Saturday, May 4, 2024

అతిక్రమిస్తే కేసులు

- Advertisement -
- Advertisement -

KTR

 

జ్వరం, గొంతు నొప్పికి మందులు
కొనుగోలు చేసినా వివరాలు తెలుసుకోండి

రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్‌లు.. జిహెచ్‌ఎంసి పరిధిలోనే 146
వాలంటీర్లు, సిబ్బందితోనే నిత్యావసరాలు పంపిణీ.. దాతలను అనుమతించొద్దు
వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ
అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కెటిఆర్, ఈటల వీడియో కాన్ఫరెన్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ -19ను అరికట్టేందుకు కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆ విధంగా జిహెచ్‌ఎంసి పరిధిలో 15 కంటైన్మెంట్ జోన్లను తొలగించినట్లు ఈ సందర్భంగా మంత్రి ఉదహరించారు. మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి జిహెచ్‌ఎంసి కార్యాలయం నుండి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో కెటిఆర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయగా వాటిలో జిహెచ్‌ఎంసి పరిధిలోనే 146 జోన్లు ఉన్నాయన్నారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీలలో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు మంత్రి స్పష్టం చేశారు.

పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్‌ను ఇండ్ల వద్దకే సరఫరా ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు, సిబ్బందితో చేయాలని సూచించారు. వీలైతే వారికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్‌లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. శానిటేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వేలను తగు జాగ్రత్త లతో నిర్వహించాలని సూచించారు. శానిటేషన్, స్ప్రేయింగ్ సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించేవిధంగా మానిటరింగ్ చేయాలని తెలిపారు. సోడియం హైఫో క్లోరైట్ ద్రావణం నిల్వలను ముందస్తుగా తెప్పించుకోవాలన్నారు. శానిటేషన్ తో పాటు మురుగునీటి వ్యవస్థలను మానిటరిం గ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కంటైన్మెంట్ నిబంధనల అమలులో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, వాటర్ వర్క్, ప్రజారోగ్య విభాగాలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

సొంత వైద్యం ప్రమాదకరం
సొంత వైద్యం మరింత ప్రమాదమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇటీవల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీలలోని ఫార్మసీ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్షించాలని తెలిపారు. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని తెలిపారు. మంత్రి ఈటల మాట్లాడుతూ సిఎం కెసిఆర్ పరిశుభ్రతపై దృష్టి సారించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించడం వలన రాష్ట్రంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇది దోహదపడుతున్నట్లు తెలిపారు. అత్యవసర సేవలను అందించుటకై ప్రైవేట్ అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.

కంటైన్మెంట్ జోన్లను మానిటరింగ్ చేసేందుకు చేపట్టాల్సిన 12 ప్రధాన అంశాల గురించి అధికారులకు కెటిఆర్ వివరించారు.
1) సరైన విధంగా బారీకేడింగ్ చేయాలి.
2) సంబంధిత శాఖల సిబ్బందిని నియమించాలి.
3) ఫీవర్ సర్వేకు పారా మెడికల్ సిబ్బందిని నియమించాలి.
4) శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి.
5) నిత్యవసర వస్తువులను ఇంటింటికి అందించుటకై ఏర్పాట్లు చేయాలి.
6) పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా కంటైన్మెంట్ నిబంధనలు పాటించాలని కోరుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ప్రచారం చేయాలి. 7) ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయాలి.
8) ప్రతిరోజు మెడికల్ టీమ్, అధికారులు ప్రతి ఇంటిని సందర్శించాలి.
9) సీనియర్ అధికారులు కంటైన్మెంట్ ఏరియాని తనిఖీ చేయాలి.
10) కంటైన్మెంట్ జోెన్లలోని ప్రజలను ఇంటికే పరిమితం చేయాలి, వారి కదలికలను నియంత్రించాలి.
11) అత్యవసర వైద్య సేవలకై అంబులెన్సును సిద్దంగా ఉంచాలి.
12) బియ్యాన్ని పంపిణీ చేయాలి.

 

KTR video conference with officials
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News