Friday, April 26, 2024

ఐరోపా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ

- Advertisement -
- Advertisement -

Daily cases exceeding 50 thousand in Germany

పది రోజులు పూర్తి లాక్‌డౌన్ ప్రకటించిన ఆస్ట్రియా
జర్మనీలో 50 వేలు దాటిన రోజువారీ కేసులు
రష్యాలో ఆగని మరణ మృదంగం

బెర్లిన్: యూరప్ దేశాల్లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పలు దేశాల్లో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడకపోవడంతో పాటు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోవడంతో కొవిడ్ కేసులు మళ్లీ వేల సంఖ్యలు నమోదవుతున్నాయి. యూరప్ ఖండంలో అతి తక్కువ వ్యాక్సినేషన్ రేటు నమోదయిన దేశాల్లో ఒకటయిన ఆస్ట్రియా శుక్రవారం దేశవ్యాప్తంగా పది రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. వచ్చే సోమవారంనుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలులో ఉండనున్నట్లు ఆ దేశ చాన్సలర్ అలెగ్జాండర్ చాల్లెన్‌బెర్గ్ ప్రకటించారు. టీకా తీసుకోవాలని ప్రభుత్వం ప్రచారం కల్పిస్తున్నప్పటికీ ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ‘ టీకాలు వేసుకునేందుకు నెలల తరబడి కృషి చేసినప్పటికీ తగినంతమందిని ఒప్పించడంలో మేము విజయం సాధించలేక పోయాం’ అని చాల్లెన్‌బెర్గ్ ఓ మీడియా సమావేశంలో తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

వ్యాక్సిన్లు వేసుకోని వారు ఆరోగ్య వ్యవస్థపై దాడి చేస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఈ పది రోజుల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లు విడిచి బైటికి వెళ్లొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా అర్హులందరికీ రెండు డోసులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ దేశంలో ఇంకా టీకా తీసుకోని వారు ఇళ్లకే పరిమితం కావాలని ఆస్ట్రియా గత సోమవారమే ఆదేశించింది. కేవలం విధులు, విద్య, వైద్య అవసరాలు, నిత్యావసరాలకోసం మాత్రమే బయటికి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఆస్ట్రియాలో ఇప్పటివరకు 65 శాతం అర్హులకే రెండు టీకాలు పూర్తయ్యాయి. మరోవైపు ఇన్‌ఫెక్షన్ రేటు ప్రతి లక్ష మందికి 775గా ఉంది. పొరుగున ఉన్న జర్మనీ( ప్రతి లక్ష మందికి 289)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అందుకే ఆ దేశం ఆస్ట్రియాను ‘హైరిస్క్ జోన్’గా ప్రకటించింది.

జర్మనీలో రోజువారీ కేసులు 50 వేల పైమాటే

మరో వైపు జర్మనీలో వరసగా మూడో రోజు శుక్రవారం కూడా 50 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం జర్మనీ అత్యవసర స్థితిలో ఉందని, దీన్ని కట్టడి చేయాలంటే ఎమర్జెన్సీ బ్రేక్ వేయక తప్పదని జర్మనీ డిసీజ్ కంట్రోల్ ఏజన్సీ హెచ్చరించింది. మరోవైపు ఆస్పత్రులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అన్నీ కొవిడ్ రోగులతో కిక్కిరిసి పోయి ఉన్నాయని, అందువల్ల రెగ్యులర్ వైద్య చికిత్సలకు ఏమాత్రం గ్యారంటీ ఇవ్వలేమని రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి లోథర్ వీలర్ చెప్పారు. కాగా కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయడానికి కొత్త చర్యలకు జర్మనీ పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన సెంటర్‌లెఫ్ట్ కూటమి ఈ చర్యలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం పబ్లిక్ వర్క్‌ప్లేస్‌లకు వెళ్లే వారు, ప్రజా రవాణాలో పర్యటించే వారు తాము వ్యాక్సిన్ తీసుకున్నట్లు లేదా, తమకు కరోనా నెగెటివ్ ఉన్నట్లు నిరూపించుకోవలసి ఉంటుంది. వైద్య సిబ్బంది, నర్సింగ్ హోమ్ ఉద్యోగులు లాంటి కొన్ని ప్రొఫెషనల్ గ్రూపులకు తప్పనిసరి వ్యాక్సినేషన్‌ను అమలు చేసే విషయాన్ని కొన్ని రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి.

రష్యాలో రోజూ 1250 మరణాలు

మరో వైపు రష్యాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. మూడు రోజులుగా ప్రతిరోజూ అక్కడ దాదాపు 1250 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరో వైపు శుక్రవారం దేశంలో కొత్తగా 37,156 మందికి కరోనా సోకింది. గత కొన్ని వారాలుగా రష్యాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంతకు ముందు కరోనా ఉధృతులతో పోలిస్తే ఇప్పటికీ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడం. జనం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఇష్టపడక పోవడమే మరణాలు, కేసులు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం.

ప్రపంచంలో అందరికన్నా ముందే తొలి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినప్పటికీ రష్యాలో ఇప్పటికీ పూర్త్తి టీకాలు తీసుకున్న వారు 40 శాతంకన్నా ఉండడం గమనార్హం . యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,61,000 మంది కరోనా కారణంగా మృతి చెందగా 92 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఈసంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని కొంత మంది నిపుణులు అంటున్నారు. యూరప్‌లోని మిగతా దేశాల్లో గత కొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు పెరుగుతుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News