Friday, May 3, 2024

ఫ్రెంచ్ ఓపెన్‌కు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

French Open 2020 to begin from Sept 27

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఆదివారం తెరలేవనుంది. నిజానికి జులైలోనే ఫ్రెంచ్ ఓపెన్ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీని వాయిదా వేశారు. ఇప్పటికే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మెయిన్ డ్రా పోటీలు ఆదివారం ప్రారంభమవుతాయి. కరోనా భయం వెంటాడుతుండడంతో ఈసారి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నారు. గతంలో మాదిరిగా వేలాది మంది సమక్షంలో కాకుండా కొద్ది మంది అభిమానుల మధ్యే ఫ్రెంచ్ ఓపెన్ కొనసాగనుంది. ఈ ఏడాది జరుగుతున్న చివరి గ్రాండ్‌స్లామ్ ఇదే కావడంతో స్టార్ ఆటగాళ్లందరూ టైటిల్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఎప్పటిలాగే డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇక యూఎస్ ఓపెన్ గెలిచి జోరుమీదున్న ఆస్ట్రియా సంచలనం డొమినిక్ థిమ్ కూడా టైటిల్‌పై కన్నేశాడు. కిందటిసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న థిమ్ ఈసారి ఎలాగైన ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ రారాజుగా పేరు తెచ్చుకున్న నాదల్ ఈసారి కూడా విజేతగా నిలిచిన అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన క్రీడాకారుడిగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సరసన నిలువాలని తహతహలాడుతున్నాడు. అయితే అతనికి వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ థిమ్‌లతో గట్టి పోటీ నెలకొంది.

వీరిద్దరిని ఓడించి టైటిల్‌ను గెలుచుకోవడం నాదల్‌కు అనుకున్నతం తేలిక కాదనే చెప్పాలి. ఇప్పటికే జకోవిచ్, థిమ్ పలు టోర్నమెంట్‌లలో ఆడడం ద్వారా తగినంత ప్రాక్టీస్‌ను సంపాదించారు. నాదల్ మాత్రం పెద్దగా సాధన చేయలేదు. ఇలాంటి స్థితిలో నాదల్ ఎంతవరకు సఫలం అవుతాడో చెప్పడం కష్టంగా మారింది. మరోవైపు జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశాడు. యూఎస్ ఓపెన్‌లో అనూహ్య పరిస్థితుల్లో టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన జకోవిచ్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ టైటిల్‌తో నాదల్, ఫెదరర్‌లకు మరింత చేరువ కావాలని భావిస్తున్నాడు. ఇక అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), డానిల్ మెద్వెదేవ్ (రష్యా), సిట్సిపాస్ (గ్రీస్), షపావలోవ్ (కెనడా), బెరిటెని (ఇటలీ), మోన్‌ఫీల్స్ (ఇటలీ), బుస్టా (స్పెయిన్) తదితరులు కూడా టైటిల్ గెలవాలనే పట్టుదలతో టోర్నీకి సిద్ధమయ్యారు. ఇక ఈసారి పురుషుల సింగిల్స్‌లో జకోవిచ్‌కు టాస్ సీడ్ లభించింది. నాదల్‌కు రెండో, థిమ్‌కు మూడో సీడ్ దక్కింది. డానిల్ మెద్వెదేవ్, సిట్సిపాస్‌లు తర్వారి సీడింగ్‌లను దక్కించుకున్నారు.
భారీ ఆశలతో సెరెనా..
ఇక మహిళల సింగిల్స్‌లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ భారీ ఆశలతో ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతోంది. యూఎస్ ఓపెన్‌లో ఆరంభంలోనే ఇంటిదారి పట్టిన సెరెనా ఈసారి మాత్రం మెరుగైన ఆటను కనబరచాలని తహతహలాడుతోంది. మహిళల సింగిల్స్‌లో అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా నిలిచేందుకు సెరెనా ఒక టైటిల్ దూరంలో నిలిచింది. ఈసారి గెలిస్తే అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంటుంది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సెరెనాకు ఈసారి టాప్ సీడ్ సిమోనా హలెప్, రెండో కరోలినా ప్లిస్కోవా, మూడో సీడ్ ఎలినా స్విటోలినా తదితరులతో గట్టి పోటీ నెలకొంది. ఇదిలావుండగా ఈసారి హలెప్ మహిళల విభాగంలో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

French Open 2020 to begin from Sept 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News