Saturday, May 4, 2024

రోదసీ లోకి నలుగురితో వెళ్లిన తొలి ట్యాక్సీ

- Advertisement -
- Advertisement -

first Taxi to take four people into Space

 

తొలి వాణిజ్య అంతరిక్షయానం ప్రారంభం

కేప్ కెనెవరల్ (అమెరికా) : రోదసీ యాన చరిత్రలో తొలి వాణిజ్య అంతరిక్షయానం ప్రారంభమైంది. ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్‌తో ‘నాసా’ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ వాహక నౌక క్రూ డ్రాగన్ అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7.27 గంటల ప్రాంతంలో నింగి లోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడా లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన తొమ్మిది నిముషాల తరువాత కక్ష లోకి చేరింది. అనేక సవాళ్లలో ముఖ్యంగా కొవిడ్ 19 విస్తరించిన నేపథ్యంలో ఈ ప్రయోగం నిర్వహించడం అత్యంత సాహసం. స్పేస్ ఎక్స్ సంస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ దూరం నుంచే ఈ ప్రయోగాన్ని సమీక్షించారు. ఓ మోస్తరు కొవిడ్ లక్షణాలతో తాను ఉన్నట్టు ఆయన ట్వీట్ చేశారు. కాలిఫోర్నియా లోని హాథోమ్ వద్దనున్న స్పేస్‌ఎక్స్ మిషన్ కంట్రోల్ ఈ రాకెట్ కక్ష లోకి చేరుకోగానే అభినందనలు తెలియచేసింది. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) చేరుకోనున్నది.

బయలుదేరిన నలుగురు వ్యోమగాములలో ముగ్గురు అమెరికాకు చెందిన మైఖేల్ హాప్‌కిన్స్, విక్టర్ గ్లోవర్, శాన్నన్ వాకర్, కాగా, జపాన్‌కు చెందిన సోయిచి నోగుచి అనే అత్యంత అనుభవజ్ఞుడైన వ్యోమగామి కూడా బయలుదేరడం విశేషం. ఇప్పటికే అక్కడ అమెరికాకు చెందిన కేట్ రూబిన్స్, రష్యాకు చెందిన సెర్గీ రిజికోవ్, సెర్గీ కుడ్‌స్వేర్చ్‌కోవ్ ఉన్నారు. తాజాగా వెళ్లిన వారు అక్కడ మొత్తం నాలుగుసార్లు స్పేస్ వాక్ చేయాల్సి ఉంది. నేడు జరిగిన ఈ ప్రయోగం ఒకరకంగా అంతరిక్షం లోకి ట్యాక్సీ సర్వీస్‌లు ప్రారంభమైనట్టే అని చెప్పవచ్చు. 2011 తర్వాత అమెరికా తమ స్వంత వ్యోమనౌకలను ఉపయోగించడం దాదాపు నిలిపివేసింది. అప్పటి నుంచి రష్యాకు చెందిన సోయుజ్‌లో తమ వ్యోమగాముల్ని ఐఎస్‌ఎస్‌కు పంపుతోంది. దీనికి పెద్దమొత్తంలో చెల్లించ వలసి వస్తోంది. రష్యా సోయుజ్ నౌక సీట్లకు ఇక నాసా ఖర్చు చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఆఖరుగా ఈ సోయుజ్ నౌకకు 90 మిలియన్ డాలర్లు నాసా ఖర్చు పెట్టింది.

స్పేస్ ఎక్స్ మొదటి క్రూ కమాండర్ డౌగ్ హర్లీ ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రయోగం వల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా క్రూకు శిక్షణ ఇచ్చే భారం సులువవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఫాల్కన్ రాకెట్‌లో ఉపయోగించిన తొలిదశ బూస్టర్‌ను మరోసారి వినియోగించుకునేలా నిర్మించారు. అంతరిక్ష యాన చరిత్రలో ఈ ప్రయోగంతో కొత్తశకం ప్రారంభమైందని నాసా ప్రకటించింది. ఇకనుంచి భూ కక్ష లోకి తరచూ జరిగే అంతరిక్ష యానాలకు ఓ ప్రైవేట్ సంస్థ సేవలను అందిస్తుందని పేర్కొంది. యుకెకు చెందిన ఎండీయే రూపొందించిన కోకా కమ్యూనికేషన్స్ టెర్మినల్‌ను ఐఎస్‌ఎస్ లోని ఐరోపా స్పేస్ మాడ్యూల్ కొలంబస్‌కు అమర్చనున్నారు.

దీని ద్వారా అక్కడ ఉన్న వ్యోమగాములు భూమిపై ఉండే బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌తో ఇక్కడి శాస్త్రవేత్తలు, కుటుంబ సభ్యులతో మాట్లాడే వీలు కలుగుతుంది. ఈ ప్రయోగం శాస్త్రవిజ్ఞానానికి ఉన్న శక్తికి నిదర్శనమని, అలాగే మన వినూత్నత, చతురత ద్వారా ఏదైనా సాధించగలమనడానికి ఉదాహరణగా అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికైన బైడెన్ తన స్పందన తెలియచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైకె పెన్సె ఆయన సతీమణితో కలసి ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అధ్యక్షుడు ట్రంప్, నాసా, స్పేస్‌ఎక్స్ కృషిని అభినందించారు. ఈ క్రూ డ్రాగన్‌ను మే లో తొలిసారి ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లి రెండు నెలల తరువాత ఆగస్టులో క్షేమంగా తిరిగి రావడంతో స్పేస్ ఎక్స్ పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగాలకు నాసా అనుమతించింది. అందువల్ల ఇది తొలి అంతరిక్ష యానంగా చరిత్రకెక్కింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News