Tuesday, April 30, 2024

సవరణలు వద్దు చట్టాలే రద్దు కావాలి

- Advertisement -
- Advertisement -

Farmers Union demand for ban to agricultural laws

 

భీష్మించుకున్న రైతులు, ఉద్యమ ఉధృతికి కార్యాచరణ ప్రకటన
1న ఢిల్లీ, జైపూర్ రహదారి దిగ్బంధం, టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు
14న దేశవ్యాప్త ఆందోళన, నిరసనలు, బిజెపి నేతల ఘెరావ్
ఢిల్లీకి తరలి రావాలని అన్ని రాష్ట్రాల రైతులకు పిలుపు

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం, రైతుల నడుమ నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఆ మూడు నూతన చట్టాల రద్దు ప్రతిపాదన తప్ప ఎలాంటి సవరణలకు ఒప్పుకోబోమని రైతు సంఘాలు కేంద్రానికి తెగేసి చెప్పాయి. తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నట్లు ప్రకటించాయి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర సహా ఇతర అంశాలపై వ్యవసాయ చట్టాల్లో పలు సవరణలు పేర్కొంటూ రైతు సంఘాలకు లిఖితపూర్వక ముసాయిదా ప్రతిపాదనలు పంపింది. వాటిపై సుదీర్ఘంగా చర్చించిన రైతు సంఘాలు వ్యవసాయ చట్టాల రద్దు ప్రతిపాదనకే ఒప్పుకుంటాం తప్ప ఎలాంటి మార్పులు, చేర్పులకు అంగీకరించబోమని స్పష్టం చేశాయి. 12న ఢిల్లీజైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించాయి. డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతామని వెల్లడించాయయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడంతో పాటు బిజెపి నేతలను ఘెరావ్ చేస్తామని ప్రకటించారు. తమ పోరాటంతో ఇతర ప్రాంతాల రైతులు కూడా కలిసి రావాలని, అన్ని రాష్ట్రాల రైతులు 14న ఢిల్లీ తరలిరావాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కొత్తదనమేదీ లేదు. వాటన్నింటిని తిరస్కరిస్తున్నాం. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు మేం ఢిల్లీకి వచ్చే అన్ని రహదారులను దిగ్బంధిస్తాం ’ అని రైతు నాయకుడు శివకుమార్ కక్కా వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఆరు దఫాలుగా జరిపిన చర్చల్లో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏం చర్చించారో అవే ప్రతిపాదనలను హోంమంత్రి అమిత్ షా తాజాగా పంపించారని మరో నేత దర్శన్ పాల్ అన్నారు. మంగళవాంనాడు భారత్ బంద్ విజయవంతం తర్వాత రాత్రి రైతు సంఘాల నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలకు పిలిచిన విషయం తెలిసిందే. రైతులకు వ్యవసాయ చట్టాలపై ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి ఈ సందర్భంగా అమిత్ షా వారికి హామీనిచ్చారు. అయితే, చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బుధవారంనాడు చట్టాలకు ముసాయిదా ప్రతిపాదనలు పంపనున్నామని, వాటిపై చర్చించి ఓ నిర్ణయానికి రావాలని వారికి సూచించారు. అన్నట్టుగానే 13 రైతు సంఘాలకు బుధవాంరనాడు పలు ప్రతిపాదనలు రాతపూర్వకంగా పంపించారు. వాటిపై చర్చించిన రైతులు వాటిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు ఉన్న అభ్యంతరాలను మంచి మనసుతో పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ వివేక్ అగర్వాల్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ఇకనైనా అంగీకరించాలని రైతు సంఘాలను ఆయన కోరారు. నూతన చట్టాల వల్ల మండీలు బలహీనం అవుతాయని రైతులు ఆందోళన పడుతున్నారని, అలాంటిదేమీ ఉండబోదని ఆయన వివరించారు. రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్ధతు ధర హామీకి ఢోకా ఉండదని కేంద్ర చెబుతోంది. దానిని తాజా ప్రతిపాదనల్లో కూడా చేర్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. తాజా చట్టాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లబోదని చెబుతున్నారు.

రైతులకు కేంద్రం పంపిన లిఖితపూర్వక ప్రతిపాదనలు ఇవే…

1. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా చట్టానికి సవరణ.
2. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఎపిఎంసి)లపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ. అంతేకాకుండా ఎపిఎంసిల్లో ఒకే తరహా పన్నుకు సానుకూలం.
3. ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి. ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట ఉత్పత్తులను సేకరణ చేసేలా నిబంధనలకు సవరణ.
4. వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్‌డిఎంల అధికారాల సవరణకు సుముఖత. ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా మార్పులు.
5. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూముల రక్షణకు హామీ కల్పిస్తాం.
6. కనీస మద్దతు ధరపై రాతపూర్వక హమీ.
7. పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్‌హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం.
8. విద్యుత్ బిల్లుల చెల్లింపు విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదు.

Farmers Union demand for ban to agricultural laws

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News