Saturday, April 27, 2024

రైతుల న్యాయమైన డిమాండ్లు

- Advertisement -
- Advertisement -

Farmers' struggle to repeal new Farm laws

 

దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ, భరించలేనంతగా పెరిగిపోయిన పెట్టుబడి భూతం, ప్రభుత్వాల నిరాదరణ ఇవన్నీ కలిసి మన రైతులను అనునిత్యం బాధల కొలిమిలోనే ఉంచుతున్నాయి. తమకున్న పరిమిత భూమిలో సాగుతో ఆహార అవసరాలు తీర్చుకొని, ఇతర జీవనావసరాలను పరిమితం చేసుకొని అదే గొప్పగా భావించి ఒకప్పుడు కడుపులో చల్ల కదలకుండా బతికిన రైతులు వాణిజ్య పంటలు ప్రవేశించి మార్కెట్ లాభాల భ్రమల వెంట పరుగులు పెట్టడం మొదలైన తర్వాత నిరంతరం దగాకు గురవుతున్నారు. అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా పంటకు పాడినో మరేదైనా అదనపు శ్రమనో తోడు చేసుకొని రోజులు నెట్టుకొస్తున్నారు. అటువంటి అధమ స్థితిలోని భారతీయ రైతాంగం ఓర్పును పరీక్షిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చింది.

అవి తమ కాళ్ల కింద నేలను కుంగదీసి మొత్తం దేశ వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ల ఆధీనంలోకి పంపించి వేస్తాయని గ్రహించిన రైతులు ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల అన్నదాతలు అపూర్వ స్థాయి ఉద్యమాన్ని నిర్మించారు. ఈ చట్టాలు తొలుత ఆర్డినెన్స్ రూపంలో విరుచుకుపడినప్పటి నుంచే రాస్తారోకోలు, రైలు రోకోలతో రవాణాను స్తంభింప చేశారు. ఎన్ని చేసినా కేంద్రం చీమ కుట్టిన స్థాయిలోనైనా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో తాడోపేడో తేల్చుకోవాలని ఢిల్లీ ముట్టడికి సమకట్టారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు భార్యాబిడ్డలతో, పిల్లాపాపలతో తరలివచ్చి దేశ రాజధానిని దిగ్బంధనం చేసి ఇప్పటికి 13 రోజులుగా ఎముకలు కొరికే చలిలో ఆందోళన సాగిస్తున్నారు. ఆ సెగ తగిలిన కేంద్రం ప్రభుత్వం వారి ప్రతినిధులను చర్చలకు పిలిచింది. ఐదు విడతలుగా చర్చలు జరిగినా కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌పై ఎటూ తేల్చకుండా వల్లమాలిన తాత్సార వ్యూహాన్ని కేంద్రం అవలంబిస్తున్నది.

పై పెచ్చు ఉద్యమంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులున్నారనే అపవాదును కూడా బిజెపి వర్గాలు ప్రచారం పెట్టాయి. రైతులు విసిగిపోయి చేతులెత్తేస్తారన్న దాని భ్రమలు పటాపంచలై వారు మరింతగా సంఘటితమయ్యారు. కేంద్రం వైఖరికి నిరసనగా నేడు (డిసెంబర్ 8) భారత్ బంద్‌కు రైతులు పిలుపు ఇచ్చారు. రేపు జరిగే మరో విడత చర్చల్లో కేంద్రం దిగి వచ్చేలా దానిపై ఒత్తిడి తెచ్చేందుకు బంద్‌ను ప్రశాంతంగా, విజయవంతంగా జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ బంద్‌కు రైతు పక్షపాతి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ పార్టీ సహా కాంగ్రెస్, ఎన్‌సిపి, ఎస్‌పి, బిఎస్‌పి, ఆర్‌జెడి మున్నగు 20 రాజకీయ పార్టీలు, ప్రధానమైన కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు, రవాణా కార్మిక సంఘాలు మద్దతును ప్రకటించాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని మోడీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు, విద్యుత్తు బిల్లుతో దేశమంతటా గల ప్రతిపక్షాలను, తన పాలనను వ్యతిరేకిస్తున్న సర్వశక్తులను ఒక్క త్రాటిమీదకు తీసుకు వచ్చింది. రైతుల ఆందోళనను ఆధారం చేసుకొని వారంతా ఒకే దారంలో దండగా ఏకం కావడానికి అవకాశం కల్పించింది.

కేంద్రం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు, దాని విద్యుత్తు బిల్లు దేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీల అదుపులో పెట్టడానికి ఉద్దేశించినవే. వ్యవసాయ, విద్యుత్తు రంగాలపై రాష్ట్రాలకు అణుమాత్రమైనా అధికారం లేకుండా చేసి మొత్తం ప్రైవేటు రంగం నిరంకుశాధిపత్యంలోకి వాటిని పంపించడానికి తీసుకు వచినవే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ అందరి కంటే ముందే తెలుసుకొని వాటి పట్ల స్పష్టమైన వ్యతిరేకతను తెలియజేశారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు బిల్లు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమైనదని గత మే నెలలోనే ఆయన చెప్పారు. అది రాష్ట్రాల హక్కులను హరిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో టిఆర్‌ఎస్ వ్యతిరేకించింది.

రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని వ్యవసాయ మార్కెట్‌లలో కనీస మద్దతు ధరకు పంటలను అమ్ముకునే అవకాశాన్ని, అలాగే కేంద్రం వాటిని సేకరిస్తూ వస్తున్న ప్రస్తుత విధానాన్ని పూర్తిగా తొలగిస్తూ కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు రైతులను బలి చేసి, నిత్యావసర సరకుల దొంగ నిల్వలను ప్రోత్సహించి ఆహార సంక్షోభానికి దారి తీసే చట్టాలను ఉపసంహరించుకుంటేగాని విద్యుత్తు బిల్లును కూడా బుట్టదాఖలా చేస్తేగాని ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని విరమించుకునేది లేదని రైతాంగం వెలిబుచ్చిన దృఢ అభిప్రాయం అత్యంత న్యాయమైనది. అందుచేత కేంద్రం దిగి వచ్చేలా నేటి భారత్ బంద్ విజయవంతం కావాలని కోరుకుందాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News