Monday, April 29, 2024

రైతు ఉద్యమాన్ని కించపరచవద్దు

- Advertisement -
- Advertisement -

రైతు ఉద్యమాన్ని కించపరచవద్దు
సమాంతర చర్చలు ఆపేయండి
కేంద్రానికి రైతు సంఘాల లేఖ

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు ఈ వివాదాస్పద చట్టాలపై ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలు జరపవద్దని కేంద్రాన్ని కోరాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు ప్రతినిధి బృందాలతో కేంద్రం గత కొన్ని రోజులుగా వరసగా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుపుతున్న 40 రైతు సంఘాల సంయుక్త వేదిక అయిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ బుధవారం ఈ లేఖ రాసింది. ఈ మోర్చాలో ఎక్కువ భాగం పంజాబ్‌కు చెందిన రైతు సంఘాలే ఉన్నాయి. రైతుల ఆందోళనను కించపరచడాన్ని మానుకోవాలని, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలు జరపడాన్ని ఆపేయాలని మేము కేంద్రాన్ని కోరుతున్నాం’ అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు హిందీలో రాసిన లేఖలో మోర్చా సభ్యుడు దర్శన్‌పాల్ పేర్కొన్నారు. అంతే కాకుండా కొత్త చట్టాలకు సవరణలు చేస్తామంటూ కేంద్రం ఇటీవల చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలన్న రైతు సంఘాల నిర్ణయాన్ని కూడా పాల్ తన లేఖలో లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

‘డిసెంబర్ 9 నాటి ఆ ప్రతిపాదన, అలాగే మీరు రాసిన లేఖకు సంబంధించి అదే రోజు జరిగిన రైతు సంఘాల సంయుక్త సమావేశంలో ఆ ప్రతిపాదనను చర్చించి తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వంతో గతంలో జరిపిన చర్చల్లో తాము తమ వైఖరిని స్పష్టం చేశామని, అందువల్లనే ఇంతకు ముందు తాము లిఖిత పూర్వక సమాధానాన్ని పంపలేదని పాల్ తన లేఖలో తెలియజేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధులు మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తెమార్‌ను కలిసి నూతన వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధర అంశాలపై కొన్ని సూచనలతో మంత్రికి ఒక వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా యుపిలో జిల్లా స్థాయిలలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఆందోళనలను విరమించాలని కూడా యూనియన్ నిర్ణయించింది. అయితే దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న 40 రైతు సంఘాల ఐక్య వేదికలో ఈ యూనియన్ లేదు. కొత్త చట్టాలకు మద్దతు తెలియజేసినందుకు కేంద్ర మంత్రి తోమార్ ఒక ప్రకటనలో బికెయుకు కృతజ్ఞతలు తెలియజేశారు కూడా.
ఢిల్లీ-నోయిడా రహదారి దిగ్బంధం
మరో వైపు చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు బుధవారం ఢిల్లీ నోయిడాను కలిపే చిల్లా సరిహద్దును దిగ్బంధం చేశారు. దీంతో అధికారులు ఆ మార్గాన్ని వాహనాల రాకపోకలకు నిలిపి వేశారు. అంతేకాకుండా చిల్లా సరిహద్దు వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఢిల్లీనుంచి నోయిడాకు వెళ్లే మార్గంలో వాహనాలను అనుమతిస్తుండగా, నోయిడానుంచి ఢిల్లీ వచ్చే మార్గంలో మాత్రం వాహనాల రాకపోకలను నిలిపి వేసి బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసు అధికారులు చెప్పారు. చిల్లా సరిహద్దుల్లో పరిస్థితి దృష్టా ట్రాఫిక్‌ను దళిత్ ప్రేమ్‌స్థల్‌నుంచి ఢిల్లీనోయిడా డైరెక్ట్ ఫ్లై ఓవర్‌కు మళ్లించినట్లు ఒక అధికారి తెలిపారు.

Farmers Union writes Centre on holding parallel talks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News