Friday, April 26, 2024

గృహ నిర్బంధంలో కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -
Delhi CM Kejriwal under house arrest
ఆప్ ఆరోపణలు ఖండించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లోని సింఘూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకున్న తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ఆరోపించింది. కాగా.. ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సింఘూ సరిహద్దుల వద్ద ఆందోళన చేస్తున్న రైతులను సోమవారం కలుసుకుని వారికి అవసరమైన సౌకర్యాల గురించి చర్చించారు. కాగా..రైతుల భారత్ బంద్ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. సింఘూ సరిహద్దుల వద్ద రైతులను కలుసుకున్నప్పటి నుంచి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధం చేశారని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.

ఎవరినీ ముఖ్యమంత్రి ఇంట్లోకి పంపడానికి కాని వెలుపలకు రానివ్వడానికి కాని పోలీసులు అనుమతించడం లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వెళ్లిన తమ ఎమ్మెల్యేలను పోలీసులు తన్ని తరిమేశారని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను కూడా అనుమతించడం లేదని ఆయన చెప్పారు. తనను కూడా కేజ్రీవాల్ నివాసం లోకి అనుమతించలేదని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విలేకరులకు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) సతీష్ గోల్చా ఖండించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఇవన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి యథావిధిగా తన అధికార కార్యక్రమాలలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. తన నివాసం నుంచి వెలుపలికి వస్తున్న కేజ్రీవాల్ ఫోటోను ఢిల్లీ డిసిపి(ఉత్తర) ఆంటో అల్ఫోన్స్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News