Saturday, April 27, 2024

కెప్టెన్ విజయకాంత్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

చెన్నై : ప్రముఖ తమిళ, బహుభాషా నటులు, డిఎండికె వ్యవస్థాపక నేత విజయకాంత్ గురువారం కన్నుమూశారు. క్యెప్టెన్‌గా, కరుప్పు ఎంజిఆర్ ( నల్ల ఎంజిఆర్ అన్న) తమిళనాట విశేష ప్రజాదరణ పొందిన విజయకాంత్ సుదీర్ఘ అనారోగ్యం తరువాత అభిమానులకు సెలవంటూ వెళ్లారు. తమిళనాడులో ఎంజిఆర్ తరువాత అత్యంత ప్రేక్షకాభిమానం దక్కించుకున్న హీరోగా విజయకాంత్‌కు గుర్తింపు ఉంది. ద్రవిడ పార్టీలు అన్నాడిఎంకె, డిఎంకెలకు విజయ్‌కాంత్ స్థాపించిన , నడిపించిన ‘దేశీయ మురుపోక్కు ద్రవిడ కజగం (డిఎండికె) ఓ దశలో సరైన పోటీ ఇచ్చి, ప్రత్యామ్నాయం అవుతుందని భావించారు. అయితే గత నాలుగు అయిదు సంవత్సరాలుగా విజయ్‌కాంత్ తెరవెనకకు వెళ్లాల్సి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ఆయన సినిమాలకు రాజకీయాలకు దూరం అయ్యారు. దీనితో ఈ నెల 14వ తేదీనే ఆయన భార్య ప్రేమలత పార్టీ సారధ్య బాధ్యతలను తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ సమావేశంలో ప్రకటించారు.

తమిళనట దిగ్గజం అయిన విజయ్‌కాంత్ వయస్సు 71 సంవత్సరాలు. పలు సినిమాలలో నటించినా ఆయన కెప్టెన్ సినిమాతో తమిళ తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్రవేసుకున్నారు. 1991లో ఈ సినిమా విడుదల అయింది. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మధురైలో1962 ఆగస్టు 25వ తేదీన జన్మించిన విజయ్‌కాంత్ పూర్తిపేరు నారాయణన్ విజయరాజు అగర్‌స్వామి , సినిమాల్లోకి వచ్చిన తరువాత విజయ్‌కాంత్‌గా మార్మోగారు. తీవ్రస్థాయి న్యూమోనియా సంబంధిత సమస్యలతో శ్వాసకోశ ఇబ్బందులతో ఆయన మృతి చెందినట్లు నిర్థారణ అయింది. కెప్టెన్ సినిమాలో విజయకాంత్ ఓ అటవీశాఖాధికారి పాత్ర పోషించారు. ఈ సినిమా పలు భాషలలోకి రూపాంతరం చెందింది. అన్ని భాషలలో హిట్ దక్కించుకుంది. రాజకీయాలలో పలు ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ సాగిన విజయ్ 2016 నుంచి తీవ్రస్థాయి అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఎంతో ఆరోగ్యంగా శారీరక ధారుఢ్యంతో ఉండే విజయ్‌కాంత్‌లో తలెత్తిన ఇమ్యూనిటి సమస్య ఆయనలో పలురకాల జబ్బులకు దారితీసింది. దీనితో ఆయన కోలుకోలేక పొయ్యారు. తమిళ టైగర్ ప్రభాకరన్ పట్ల విజయ్‌కాంత్ విశేష అభిమానంతో మెదిలారు.

ఆయన ఇద్దరు కుమారులలో ఒక్కడికి ప్రభాకరన్ అని పేరు పెట్టారు. విజయకాంత్‌ను డిఎంకె అధినేత కరుణానిధి ఎంతగానే ఆదరించేవారు. ఆయన పెళ్లికి, కుటుంబ కార్యక్రమాలకు కరుణానిధి హాజరయ్యే వారు. విజయకాంత్ చికిత్స పొందుతోన్న స్థానిక మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రి వర్గాలు ఆయన తనువు చాలించిన విషయం గురించి అధికారిక ప్రకటన వెలువరించాయి. న్యూమోనియాతో తమ ఆసుపత్రిలోకి చేరిన విజయ్‌కాంత్ వెంటిలేటర్ల సాయంతో ఉండాల్సి వచ్చింది. ఆయనను రక్షించేందుకు పలు విధాలుగా వైద్యపరంగా యత్నించినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు. ఈ రోజు ఉదయం కన్నుమూశారని తెలిపారు. డిఎండికె వర్గాలు ఓ ప్రకటనలో విజయకాంత్‌కు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని, తరువాత కృత్రిమ శ్వాస సాగిందని తెలిపారు. అయితే ఈ ప్రకటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. పార్టీ వారు వెలువరించిన ప్రకటన రెండో రౌండ్ శాంపుల్స్ అందుబాటులోకి రావడానికి ముందు సిద్ధం చేసి ఉంటారని వివరించారు.

