Friday, April 26, 2024

588 స్టేషన్‌లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు

- Advertisement -
- Advertisement -
Free high speed WiFi services at 588 railway stations
అన్ని రైల్వే స్టేషన్‌లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్‌లలో హైస్పీడ్ వైఫై సేవలు
నవంబర్‌లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు

హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను కల్పించడంలో రైల్వే శాఖ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈనేపథ్యంలోనే అన్ని రైల్వే స్టేషన్లలో రైలు వినియోగదారుల కోసం హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన జోన్ పరిధిలో హాల్ట్ స్టేషన్లను మినహాయించి అన్ని రైల్వే స్టేషన్లలో భారీ సంఖ్యలో 588 రైల్వే స్టేషన్లలో హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని విస్తరించింది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో సుమారు 6,000 రూట్ కి.మీ.ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎఫ్‌సి)తో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ డిజిటల్ హబ్‌గా మార్చుతోంది.

30 మేజర్ నాన్ సబర్బన్ గ్రేడ్‌స్టేషన్‌లు

ప్రస్తుతం 588 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించినట్టు రైల్వే శాఖ తెలిపింది. వీటిలో 30 మేజర్ నాన్ సబర్బన్ గ్రేడ్‌స్టేషన్లు (ఎన్‌ఎస్‌జి1, ఎన్‌ఎస్‌జి2, ఎన్‌ఎస్‌జి3 కేటగిరి) 558 మధ్యతరహా , చిన్న స్టేషన్లు (నాన్ సబర్బన్, సబర్బన్ స్టేషన్లు) ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో (హాల్ట్ కేటగిరి స్టేషన్లు మినహా) హై స్పీడ్ వైఫై వసతి విస్తరించినట్టు ద.మ.రైల్వే తెలిపింది. ఇప్పటికే నవంబర్‌లో 13,950 జిబి డేటాను ప్రయాణికులు వినియోగించుకున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నాందేడ్‌లలో..

రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రజలు హై డెఫినేషన్ (హెడ్‌డి) వీడియోల స్ట్రీమింగ్‌కు, సినిమాలు, గేమ్స్ డౌన్‌లోడింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లో వారి కార్యాలయాల విధులు నిర్వహించుకునే అవకాశాలున్నాయి. పరిమితంగా సౌకర్యాలుండే గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి అవసరాల కోసం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వైఫై వసతిని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వినోద కార్యక్రమాల కోసం వ్యక్తిగత డివైసెస్‌పై దీనిని వినియోగించుకోవచ్చన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లయిన సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నాందేడ్ మొదలగు స్టేషన్లలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఈ సౌకర్యంతో నెట్‌వర్క్ అనుసంధానం ఉత్తమంగా ఉందని, నెట్‌వర్క్ నిరాటంకంగా అత్యుత్తమంగా అందుబాటులో ఉంటుందని ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

30 నిమిషాలు ఉచితం

రైలు వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా ఉచిత వైఫై సర్వీసును తీసుకువచ్చినట్టు ద.మ.రైల్వే తెలిపింది. స్మార్ట్ ఫోన్ దీనిని వినియోగించుకోవచ్చని, వినియోగదారులు ప్రతిరోజు మొదటి 30 నిమిషాలు 1 ఎమ్‌బిపిఎస్ వరకు ఉచిత వైఫై సౌకర్యం పొందవచ్చని ద.మ.రైల్వే తెలిపింది. 30 నిమిషాల తరువాత ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా నామమాత్రపు చార్జీలను చెల్లించి ఈ సేవలను కొనసాగించుకోవచ్చని పేర్కొంది. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను సామన్య భారతీయ రైలు ప్రయాణికులకు అందించాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే, రైల్ టెల్ ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్టు ద.మరైల్వే అధికారులు తెలిపారు. డిజిటల్ ఇండియా కలలను సాకారం చేస్తూ భారతీయ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వినియోగ సౌకర్యార్థం రైల్ వైర్స్ వైఫై ద్వారా ఈ సాంకేతికతను ప్రయాణికులకు రైల్వే శాఖ అందిస్తోంది.

సిబ్బందిని, అధికారులను అభినందించిన జిఎం

ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి కృషి చేసిన సిగ్నల్ టెలికమ్యునికేషన్ విభాగం అధికారులను, రైల్ టెల్ అధికారులను, ఇతర సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. ప్రస్తుత పరిస్థితులలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా విప్లవాత్మక సాంకేతిక మార్పులతో స్టేషన్లలో ఏర్పాటు చేసిన వైఫై సౌకర్యంతో వినోదం, సమాచారం, విజ్ఞానం, నైపుణ్యం వంటి రంగాల్లో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News