Saturday, May 4, 2024

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

Four Lashkar-e-Taiba militants killed

 

నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం
షోపియాన్ జిల్లాలో మరో కలకలం
ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలను ఐజిపి విజయ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. మనిహల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే కీలక ఇంటలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని దిగ్బంధం, సోదాలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ జరిగిందని ఐజి తెలిపారు. లొంగిపోవాలని పదేపదే కోరినప్పటికీ మిలిటెంట్లు పెడచెవిని పెట్టారు. భద్రతా బలగాలపై ముందు కాల్పులకు దిగారు. సరెండర్ కావాలని చివరికి ఉగ్రవాదుల కుటుంబాలను, చివరికి వారిలో ఒకరి భార్యను, నాలుగేళ్ల బాబును కూడా ముందుకు తీసుకువచ్చామని, అయితే వారు వినలేదని తెలిపారు. తరువాతి క్రమంలో చాలా సేపటివరకూ పరస్పర కాల్పులు జరిగాయని, తరువాత అక్కడ జరిపిన తనిఖీలలో నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించామని వివరించారు.

ఈ నలుగురు లష్కరేకు చెందిన వారుగా గుర్తించారు. తమను తాము లష్కర్ ఎ ముస్తఫాకు చెందిన వారిమిగా తెలియచేసుకున్నారని తెలిపారు. లష్కరేకు చెందిన ప్రతిఘటన దళం (టిఆర్‌ఎఫ్) లష్కరే ముస్తఫాగా చలామణిలో ఉందని రికార్డుల ద్వారా వెల్లడయిందని వివరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మూడు పిస్టల్స్, ఒక ఎకె రైఫిల్ దొరికింది. గత ఏడాది అక్టోబర్ నుంచి చురుకుగా వ్యవహరిస్తున్న ఈ ఉగ్రవాదుల పేర్లు, వారి సమాచారాన్ని గుర్తించినట్లు పోలీసు అధికార తెలిపారు.

వీరు అమీర్ షఫీ మీర్, రకీబ్ అహ్మద్ మాలిక్, అఫ్తబ్ అహ్మద్ వనీగా గుర్తించారు. నాలుగో వ్యక్తి సమాచారం రాబడుతున్నారు. ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ జవాను ఒకరు గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ తొమ్మిది ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో అత్యధికంగా ఎనిమిది దక్షిణ కశ్మీర్‌లో జరిగాయి. ఒకటి ఉత్తర కశ్మీర్‌లో చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్లలో మొత్తం 19 మంది ఉగ్రవాదులు హతులయ్యారని ఐజి తెలిపారు. వీరిలో తొమ్మండుగురు ఉగ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షోపియాన్ జిల్లాకు చెందిన వారే. ఇప్పటి ఎన్‌కౌంటర్ కూడా ఈ జిల్లాలోనే జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News