Wednesday, May 1, 2024

బంగారం కొన్నారు..బండారం బయటపడింది

- Advertisement -
- Advertisement -

ఇఎస్‌ఐ శ్కాంలో కొత్తకోణం
దర్యాప్తు వేగవంతం చేసిన ఇడి

ESI Scam accused arrest in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: ఇఎస్‌ఐ శ్కాంలో నిందితులు దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఇడి విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన ఇడి అధికారులకు నిందితులు దుబాయిలో పెట్టుబడులతో పాటు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలర్స్ షోరూంలో భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిపినట్లు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దేవికా రాణి నగరంలోని ఓ ప్రముఖ బంగారం దుకాణంలో రూ. 4 కోట్ల రూపాయలకు నగలు కొనుగోలు చేసిన విషయం విదితమే. కాగా దేవికారాణితో పాటు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస రెడ్డి కుటుంబంలో మహిళలు, కార్మిక శాఖ పేషీలో కొంతమంది అధికారుల భార్యలు షాపింగ్‌కు వెళ్లినట్లు ఇడి అధికారులు గుర్తించారు. బంగారం కొనేందుకు వచ్చిన మహిళల వివరాలు బయట పడటంలో ఈ కేసులో తెర వెనుక వ్యక్తులను గుర్తించేందుకు ఇడి అధికారులు సమాయత్తమౌతున్నారు.

కాగా ఇఎస్‌ఐ శ్కాంలో ఎసిబి విచారణలో వెలుగుచూడని అంశాలు ఇడి దర్యాప్తులో వెలుగులోకి వస్త్తున్నాయి. 2019లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల విచారణ అనంతరం ఇఎస్‌ఐ స్కామ్ బయటపడ్డాక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 28మందిని ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. కాగా ఎసిబి ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఇడికి లేఖ రాయడంతో తాజాగా కార్మిక శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డితో పాటు నాయిని వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి వ్యవహారం బయటికొచ్చింది.కాగా ఎసిబి విచారణలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద అధికారుల పాత్రపై ఆరా తీసింది. అయితే ఈ శ్కాంలో ఓ ఐఎఎస్ స్థాయి అధికారితో పాటు శ్రీనివాసరెడ్డితోపాటు కార్మిక శాఖ పేషీలోని అధికారుల పాత్రపై ఎసిబి అధికారులు దృష్టిసారించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవికారాణి విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించిన ఎసిబి అధికారులు వెంటనే విదేశీ పెట్టుబడులపై విచారించాలని ఇడికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఎసిబి లేఖతో దర్యాప్తు ప్రారంభించిన ఇడి దుబాయిలో పెట్టుబడులపై ఆరా తీయడంతో కార్మికశాఖమంత్రి పేషీలో అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

దాదాపు రూ. 7వందల కోట్ల రూపాయల స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి పేరు వినిపించినా ఆధారాలు లభించలేదు. దేవికారాణిని విచారించిన ఇడి అధికారులు శ్రీనివాస్ రెడ్డి గురించి కీలక సమాచారాన్ని రాబట్టారు. నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి గతంలో కార్మిక సంఘం నేతగా పనిచేశాడని, ఈ క్రమంలో ఇఎస్‌ఐ శ్కాంలో తనవాటా మొత్తాలను రాబట్టుకున్నాడని గుర్తించారు. దీంతో ముకుందరెడ్డి, శ్రీనివాసరెడ్డిల నివాసాల్లో సోదాలు చేసి దాదాపు రూ. 3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని 10 రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఇడి అధికారులు నోటీసులిచ్చారు.ఇదిలాఉండగా ఈ శ్కాంలో ఎసిబి అధికారులు మూడేళ్ళపాటు ఫార్మా కంపెనీలు, ఇఎస్‌ఐలో ఉద్యోగుల చుట్టూనే విచారణ చేపట్టారు. తాజాగా ఇడి అధికారులు ఈ శ్కాంలో అక్రమార్కులకు కార్మిక శాఖ నుంచి ఎవరెవరు సహకరించారనే కోణంలో పక్కా ఆధారాలు సేకరించింది. ఈ కేసులో త్వరలోనే మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిలో ఉన్నతస్థాయి అధికారులు సైతం ఉన్నారని వారు వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News