2005లో రాజకీయ రంగంలోకి
మెరుపు వేగం .. క్రమేపీ బ్రేక్‌లు
సినిమాలలో తాను పోషించిన వీరోచిత ఉదాత్త పాత్రలను జీర్ణించుకుని విజయకాంత్ 2005లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సినిమా ప్రపంచంలో ఆయనకు ధార్మికుడు, ధాతృత్వపరుడు అనే పేరుంది. డిఎంకె, అన్నాడిఎంకె పోటాపోటీ రాజకీయాలతో, తమ ముందుకు వచ్చే రగల్చే ద్రావిడ సెంటిమెంట్ల పార్టీల నేతల వరుసతో విసిగిన తమిళులు విజయకాంత్ పట్ల ఎంతో ఆశ పెంచుకున్నారు. ఆయనకు అపార ఫ్యాన్ బలం ఉండటంతో దీనిని ఆయన తన రాజకీయ సోపానంగా ఎంచుకున్నారు. ఆయన ఎంట్రీ బలీయంగా సాగింది. తెరపై కన్పించగానే ఉద్వేగం రెకెత్తించే నటుడిగా , ప్రత్యేకించి మాస్ హీరోగా ఆయన ఇమేజ్ తమిళనాడు రాజకీయాలలో ప్రముఖ స్థానానికి ఆయనను తీసుకువెళ్లింది. తమిళంలో వచ్చిన రమణ సినిమాలో అవినీతిపై పోరాడే పాత్రలో జవించిన విజయ్‌కాంత్ ఈ ఇమేజ్‌ను కొనసాగిస్తూ 2005 సెప్టెంబర్ 14న డిఎండికె స్థాపించారు. తమిళనాడులో ఈ పార్టీకి పలు అనుబంధ విభాగాలు వెలిశాయి. 2006 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీకి దాదాపు 9 శాతం ఓట్లు వచ్చాయి. అయితే కేవలం ఆయన ఒక్కడే గెలిచారు.

తరువాత పిఎంకెతో పొత్తు కుదుర్చుకున్నారు. సాధారణంగా నటులను దూరంగా ఉంచే పిఎంకె విజయ్ ఛరిష్మాను పరిగణనలోకి తీసుకుని ఆయనతో కలిసి సాగింది. తన కూటమి కేవలం ప్రజలతోనే అని తరచూ విజయ్‌కాంత్ చెప్పేవారు. తరువాతి లోక్‌సభ ఎన్నికలలో ఆయన పార్టీ ఓట్లశాతం తగ్గింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడిఎంకె తో సర్దుబాట్లకు దిగారు. ఈ ఎన్నికలలో ఆయన పార్టీకి 29 స్థానాలు దక్కాయి. దీనితో ఆయన 2011 నుంచి 2016 వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎనిమిది శాతం ఓట్లు దక్కించుకుని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ అయిన డిఎండికె ఈ దశలో డిఎంకె ప్రాబల్యానికి బ్రేక్ వేసింది తరువాత డిఎండికె అన్నాడిఎంకె పొత్తు ముగిసింది. 2014 సార్వత్రిక ఎన్నికల దశలో విజయకాంత్ బిజెపి కూటమితో కలిసి సాగారు. ఈ ఎన్నికలలో పిఎంకె, వైకో సారధ్యపు ఎండిఎంకె కూడా మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో విజయ్‌కాంత్ పార్టీ బలం గణనీయంగా పడిపోయింది. కేవలం 5 శాతం ఓట్లు వచ్చాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కాంత్ పార్టీ మక్కల్ నల కూటాని (పీపుల్స్ వెల్ఫెర్ ఫ్రంట్)లో ప్రధాన పార్టీ అయింది. ఈ నాలుగు పార్టీల కూటమిలో వామపక్షాలు, విసికె కూడా భాగస్వామ్యపక్షాలు అయ్యాయి.

ఈ కూటమి ముందు రాష్ట్రంలోని రెండు కీలక పార్టీలు డిఎంకె, అన్నాడిఎంకెకు సవాలు విసిరాయి. ఈ ఎన్నికలలో ఈ కూటమి పూర్తిగా దెబ్బతింది. చివరికి విజయ్‌కాంత్ ఉలుందురూపేట నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా కొల్పోయ్యారు. ఈ దశ నుంచి క్రమేపీ ఆయన రాజకీయ జీవితంపై మబ్బులు పర్చుకున్నాయి. వెండితెరపై రాణించడం తేలికే కానీ రాజకీయ జల్లికట్టు అంత ఈజీ కాదని విజయకాంత్ ఉదంతం తేల్చివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News