Saturday, April 27, 2024

ఎరువుల ధరలు!

- Advertisement -
- Advertisement -

Do not enforce inflated Fertilizer prices

 

బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను దారుణంగా తగ్గించి వేసి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలను తీవ్ర వేదనకు గురి చేసి ఆ వెంటనే నాలుక కరుచుకొని ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎరువుల ధరల విషయంలోనూ అదే నాటకాన్ని రక్తి కట్టించింది. డిఎపి (డై అమ్మోనియం ఫాస్ఫేట్), కాంప్లెక్స్ (మిశ్రమ) ఎరువుల ధరలను 58 శాతం పెంచుతున్నట్టు అది ఈ నెల నుంచే అమల్లోకి వస్తున్నట్టు గురువారం నాడు ఎరువుల కంపెనీలు చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా రైతుల గుండెల్లో మంటలు రేపాయి. అసలే పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించక ఒకవైపు, మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీల అదుపులోకి నెట్టివేయడానికి మూడు కొత్త చట్టాలు తెచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మరోవైపు తీవ్ర ఆందోళనకు గురై ఉన్న రైతులపై అగస్మాత్తుగా వెలువడిన ఎరువుల ధరల అసాధారణ పెంపు నిర్ణయం పిడుగుపాటును తలపించింది.

నిరసనలు వెల్లువెత్తగానే నాలుక కరుచుకునే విద్యలో ఆరితేరిన కేంద్రం శుక్రవారం నాడు హడావిడిగా దిద్దుబాటు చర్య తీసుకుంది. పెంచిన ఎరువుల ధరలను అమల్లోకి తీసుకు రావద్దని ఎరువుల కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ధరలు పెంచొద్దని వాటికి చెప్పింది. రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తూ ఈ ధరల పెరుగుదలను నిలుపుదల చేస్తున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్ శుఖ్ మాండవీయ ప్రకటించారు. డిఎపి, ఎంఒపి, ఎన్‌పికె వంటి యూరియాయేతర ఎరువులన్నింటినీ ఇప్పుడున్న ధరలకే రైతులు కొనుక్కోవచ్చని ఆయన సెలవిచ్చారు. బెంగాల్‌లో ఎన్నికలు ఇంకా ముగియ లేదన్న స్పృహ ఆలస్యంగా కలిగి ఈ అడ్డుచక్రం ప్రయోగించినట్టు వెల్లడవుతున్నది. కాని ముందు ముందు కూడా ఎరువుల ధరల పెరుగుదల ఉండబోదనే హామీని మాత్రం ఇవ్వలేదు. కేవలం రెండు మూడెకరాల అతి చిన్న కమతాలున్న సన్న, చిన్న రైతులు అసంఖ్యాకంగా ఉన్న భారత దేశంలో పాలకులు వ్యవసాయాన్ని దిక్కుదివాణం లేని రంగంగా వదిలిపెట్టిన సంగతి కళ్లముందున్న కఠోర సత్యమే.

ఇందు చేతనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నది వాస్తవం. ఈ స్థితి నుంచి వారిని కాపాడాలంటే ఇతర తయారీ వస్తువుల విషయంలో మాదిరిగానే పంటల ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి కలిగించాలి. పంట మార్కెట్‌లోకి వచ్చే సమయంలో ధర దారుణంగా పడిపోయి సాగు ఖర్చులు కూడా రాని దుస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఇంటిల్లి పాది కలిసి చేసే కఠిన శ్రమకు రేటును కట్టి, భూమి అద్దెను కూడా దానికి చేర్చి ఆ మొత్తానికి దానిలో సగాన్ని జోడించి పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సును ఇంత వరకు అమలు చేయడం లేదు. కోట్లాది మంది రైతు కూలీలను వ్యవసాయ రంగం నుంచి పట్టణ ఆర్థిక కార్యకలాపాల్లోకి తరలించి దేశంలోని పంట పొలాలన్నింటినీ కార్పొరేట్ కంపెనీల పాదాక్రాంతం చేయాలనే ఉద్దేశమే వారిదని స్పష్టపడుతున్నది.

పంటల మద్దతు ధర పెంచకుండా ఎరువులు తదితరాలను మరింత ప్రియం చేసేయడమంటే పశువును ఆకలితో ఎండగట్టి మండుటెండల్లో దున్నించడం వంటి అమానుషమే. యూరియాయేతర ఎరువులపై ధరల నిర్ణయ స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు కట్టబెట్టింది. వాటికిస్తూ వచ్చిన సబ్సిడీలలో కోత పెట్టడమూ ప్రారంభించింది. ఆ విధంగా ధరల పెంపును అనివార్యం చేస్తున్న ది. పెట్రోల్, డీజిల్ మాదిరిగానే ఎరువులను కూడా ప్రభుత్వ అదుపు బొత్తిగా ఉండని అనియంత్రిత ధరల విధానంలోకి తీసుకు వెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వ పాలకుల అంతిమ లక్షమని ఎటువంటి అనుమానానికి ఆస్కారం లేని విధంగా బోధపడుతున్నది. ఆ వైపుగా కదుపుతున్న పావులే ఈ ధరల పెంపు నిర్ణయాలు.

గతంలో ఆరేడు వందల రూపాయల వద్ద ఉండిన 50 కిలోల డిఎపి బ్యాగు ధర ఇప్పుడు రూ. 1200కు చేరుకున్నది. దీనిని 58 శాతం పెంచి రూ. 1900 చేయాలని ఎరువుల కంపెనీలు గురువారం నాడు తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడినా భవిష్యత్తులో బండరాయిలా రైతు నెత్తిన పడక మానదు. మనసుంటే మార్గాలుంటాయన్నట్టు పెట్రోల్, డీజెల్‌ను గాని, ఎరువులను గాని పరిమిత ధరలకు అందుబాటులో ఉంచాలనే సంకల్పం పాలకులకు ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో చవుకగా ఉన్నప్పుడు వాటి ముడి సరకులను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవచ్చుననే అభిప్రాయముంది. కాని అన్ని రంగాల నుంచి ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించి ప్రైవేటు గుత్త కంపెనీలకు వాటి మీద ఎదురులేని స్వేచ్ఛ కల్పించాలని నిర్ణయించుకున్న పాలకులకు అటువంటి హిత వచనాలు తలకెక్కవు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News