Friday, May 3, 2024

మధ్యంతర బడ్జెట్‌తో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ వైపు ఆర్థిక వివేకాన్ని ప్రదర్శిస్తూనే మరో వైపు పెద్ద సంఖ్యలో ఓటర్లున్న వ్యవసాయం, మధ్య తరగతి, పేద వర్గాలను ఆకట్టుకునేలా కేంద్ర బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేసింది. పర్యాటకం, హౌసింగ్ రంగాల అభివృద్ధికి కేటాయింపులు జరిపినా కొన్ని వర్గాలకు మాత్రం నిరాశే మిగిలింది. మరి ఈ తాత్కాలిక పద్దుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమో ఓ సారి చూద్దాం.

ప్రయోజనం పొందే రంగాలు

ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికిఅధిక ప్రాధాన్యం లభించింది. సాగులో ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులు పెంచే దిశగా, నూనె గింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే లా ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది. దీంతో పాటుగా పాడి రైతుల అభివృద్ధి, మత్ససంపద పెంచేందుకు పథకాలను తీసుకు రానుంది.
బస్తీలు, అద్దె ఇళ్లలో నివసించే పేదలు, మధ్య తరగతి ప్రజలు తమ సొంతిటి కలను సాకారం చేసుకునే దిశగా ‘ హౌసింగ్ స్కీమ్’ను తీసుకురానున్నారు. అలాగే సామాన్యులపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ‘రూఫ్‌టాప్ సోలారైజేషన్’ను అమలు చేయనున్నారు.

 

బడ్జెట్‌లో పర్యాటక రంగానికి కేంద్రం పెద్ద పీట వేసింది. పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో మార్కెట్ కల్పించేలా రాష్ట్రాలను ప్రోత్సహించనుంది. దీనికోసం దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలను ఇవ్వనుంది.

పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా పవన విద్యుత్ ఉత్పత్తికోసం నిధులను పెంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2070 నాటికి విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో పూర్తిస్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణను సాధించేందుకు వీలుగా పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం ఎలా నిధులను కేటాయిసుతందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది.

ఈ రంగాలకు నిరాశే

* మౌలిక వసతుల రంగానికి 11.11 శాతం వృద్ధితో రూ.11.1లక్షల కోట్లను కేటాయించారు. అయితే ఈ రంగంలో ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు ఈ రంగానికి పెట్టుబడులను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

* దేశంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని మరింతగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇందుకు అవసరమైన 1.2 బిలియన్ డాలర్ల సబ్సిడీ ప్రోగ్రామ్ ఈ ఏడాది మార్చితో ముగుస్తుంది. దీని పొడింపుపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా చేయలేదు.

* బంగారం దిగుమతులపై ప్రభుత్వం ప్రస్తుతం 15 శాతం సుంకం విధిస్తోంది. దీనివల్ల దేశంలోకి పసిడి అక్రమ రవాణా పెరిగిందని.. సుంకాన్ని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. అయితే ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలలోనే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఆయా షేర్లు నష్టపోయాయి కూడా.

* మధ్యంతర బడ్జెట్‌లో వేతన జీవులకు ఎలాంటి ఊరట లభించలేదు. ఎన్నికల నేపథ్యంలో పన్నుల విధానంలో మార్పుల జోలికి ప్రభుత్వం వెళ్ల లేదు.అయితే ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి ఉపశమనం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News