Saturday, April 27, 2024

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో తాగునీరు, సాగునీరు

- Advertisement -
- Advertisement -
  • -వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు త్రాగు నేటితోపాటు సాగునీరు వస్తాయని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం ఉత్సవాలను జిల్లా కేంద్రంలోని గౌరీకార్ ఫంక్షన్ హాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి స్థానిక శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ సాగునీటి రంగంలో సమూల మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నారు.

కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 85 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా జరుపుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక చెక్ డ్యాములు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన కాలేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్ల సమయంలో పూర్తిచేసుకుని సాగునీరు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ ప్రాజెక్టు విషయాన్ని ప్రపంచ ఛానల్స్ కూడా ప్రసారాలు చేస్తున్నప్పటికీ స్థానిక ఛానళ్లు ప్రాజెక్టు గొప్పతనం చూపించకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు. ఇప్పటికీ తెలంగాణకు చెందాల్సిన కృష్ణ నీటి వాటాను కేంద్ర ప్రభుత్వం తేల్చడం లేదని ఆయన అన్నారు. 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు గొలుసు కట్టు చెరువుల నిర్మించడం జరిగిందని, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు పునర్జీవం పోసి సాగునీరు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరగడానికి నిదర్శనం బోర్లు బావులు, చెరువులు ఎండిపోకుండా ఉండడమేనని ఆయన తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా ఎప్పటికప్పుడు పూడిక తీత పనులు చేపడుతూ ఆ మట్టిని వ్యవసాయ పొలాలకు చేరవేయడం వల్ల పంట దిగుబడి కూడా అధికంగా వస్తుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగంపై పూర్తి అవగాహన ఉన్నందున వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఇది ఆయన కృషికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయిన పిదప జిల్లాలోని భూముల విలువ కూడా పెరుగుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పనులను ప్రజలకు తెలియజేయడానికి సాగునీటి దినోత్సవ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దారూరు మండలం కు సంబంధించిన రైతులు అనంతయ్య, రవి, మర్పల్లి మండలానికి చెందిన రాజిరెడ్డి సాగునీటి రంగంలో సాధించిన విజయాలు, వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్న తీరుపై మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సాగు నీరుకై కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే, శాఖపరమైన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఉత్సవాల సభలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామిరెడ్డి, వికారాబాద్ ఆర్డీవో విజయ్ కుమారి, జిల్లా ఇరిగేషన్ అధికారి హెప్సీనాథ్, డి ఈ లు రవికుమార్, భాస్కర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దా దీప, మున్సిపల్ కౌన్సిలర్లు నరసింహారెడ్డి, గోపాల్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, ఎంపీడీవో సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News