Monday, April 29, 2024

ఇక రాజీలేని ఉధృత పోరు

- Advertisement -
- Advertisement -

నేడు చిల్లా రాదారి దిగ్బంధం, రైతు సంఘాల నేతల ప్రకటన, చట్టాల రద్దు తరువాతనే చర్చలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి కొత్త చట్టాలు రద్దు అయ్యేలా చేస్తామని రైతు సంఘాల నేతలు మంగళవారం ప్రకటించారు. తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. బుధవారం ఢిల్లీ నోయిడా మధ్య ఉండే అత్యంత ఆయువుపట్టు వంటి చిల్లా సరిహద్దు మార్గాన్ని దిగ్బంధం చేయాలని ఈ విధంగా సరికొత్త రీతిలో పోరు సల్పాలని తలపెట్టారు. ఇప్పుడు తాము రాజీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్లు సాధించుకునే స్థాయికి ఉద్యమం చేరుకుందని రైతులు తెలిపారు. బుధవారం తాము సంపూర్ణంగా చిల్లా బార్డర్‌ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రైతులు చర్చలకు దూరంగా ఉంటున్నారనే సర్కారు వాదనలో నిజం లేదని, తమ నిజమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవల్సి ఉందని, నిర్థిష్ట ప్రతిపాదనలతో చర్చలకు వస్తే తాము వెళ్లేందుకు సిద్ధమన్నారు. సింఘూ సరిహద్దులలో రైతు సంఘాల నేత జగ్జీత్ సింగ్ డాలేవాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ సర్కారు ఈ చట్టాలను రద్దు చేసేది లేదంటోందని, అయితే తాము వారిని ఈ విధంగా రద్దు చేసేలా చేసి తీరుతామని చెపుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఇక రాజీ ప్రసక్తే లేదనే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ పోరులో చిట్టచివరి విజయం తమదే అవుతుందన్నారు. మరో రైతు నేత యుద్విర్ సింగ్ స్పందిస్తూ దేశ రాజధానిలో తాము మరి ఎంతకాలం అయినా ఉంటామని, నిరసనలను అంతటా విస్తరింపచేసి ఉధృతం చేస్తామని తెలిపారు. ఓ భారీ కుట్రలో భాగంగానే దేశ రాజధానికి రైతులను చేర్చినట్లు ప్రధాని మోడీ మంగళవారం గుజరాత్ సభలలో చేసిన ప్రకటనల నేపథ్యంలోనే రైతులు తమ ఉద్యమ తీవ్రతకు హెచ్చరించారు. ఇక తమ వైఖరి మరింత కఠినంగా ఉంటుందని అన్నారు. పలు నిరసన కార్యక్రమాలు సాగుతాయని, డిమాండ్లు సాధించుకునేంత వరకూ ఇక్కడినుంచి కదిలేది లేదని ప్రకటించిన రైతులు ఈ నెల 20వ తేదీన శ్రద్ధాంజలి దివస్‌ను పాటిస్తారు. ప్రస్తుత రైతు నిరసనల దశలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమం ఉంటుంది. రోజుకో రైతు రాలిపోతున్నాడని, నవంబర్ చివరి వారంలో మొదలైన నిరసనల నాటి నుంచి ఇప్పటివరకూ పలువురు రైతులు అసువులు బాశారని, పలు రైతు కుటుంబాలు ఇక్కట్లకు గురవుతున్నాయని తెలిపారు. ముందు చట్టాలు రద్దు చేయండి తరువాతనే చర్చలకు వస్తామని పరిస్థితిని ఈ విధంగా చేసింది ప్రభుత్వమే అని రైతులు విమర్శించారు.
సరిహద్దుల్లో 60 వేల మంది…
రైతుల ఉద్యమ ఉధృతి హెచ్చరికల నేపథ్యంలో పంజాబ్ హర్యానా సరిహద్దుల వెంబడి మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దులలో 60వేల మంది కి పైగా వచ్చి చేరారని, పరిస్థితి సజావుగా లేదని పోలీసు అధికారులు తెలిపారు. దీనితో పోలీసులను మొహరించినట్లు, అవాంఛనీయ ఘటనలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దులు దాటి ఎవరూ రాకుండా అడ్డుకుంటారు. అనేక చోట్ల ఇందుకు నాకాలను నెలకొల్పారు. నిరసనకారులు ఎక్కువగా రాకుండా చేసేందుకు ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు హర్యానా పోలీసు అధికారులు తెలిపారు.అదే విధంగా ప్రజలు కూడా ఎక్కువగా తిరగకుండా చేసేందుకు ఇటువంటి చర్యలు తప్పవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News