Saturday, April 27, 2024

రైతులకు ఎఫ్‌సిఐ షరతులు

- Advertisement -
- Advertisement -

FCI conditions for Farmers

 

నాలుగు మాసాలకు పైబడిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) ఉత్తర్వుల రూపంలో కొత్త సమస్య దాపురించింది. రైతుల వద్ద కొనుగోలు చేసే పంట డబ్బును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయదలచామని ఎఫ్‌సిఐ వారికి తెలియజేసింది. అలాగే పంటను అమ్ముకోదలిచే కౌలు రైతులు భూ యజమానితో కుదుర్చుకున్న సాగు ఒప్పందాన్ని చూపాలని మరో ఉత్తర్వు ద్వారా ఎఫ్‌సిఐ కొత్త నియమాన్ని తీసుకు వచ్చింది. రైతు ఉద్యమ సారథి సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన సంఘాలన్నీ ఈ ఉత్తర్వులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హర్యానాల్లో, ఇతర మరి కొన్ని రాష్ట్రాల్లో ఎఫ్‌సిఐ కార్యాలయాల వద్ద సోమవారం నాడు ఎఫ్‌సిఐ రక్షణ దినం పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నేరుగా బ్యాంకు అకౌంట్లలో డబ్బు వేయడం అనేది మండీల వ్యవస్థలో కమీషన్ ఏజెంట్ల ప్రాబల్యాన్ని తొలగించడానికి ఉద్దేశించిందని స్పష్టపడుతున్నది. అలాగే కౌలు రైతులు సాగు ఒప్పందాన్ని సంపాదించి ఎఫ్‌సిఐకి సమర్పించడమనేది కలలోనైనా జరిగే పని కాదు.

తన భూమిని పలానా వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్టు రాత పూర్వకంగా అంగీకరించడానికి రైతులెవరూ ముందుకు రారు. అటువంటి ఒప్పంద పత్రం లేని కౌలు రైతులు ఎఫ్‌సిఐకి పంటను అమ్ముకునే అర్హతను కోల్పోయి బయట ఉండే చిన్న, చితక దళారీలకు ఎంతో కొంతకు తెగనమ్ముకోక తప్పని దుస్థితిలో పడతారు. అందుచేత ఈ రెండు ఉత్తర్వులను రైతులు వ్యతిరేకించడంలో సహేతుకత స్పష్టంగా కనిపిస్తున్నది. వరి, గోధుమ విశేషంగా పండే పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల పేరిట రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో మండీల వ్యవస్థ అత్యంత బలంగా వేళ్లూనుకున్నది. ఈ మొత్తం వ్యవస్థ అనే బండికి అర్హతీయాలు (కమీషన్ ఏజెంట్లు) ఇరుసుల్లాంటి వారు. మండీల్లో రైతుల పంట విక్రయాలు పూర్తిగా వీరి చేతుల మీదుగానే జరుగుతాయి. ఎఫ్‌సిఐ గాని, ఇతర పెద్ద వ్యాపారులు గాని మండీలలో ధాన్యం కొనుగోలును అర్హతీయాల ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను పంట విలువలో 9.5 శాతాన్ని రైతులు మార్కెట్ చార్జీల కింద చెల్లించవలసి ఉంటుంది.

ఇందులో 3 శాతం మౌలిక సదుపాయాల సెస్ కింద, 2 శాతం మార్కెట్ ఫీ నిమిత్తం, 2 శాతం గ్రామీణాభివృద్ధి నిధికి, 2.5 శాతం అర్హతీయాల కమీషన్‌కు పోతుంది. ఈ చార్జీల చెల్లింపు అవసరం లేకుండా మండీల బయట అమ్ముకునే అవకాశం కల్పించడానికే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చానంటూ వాటిని ఎంత మాత్రం రద్దు చేయబోనని చెబుతున్న కేంద్రం ఆ వైఖరిని మరింత బలోపేతం చేయడం కోసమే ఎఫ్‌సిఐ ఉత్తర్వులను ప్రవేశపెట్టిందని బోధపడుతున్నది. అయితే మండీలు, అర్హతీయాల వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోతే కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వారు ఎంత విదిలిస్తే అంత తీసుకోక తప్పని దుస్థితిలో కూరుకుపోతామని రైతులు భయపడుతున్నారు. తాజా ఎఫ్‌సిఐ ఉత్తర్వులు కూడా కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని స్థాపించడం కోసమే ఊడిపడ్డాయని అంతిమంగా ఎఫ్‌సిఐని కూడా రద్దు చేసి దేశంలో అమల్లో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థకు తల కొరివి పెట్టి ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్దేశిస్తున్న కంటి తుడుపు నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం పన్నాగమని రైతు ఉద్యమకారులు భావిస్తున్నారు. అన్నింటికీ మించి కమీషన్ ఏజెంట్లు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతుల తలలో నాలుకల్లా ఉంటున్నారన్న వాస్తవాన్ని అంగీకరించి తీరాలి.

రైతుకు సాగు అవసరాలతోపాటు ఏ వేళ ఏ అవాంతరం మీద పడినా అప్పు ఇచ్చి అర్హతీయాలు ఉపయోగపడుతున్నారు. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ తీసుకున్నప్పటికీ అవసరానికి ఉపయోగపడి పరువు కాపాడుతున్నారనే విశ్వాసం వారి మీద రైతులకు అపారంగా ఉంది. పంజాబ్‌లో 1858 మండీల్లో 23,600 మంది అర్హతీయాలున్నారు. అలాగే హర్యానాలో 400 మండీల్లో 22,000 మంది కమీషన్ ఏజెంట్లు పని చేస్తున్నారు. రైతులు పంటను మండీల్లోని అర్హతీయాల కార్యాలయాల వద్దకే నేరుగా తీసుకు వెళతారు. అక్కడ పంటలోని తాలు, తప్ప తొలగించి తూకమేసి సంచులకెత్తి బహిరంగ వేలం ద్వారా అమ్మే పనిని వారే చేస్తారు. ఈ వ్యవస్థను నిర్మూలించడమంటే తమ కాళ్లకింద గొయ్యి తవ్వడమేనని రైతులు భావిస్తున్నారు. మొత్తం దేశంలోనే చిన్న, సన్నకారు, మధ్య తరహా రైతులు, కింది మధ్య తరగతి, కార్మిక కుటుంబాలు ప్రైవేటు రుణ దాతల మీద విశేషంగా ఆధారపడి ఉన్నారు. దీనిని గమనించి కింది స్థాయి వరకు ప్రజల తక్షణ నగదు అవసరాలను తీర్చగలిగే జనతా బ్యాంకింగ్ వ్యవస్థను పకడ్బందీగా నడపగలిగినప్పుడే దళారీలను తొలగించడం సాధ్యమవుతుంది. కొండ నాలుకకు వేసే మందు ఉన్న నాలుకను ఊడగొట్టేలా చేసే కార్పొరేట్ పరిష్కారాలతో పాలకులు ప్రజలకు చేయగలిగేది చెప్పనలవికానంత అపకారమేగాని, ఉపకారం కాబోదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News