Saturday, April 27, 2024

ఘట్‌బంధన్‌తో కటీఫ్

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో బిజెపితో లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాట్ల కు జెడియు అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న జెడియు, కాంగ్రెస్, ప్ర ధానవాటాదారు అయిన ఆర్జేడీతో కూడిన మహాఘట్‌బంధన్‌కు నితీశ్ చెల్లుచీటి పాడనున్నారు. ఇండియా కూటమికి దాదాపు గా టాటా చెప్పిన జెడియు అధినేత ఇప్పుడు బిజెపి సారధ్యపు ఎన్‌డిఎకు వెలుపలి నుంచి మద్దతుకు సన్నాహాలు చేసుకున్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో సీట్ల సర్దుబాట్లపై ఇప్పటికే నితీశ్ నేరుగా అమిత్ షా, మోడీలతో లోపాయికారి మంతనాలు పూర్తి చేశారు.

ఇక మహాఘట్‌బంధన్‌లోని ఆర్జేడీ మంత్రులను బర్తరఫ్ చేసి , వారి స్థానంలో బిజెపి నేతలకు స్థానం కల్పిస్తారని వెల్లడైంది. సభలో తన సారధ్యపు బలం చెక్కుచెదరకుండా ఉండేందుకు బిజెపి ఎమ్మెల్యేల మద్దతును సమీకరించుకుని , దీనికి అనుగుణంగా సిఎంగా ఆదివారం లేదా సోమవారం ఉదయం తిరిగి ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడైంది. బిజెపి వైపు నితీశ్ వెళ్లకుండా చేసేందుకు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇప్పుడు ఎంతగా యత్నించినా ఫలితం దక్కలేదు. వీరి నుంచి పలు సార్లు ఫోన్లు వచ్చినా నితీశ్ వారికి అందుబాటులో లేననే సమాధానాలతోనే తప్పించుకున్నారని వెల్లడైంది. దీనితో రాష్ట్రంలో ఇప్పుడు ఇక బిజెపి మిత్రపక్షపు జెడియు సర్కారు అవతరణ ఉందని పరిశీలకులు స్పష్టం చేశారు. రాజీ యత్నాలకు అందనంతదూరానికి నితీశ్ చేరినట్లు గత రెండు మూడు రోజుల కీలక పరిణామాలతో వెల్లడైంది.

లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ మంత్రులను బర్తరఫ్‌తో ఇంటికి పంపించాలని నితీశ్ నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది. దీనితో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఉనికికి మరింత బీటలబాటలు సుస్పష్టం అయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. వచ్చే ఏడాది జరుగుతాయి. అయితే వచ్చే రెండు మూడు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. దీనిని గుర్తించి ఇప్పటికే సీట్ల సర్దుబాట్లపై బిజెపితో నితీశ్ ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. బీహార్‌లో ఆర్జేడీరహిత తన ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఇవ్వడం, ఇందుకు ప్రతిగా లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి మద్దతు, రాష్ట్రంలో సీట్ల సర్దుబాట్ల ఒప్పందం కుదిరినట్లు వెల్లడైంది. నితీశ్‌కుమార్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బిజెపి ఎమ్మెల్యేలంతా తమ లేఖలను సమర్పించారు. వీటిని అవసరమైనప్పుడు గవర్నర్‌కు పంపించేందుకు నితీశ్ వర్గం సిద్ధంగా ఉంది.
2022లో బిజెపికి షాక్.. ఇప్పుడు రివర్స్
జెడియు అధినేత నితీశ్ బీహార్ బాగుకోసం ఏమైనా చేస్తానని ప్రకటించే రకం. 2022 ఆగస్టులో మహాఘట్‌బంధన్‌లో చేరేందుకు బిజెపితో దూరం అయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న నితీశ్ పలుసార్లు తిరిగి తాను కలలో కూడా బిజెపి వైపు వెళ్లే ఛాన్స్ లేదని ప్రకటించారు. అదే జరిగితే పేరు మార్చుకుంటానని శపథం పట్టారు. అయితే ఇప్పుడు పలు పరిణామాలు ఇండియా కూటమిలో తన పరిస్థితితో విసిగివేసారి బిజెపి వైపు మొగ్గు చూపినట్లు వెల్లడైంది. బీహార్‌లో తన తాజా తిరుగుబాటు వ్యూహరచనను అమిత్ షా, మోడీలతో కలిసి రూపొందించుకుని, సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు అదును చూసుకుని ప్రయోగించినట్లు వెల్లడైంది.
నేడు జెడియు, బిజెపి ఎంఎల్‌ఎలకు విందు
ఆదివారం కీలక పరిణామాల నేపథ్యంలోనే జెడియూ అధినేత నితీశ్ తన నివాసంలో బిజెపి, జెడియు ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేశారు. దీని తరువాత ఇరుపార్టీల ఎమ్మెల్యేలు కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు మద్దతు లేఖలు ఇస్తారని వెల్లడైంది. దీనితో మహాఘట్‌బంధన్ కథ గయకు చేరినట్లు అవుతుంది. బిజెపికి చెందిన వారికి మంత్రివర్గంలో చోటు, ఈ పార్టీకి చెందిన వారికే ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం కీలక పరిణామాలు కానున్నాయి. ఇప్పటి డిప్యూటీ సిఎం తేజస్వీ యాదవ్ ఉద్వాసన ఫలితంగా ఏర్పడే ఖాళీని పలుకుబడిగల బిజెపి బిసి నేత ద్వారా భర్తీ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపి అయిన , మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోడీకి తిరిగి ఇదే పదవి అప్పగిస్తారని వెల్లడైంది.
కాగా 2025 తరువాత నితీశ్‌కుమార్‌కు కేంద్రంలో అత్యున్నత స్థాయి కీలక పాత్ర ఇచ్చేందుకు మోడీ, షాలు సిద్ధం అయినట్లు దేశ రాజధానిలోని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండియా కూటమి అత్యంత సంక్లిష్ట దశలో కొట్టుమిట్టాడుతున్నప్పుడే బీహార్ పరిణామాలు జరగడం పిడుగుపాటు అయింది. నితీశ్ తరచూ మత రాజకీయ మిత్రపక్షాలను మారుస్తూ ఉంటారని ప్రచారం నిజం అయింది. ఆయన 2013 నుంచి ఇప్పటివరకూ బిజెపి, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డి, ఆర్జేడీ నడుమ పలుసార్లు తమ విన్యాసాలు సాగిస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఆయన రాజకీయ పల్టూరామ్ అని పేరు కొనితెచ్చుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటిని ఒకేతాటికి తీసుకువస్తానని తెలిపి, ఇండియా కూటమి అవతరణకు పాట్నాలోనే అంకురార్పణకు దిగిన నితీశ్ ఇప్పుడు పాట్నా నుంచే ఇండియా కూటమికి బీటలకు, బీహార్‌లో బిజెపికి తగు బాటలకు వీలు కల్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News