Monday, April 29, 2024

ఆనకట్టలపై అంతులేని నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

ఆనకట్టల నిర్మాణం దగ్గర నుంచి నిర్వహణ వరకు అడుగడుగునా నిర్లక్ష్యం చోటు చేసుకోవడంతో దేశం లోని దాదాపు 3700 ఆనకట్టల్లో పూడిక పేరుకు పోతుండడం తీరని సమస్యగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల గేట్లు మరమ్మతులు కూడా సరిగ్గా జరగని పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల మట్టికట్టలు కొట్టుకుపోతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయింపు సరిగ్గా జరగడం లేదు. ఆనకట్టల నిర్వహణ సరిగ్గా లేక చైనా, అమెరికా దేశాలు గతంలో ఎన్నో విపరీతాలను ఎదుర్కొన్నాయి. వాటిని అనుభవంలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు చేపడుతున్నాయి.

చైనా, అమెరికాల తరువాత మన దేశంలో ఆనకట్టల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఎన్నో లోపాలతో ఆనకట్టలు మునిగి తేలుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న 5334 భారీ ఆనకట్టల్లో వందేళ్లకు మించి వయసు ఉన్నవి 220 వరకు ఉండగా, మరో వెయ్యికి పైగా ప్రాజెక్టులు వందేళ్ల లోపువి. వీటి భవిష్యత్తుపై ఐక్యరాజ్య సమితి పరిశోదన సంస్థ గతం లో హెచ్చరించింది. అయితే ఇందులో కేవలం 398 భారీ ఆనకట్టలకే అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు గతంలో పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది. ఆనకట్టల భద్రతకు జాతీయ జలవిధానం పదేళ్ల క్రితమే రూపొందినా ఎక్కడి గొంగళి అక్కడే అన్న ట్టు ఉంది తప్ప అమలులో శ్రద్ధ కనిపించడం లేదు. దీనికి తోడు ఆనకట్ట మరమ్మతులు, నిర్మాణాల్లో కూడా రాజకీయ బురద చేరుతోంది.

నాయకులకు కాంట్రాక్టులతో పరోక్ష సంబంధాలు ఉండడంతో పనుల్లో నాణ్యత శూన్యమవుతోంది. ఆనకట్టల భద్రతకు సంబంధించి మూడేళ్ల క్రితమే బిల్లుకు ఆమోద ముద్ర వేసినా ప్రయోజనం ఏముంది? వీటన్నిటికీ తోడు ఆనకట్టల్లో గుట్టలుగా పేరుకుపోతున్న పూడిక పెద్ద సమస్యగా తయారైంది. ఈ కారణంగా 2050 నాటికి 3700 ఆనకట్టల మొత్తం నిల్వ సామర్ధం 26 శాతం వరకు తగ్గిపోతాయని ఐక్యరాజ్య సమితి కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. నీటి సంరక్షణ, నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి వంటి వాటికి భవిష్యత్తులో నష్టం కలుగుతుందని ఐక్యరాజ్యసమితి ఈ అధ్యయనం జోస్యం వెల్లడించింది. 2015లో సెంట్రల్ వాటర్ కమిషన్ వివరాల ప్రకారం 50 ఏళ్ల చరిత్ర కలిగిన 141 భారీ రిజర్వాయర్లలో నాలుగో వంతు రిజర్వాయర్లు కనీసం 30 శాతం వరకు నిల్వ సామర్ధాన్ని కోల్పోతాయని వెల్లడైంది. ప్రపంచం మొత్తం మీద దాదాపు 50,000 భారీ ఆనకట్టల్లో ఇప్పటికే అవశేషాలు పేరుకుపోయి 13 నుంచి 19 శాతం వరకు వాటి నిల్వ సామర్థం తగ్గిపోయింది.

యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఆన్ వాటర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్ (యుఎన్‌యు ఐఎన్‌డబ్లుఇహెచ్) ఈ అధ్యయనం చేపట్టింది. నీటి సంరక్షణపై ఐక్యరాజ్యసమితి మేథోనిధిగా ప్రాచుర్యం పొందిన ఈ అధ్యయనంలో 150 దేశాలకు చెందిన 47403 భారీ ఆనకట్టల్లోని ప్రారంభ ప్రపంచ స్థాయి నిల్వ (ఇనీషియల్ గ్లోబల్ స్టోరేజి) 6316 బిలియన్ క్యూబిక్ మీటర్లు 4665 బిలియన్ క్యూబిక్ మీటర్లకు తగ్గిపోనున్నదని అధ్యయనం పేర్కొంది. ఫలితంగా 2050 నాటికి 26 శాతం నిల్వ సామర్ధం తగ్గిపోనున్నది.

