Saturday, April 27, 2024

సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire breaks out at Serum Institute building in Pune

మంటల్లో ఐదుగురి మృతి
9 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఆటంకం లేదు
సీరమ్ సిఇఓ ఆదర్ పూనావాలా ప్రకటన

పుణె: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్లాంట్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో తొమ్మిది మందిని సురక్షితంగా భవనం నుంచి కాపాడారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్న ఇక్కడి మంజరి ప్రాంతంలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలోని నూతన భవనంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ అగ్నిప్రమాదం వల్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎటువంటి అవరోధం లేదని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ ఆదర్ పూనావాలా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మంజరిలోని సీరమ్ కాంప్లెక్స్‌లో తయారుచేస్తున్నారు. కోవిషీల్డ్ ఉత్పిత్త చేస్తున్న భవనానికి అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం ఒక కిలోమీటరు దూరంలో ఉందని వర్గాలు తెలిపాయి.

ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం కోసం తాము అనేక భవనాలను ముందుగానే కోవిషీల్డ్ ఉత్పత్తి కోసం కేటాయించామని, కోవిషీల్డ్ ఉత్పత్తికి ఎటువంటి నష్టం లేదని తాను ప్రభుత్వాలకు, ప్రజలకు భరోసా ఇస్తున్నానని పూనావాలా ట్వీట్ చేశారు. కొన్ని దురదృష్టకర వార్తలు ఇప్పుడే అందుతున్నాయని, ఈ సంఘటనలో కొంత ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. జరిగిన విషాద సంఘటనకు తాము బాధపడుతున్నామని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా..మంటల్లో మరణించిన ఐదుగురు వ్యక్తులు నిర్మాణంలో ఉన్న భవనంలోని కింది అంతస్తులు పనిచేస్తున్నట్లు తెలుస్తోందని, వారి మృతదేహాలను అగ్నిమాపక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పుణె నగర మేయర్ మురళీధర్ మహోల్ తలెఇపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.

సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లోని సెజ్3కి చెందిన భవనంలోని నాలుగవ, ఐదవ అంతస్తుల్లో మధ్యాహ్నం 2.45 గంటలకు చెలరేగిన మంటలను రెండు గంటల్లోపల అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న తొమ్మిది మంది వ్యక్తులను కాపాడి అక్కడ నుంచి తరలించినట్లు డిసిపి నమ్రతా పాటిల్ తెలిపారు. ప్రమాదం జరిగిన అంతస్తులలో మంటలను చల్లార్చే ప్రక్రియను చేపట్టినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రశాంత్ రాన్‌పీసే చెప్పారు. 15 వాటర్ ట్యాంకర్లతో మంటలను సాయంత్రం 4.30 గంటల కల్లా అదుపులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని, ఈ ప్రమాదంలో ఫర్నీచర్, వైరింగ్, క్యాబిన్లు దగ్ధమయ్యాయని ఆయన చెప్పారు. మంటలు చెలరేగిన అంతస్తులలో ప్రధాన యంత్రాలు గాని పరికరాలు ఏవీ భద్రపరచలేదని ఆయన చెప్పారు. కాగా..ప్రాథమిక సమాచారం మేరకు విద్యుత్ లోపాల వల్లే మంటలు చెలరేగినట్లు అర్థమవుతోందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విలేకరులకు తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పిత్తి అవుతున్న యూనిట్‌లో మంటలు చెలరేగలేదని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోందని, ఆ యూనిట్‌లో బిసిజి వ్యాక్సిన్ తయారు అవుతున్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News