Wednesday, May 1, 2024

రెండు నెలల్లో నగర రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు

- Advertisement -
- Advertisement -

Double-decker buses on city roads in two months

డబుల్ డెక్కర్ బస్సులతో నగరానికి మరింత శోభ
మొదటగా 25 బస్సులను నడపాలని యోచన
మంత్రి కెటిఆర్ చొరవతో మళ్లీ రానున్న డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్: కనుమరుగైపోయిన డబుల్ డెక్కర్ బస్సులు ఇకపై సరికొత్తగా హైదరాబాద్ వాసులకు దర్శన మివ్వబో తున్నాయి. రెండు నెలల క్రితం నగర వాసి ఒకరు డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేసుకుంటూ నాటి బస్సు ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ మంత్రి కెటిఆర్‌కు ట్యాగ్ చేశాడు. దీనికి వెను వెంటనే స్పందించిన కెటిఆర్ తనకు డబుల్ డెక్కర్ బస్సులతో ఉన్న అనుభూతులను నెమరువేసుకుంటూ ‘అప్పట్లో డబుల్ డెక్కర్లను ఎందుకు ఉపసంహరించుకున్నారో నాకు తెలియదు, వాటిని మళ్లీ నడిపే అవకాశం ఉందా’ అని ప్రశ్నిస్తూ దానిని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి పువ్వాడ.. వెంటనే ఆర్టీసి ఇంఛార్జి ఎండి సునీల్‌శర్మతో మాట్లాడి ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించారు. ప్రయోగాత్మకంగా ఈ డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని ఆర్టీసి భావిస్తోంది.

25 బస్సులను తొలుత ఏయే రూట్లలో నడపాలన్నదానిపై సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత అనుభూతులు తొలగిపోకుండా కొంగొత్తగా డబుల్ డెక్కర్ బస్సులు రూపుదిద్దుకుంటున్నాయి. రూట్ నెం.229 (సికింద్రాబాద్- మేడ్చల్ వయా సుచిత్ర), రూట్ నెం.219 (సికింద్రాబాద్ పటాన్‌చెరు వయాబాలానగర్ క్రాస్‌రోడ్డు), రూట్ నెం.218 (కోఠి- పటాన్‌చెరు వయా అమీర్‌పేట), రూట్ నెం.9 ఎక్స్ (సిబిఎస్ – జీడిమెట్ల వయా అమీర్‌పేట), రూట్ నెం.118 (అఫ్జల్‌గంజ్- మెహిదీపట్నం)లను ఎంపిక చేశారు. ఇవి కాకుండా ఇంకొన్ని రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు గల అవకాశా లను సైతం ఆర్టీసి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల నిర్మితమై నగరవాసులను ఎంతగానో అలరింపజేస్తున్న దుర్గం చెరువుపై కొత్తగా కేబుల్ బ్రిడ్జి మీదుగా ఓ బస్సును నడిపే విధంగా ఆర్టీసి అధికారులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించే విధంగా టిఎస్ ఆర్టీసి ప్రత్యేక చర్యలు చేపడుతోంది.. పాత స్మృతులు చెరిగిపోకుండా అధునాతనంగా డబుల్ డెక్కర్ బస్సులను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నగరవాసులు మరో రెండు నెలల్లో గత అనుభవాలకు స్ఫూర్తిగా నిలవనున్న డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగరానికి మరో మణిహారంగా దర్శనమిచ్చే ఆస్కారముంది.

18న ప్రత్యేక సమావేశం

మరో రెండు నెలల్లో హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీయనున్నాయి. గతంలో నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డబుల్ డెక్కర్ బస్సులు నష్టాల కారణంతో కనుమరుగయ్యాయి. మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నగరవాసులను కనువిందు చేయబోతున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. ప్రయోగాత్మకంగా 25 బస్సులను నడపాలని టిఎస్‌ఆర్టీసి నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న దానిపై సదరు సమావేశంలో తయారీదారులకు స్పష్టం చేయనుంది. దీంతో రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లు ఎక్కే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News