ఈ మేరకు 1650 బిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థం తగ్గుదల, భారత్, చైనా, ఇండోనేషియా, ఫ్రాన్స్, కెనడా దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం. ప్రపంచం మొత్తం మీద భారీ డ్యామ్‌లున్న ఆసియా పసిఫిక్ రీజియన్ 2022లో ఆనకట్టల ప్రారంభ నిల్వ సామర్థం 13 శాతం వరకు కోల్పోయినట్టు అంచనా వేసింది.శతాబ్ద మధ్యకాలానికి దాదాపు నాలుగో వంతు అంటే 23 శాతం ప్రారంభ నిల్వ సామర్ధాన్ని కోల్పోతుందని అంచనా. ప్రపంచ మొత్తం జనాభాలో 60 శాతం ఈ రీజియన్‌లోనే ఉన్నారు. సుస్థిర జల, ఆహార భద్రతకు నీటి నిల్వసామర్ధం ఎంతో కీలకం.

2050 నాటికి భారత్ లోని 3700 భారీ ఆనకట్టలు సరాసరిన 26 శాతం వంతున ప్రారంభ నిల్వ సామర్ధాన్ని కోల్పోతాయని ఈ అధ్యయనం వివరించింది. ఈలోగా ప్రపం చం మొత్తం మీద భారీ ఆనకట్టలున్న చైనా దాదాపు 10 శాతం నీటి నిల్వసామర్ధాన్ని కోల్పోతుందని, తరువాత 2050 నాటికి మరో 10 శాతం నీటి నిల్వ సామర్థాన్ని కోల్పోతుందని పేర్కొంది. ఎక్కడైనా అభివృద్ధికి నీటి నిల్వ సామర్థ సదుపాయం కీలకం. భారీ ఆనకట్టలు, రిజర్వాయర్లు జలవిద్యుత్‌ను అందిస్తాయి. వరదలను నివారిస్తాయి. వ్యవసాయానికి నీటి పారుదల అందిస్తాయి.

తాగు నీటిని సమకూరుస్తాయి. అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. ఏళ్ల కొలది అవశేషాలు విపరీతంగా పేరుకుపోవడంతో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థం బాగా తగ్గిపోవడమే కాక, ఆనకట్టల ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాయి. ఏదైనా ఆనకట్ట 15 మీటర్లు లేదా 5 నుంచి 15 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉంటే భారీ ఆనకట్ట అంటారు. ఇలాంటి భారీ ఆనకట్ట 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు నీటిని నిల్వ చేయగలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50,000 ఆనకట్టలు పూడికలు పేరుకుపోయి 2050 నాటికి నాలుగోవంతు నీటి సామర్థాన్ని కోల్పోతాయని ప్రపంచ స్థాయిలో నీటివనరులు, ఇంధన భద్రత క్షీణిస్తుందని ఐక్యరాజ్య సమితి పరిశోధన వెల్లడించింది. 2050 నాటికి ఆనకట్ట నీటి నిల్వసామర్ధం 6 ట్రిలియన్ ఘనపు మీటర్ల నుంచి 4655 ఘనపు మీటర్లకు దిగజారుతుందని ఐక్యరాజ్యసమితి యూనివర్శిటీ వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రాజెక్టు నిల్వసామర్ధాన్ని నిలబెట్టుకోడానికి చర్యలు తక్షణం తీసుకోవాలని సూచించింది. సహజమైన నీటి ప్రవాహానికి ఆటంకం కలిగితే పూడిక వచ్చి చేరుతుంది.

ఇది ఆనకట్టకు చెందిన హైడ్రో ఎలక్ట్రిక్ టర్బైన్లు విపరీత నష్టం కలిగిస్తుంది. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. నదీ ప్రవాహంతో కొట్టుకువచ్చే పూడిక ఎగువ ప్రవాహ ప్రాంతాలకు పరదల వల్ల నష్టం కలిగిస్తుంది. దిగువ ప్రాంతాల వారి నివాసాలను తుడిచిపెట్టి వేస్తుంది. 2050 నాటికి అమెరికా 34 శాతం, బ్రెజిల్ 23 శాతం, భారత్ 26 శాతం, చైనా 20 శాతం వరకు ఆనకట్టల నిల్వ సామర్ధం కోల్పోతాయి. సుదీర్ఘకాల సామాజిక, పర్యావరణ, పరంగా ప్రయోజనాలకు దూరమౌతాయి. ప్రపంచం మొత్తం మీద ఆనకట్టల నిర్మాణం ఈపాటికే చెప్పుకోదగినంతగా తగ్గిపోయిందని, గత శతాబ్దం మధ్యలోని 1000 తో పోలిస్తే ఇప్పుడు సంవత్సరంలో 50 మాత్రమే నిర్మాణమౌతున్నాయని ఐక్యరాజ్యసమితి ఇనిస్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ వ్లాదిమిర్ స్మఖ్తిన్ పేర్కొన్నారు. రిజర్వాయర్లు ఇప్పటికే పూడిక పేరుకుపోయి 13 నుంచి 19 శాతం వరకు నీటి నిల్వసామర్థాన్ని కోల్పోయాయి. పర్యవసానంగా నీటి పారుదలకు, విద్యుత్ ఉత్పత్తికి, నీటి సరఫరాకు సమస్యల సవాళ్లు ఎదురవుతాయని మాంట్రియల్ లోని మెక్ గిల్ యూనివర్శిటీ కి చెందిన శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

కె. యాదగిరి రెడ్డి- 9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News