుత్వం నోటిఫై చేసిన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త కేసులు కూడా జిహెచ్‌ఎంసి, సూర్యాపేట జిల్లాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు వచ్చాయి.

ఈ మేరకు గురువారం విడుదల చేసిన బులిటెన్ లో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే జిహెచ్‌ఎంసిలో 417 కేసులు, నిజామాబాద్ లో 58, రంగారెడ్డిలో 23, వికారాబాద్‌లో 33, వరంగల్ అర్బన్‌లో 25, జోగులాండలో 19, సూర్యాపేటలో 44, మేడ్చల్‌లో 5, నిర్మల్‌లో 17, కరీంనగర్‌లో 19, నల్లగొండలో 12, ఆదిలాబాద్‌లో 11, మహబూబ్‌నగర్‌లో 11, కామారెడ్డిలో 11, ఖమ్మంలో 7, సంగారెడ్డిలో 7, మెదక్‌లో 5, భద్రాద్రిలో 4,భూపాలపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల్‌లో 3 చొప్పున, నాగర్‌కర్నూల్, ములుగు, జనగాం, పెద్దపల్లి 2 చొప్పున, మహబూబాబాద్, సిద్ధిపేట, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

13 జిల్లాల్లో 209 కంటైన్మెంట్ ప్రాంతాలు
వైరస్ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందగా, శుక్రవారం నాటికి 13 జిల్లాల్లో 209 కంటైన్‌మెంట్ ప్రాంతాలను సర్కారు ఏర్పాటు చేసింది. ఇందు లో తాజాగా 1,09,975 ఇళ్లకు వెళ్లి, 4,39,900 మందిని వైద్య బృందాలు కలిశాయి. వారి వివరాలు సేకరించాయి. కరోనా పాజిటివ్ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేసి పరీక్ష లు చేస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

కేంద్ర బృందం రాక
రాష్ట్రంలో కరోనా ఘంటికలు మోగుతుండటంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక్కడ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించింది. ఆ బృందం సభ్యులు గాంధీ, ఛెస్ట్ ఆసుపత్రుల కు వెళ్లి కరోనా బాధితులకు అందుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై ఏర్పాట్లప్లై సంతృప్తి వ్యక్తంచేశారు. సూచనలు సలహాలు ఇచ్చారు.

మంచిర్యాలలో తొలికేసు
కేంద్రం ప్రకటించిన గ్రీన్ జోన్‌లో ఉన్న మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఓ మహిళ మృతిచెందిన తరువాత పరీక్ష లు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. చెన్నూరు మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన గద్దె లక్ష్మి(48)ని అనారోగ్య కారణాలతో ఈ నెల 13న కుటుంబసభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిఫార్సు మేరకు అదే రోజు అర్థరాత్రి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో కేవలం పాజిటివ్ కేసులు మాత్రమే చూస్తామని వైద్యులు చెప్పడంతో బాధితురాలిని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చేర్పించే క్రమంలో ఈ నెల 14న తెల్లవారుజామున అంబులెన్స్‌లోనే లక్ష్మి మృతి చెందింది. వారి కుటుంబ సభ్యులను, చికిత్స చేసిన డాక్టర్లను క్వారంటైన్‌కు తరలించారు.

గాంధీలో డాక్టర్‌కు.. ఇద్దరు సిబ్బందికి లక్షణాలు
గాంధీ మెడికల్ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో పాటు ఇద్దరు నర్సులు, ఒక వైద్యునికి పాజిటివ్ లక్షణాలు రావడంతో వైద్యులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని కాంటాక్టు అయిన వారిని అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఎంతమందిని సోకుతుందోనని వణికిపోతూ మెడికల్ కళాశాల సిబ్బంది రక్తనమూనాలు సేకరిస్తున్నారు. సిబ్బందికి రావడంతో ఎవరి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు గాంధీ ఆసుపత్రి ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు నర్సులు సంతోషనగర్, అమన్‌నగర్ చెందిన వారు కావడంతో మర్కజ్ వెళ్లి వారిని కలిసినట్లు అనుమానిస్తున్నారు.

 

Covid victims to 766 in Telangana state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News