Saturday, April 27, 2024

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ పాఠాలు

- Advertisement -
- Advertisement -

digital lessons for public school students in telangana

ఈ నెల 15 నుంచి ప్రారంభించే అవకాశాలు
ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌పై కసరత్తు

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌లో భాగంగా ఈ నెల 15 నుంచి టివి, డిజిటల్ తరగతులు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విద్యా బోధనపై ప్రెవేటు పాఠశాలలకే పరిమితమైంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ప్రత్యామ్నాయ బోధన లేకపోవడంతో టివి, డిజిటల్ తరగతులపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. టివి, డిజిటల్ తరగతులపై ప్రభుత్వ అనుమతి తీసుకుని ఈ నెల 15 నుంచి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, విద్యార్థులకు కూడా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు అందుబాటులో లేని కారణంగా ఇప్పటివరకు ఆన్‌లైన్ తరగతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం టి సాట్,యాదగిరి వంటి టివి చానళ్ల ద్వారా రికార్డు చేసిన వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన వీడియో పాఠాలు, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ (ఎస్‌ఐఇటి) రూపొందించిన తరగతుల వారీగా వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని సద్వినియోగ పరచుకునేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వాటితోపాటు అవసరమైన పాఠాలను రికార్డు చేసి ప్రసారం చేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది. రాష్ట్రంలోని 40,597 పాఠశాలల్లో 58 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అందులో 31 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉంటే 27 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోని కార్పొరేట్, కొంత పేరున్న స్కూళ్లు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించగా, 2020-21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టివి పాఠాలు, వీడియో పాఠాలు అందుబాటులోకి రానున్నాయి.

ఆరవ తరగతి నుంచే వీడియో పాఠాలు

6 నుంచి 10 తరగతుల విద్యార్థులకే డిజిటల్ పాఠాలను ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 6-10 తరగతులకు ప్రతిరోజూ ఒక పీరియడ్ టి సాట్ ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్నారు. వాటిని కొనసాగిస్తూనే అదనంగా విద్యార్థులందరికీ వర్క్‌షీట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతిరోజూ ఒక్కో తరగతికి రెండు గంటల చొప్పున 3 తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కోక్లాస్ అరగంట ఉండేలా, ప్రతి తరగతికి మధ్య 10 నుంచి 15 నిమిషాలు విరామం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వర్క్‌షీట్ల ద్వారా సబ్జెక్టుపై అవగాహన కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. అయితే వాటిని విద్యార్థులకు చేరవేయడం ప్రశ్నార్థకంగా మారింది. ఎంఇఒల ద్వారా ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పంపిం చి, వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News