Monday, May 6, 2024

మరణాలు భారత్‌లోనే తక్కువ

- Advertisement -
- Advertisement -

Death rate

 

3.2శాతం మాత్రమే కొవిడ్ మృతులు, కోలుకున్న 10,633 (26.59%) మంది రోగులు

అగ్రరాజ్యాలతో పోలిస్తే మనమే బెటర్
నిలకడగా కరోనా బాధితుల పెరుగుదల రేటు
10లక్షలకుపైగా టెస్టులు చేశాం, రోజుకు 74వేలకుపైగా పరీక్షలు
ఎలాంటి పరిస్థితిన్నైనా ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉంది : కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యాలు సహా అనేక దేశాలు కకావికలమవుతున్నాయి. ఈ సందర్భంగా మిగతా దేశాలతో పోలిస్తే కోవిడ్19 మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దేశంలో కోవిడ్19 మరణాల రేటు 3.2 శాతంగా ఉందని.. ఇది ప్రపంచంలోనే అతి తక్కువగా ఉండడం ఊరటనిచ్చే అంశమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. గత కొంత కాలంగా కరోనానుంచి కోలుకొంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని, ఇప్పటికే 10,633 మంది బాధితులు కోలుకొన్నారని కూడా ఆయన చెప్పారు.

ఈ వైరస్‌నుంచి కోలుకొంటున్న వారిశాతం భారత్‌లో 26.59గా ఉండడం ఊరటనిచ్చే అంశమని ఆయన అన్నారు. అంతేకాకుండా గత వారం రోజులుగా కొత్త పెరుగుదల రేటు కూడా నిలకడగా ఉందని చెప్పారు. ఆదివారం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం గత మూడు రోజులుగా డబ్లింగ్ రేటు12 శాతంగా ఉంది. వారం రోజుల క్రితం ఇది 11.7 శాతంగా ఉండగా, 14 రోజుల క్రితం ఇది 10.4 శాతంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు మనం 10లక్షల టెస్టుల సంఖ్యను దాటాయని, ప్రస్తుతం రోజుకు 74,000కు పైగా టెస్టులు నిర్వహిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రభుత్వం 20 లక్షలకు పైగా పిపిఇ కిట్లను పంపిణీ చేశామని, వందకు పైగా దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ మందులను సరఫరా చేశామని హర్షవర్ధన్ చెప్పారు.

కరోనాపై పోరులో మనం గెలిచి తీరుతామన్న విశ్వాసాన్ని హర్షవర్ధన్ వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. దేశ్యాప్తంగా కరోనా పేషెంట్ల కోసం 2.5లక్షల పడకలను సిద్ధం చేశామని తెలిపారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ ఒక్కటే సరయిన ఆయుధమని మంత్రి చెప్తూ, అందువల్ల ఈ నెల 17 వరకు మరోసారి పొడిగించిన లాక్‌డౌన్‌ను తు.చ తప్పకుండా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా రాత్రనక, పగలనక కరోనా బాధితులకు సేలందిస్తున్న వైద్యుల విధులకు ఆటంకం కలిగించవద్దని, అలాగే వైరస్‌నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న వారిని వెలివేసినట్లుగా చూసి వారికి మానసిక వేదన కలిగించవద్దని కూడా ఆయన కోరారు. కోవిడ్19పై మన దేశం జరుపుతున్న పోరుపట్ల ప్రపం ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ)నే కాకుండా మొత్తం ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోందని హర్షవర్ధన్ అన్నారు. కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు హర్షవర్ధన్ ఆదివారం నగరంలోని లేడీ హార్డింగ్స్ మెడికల్ కాలేజిని సందర్శించారు. అక్కడి కోవిడ్19 బ్లాక్‌లో ఆయన డాక్టర్లతో, చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News