Saturday, April 27, 2024

ఇంఫాల్‌లో మళ్లీ ఘర్షణలు..కర్ఫ్యూ విధింపు!

- Advertisement -
- Advertisement -

గౌహతి: కొన్నాళ్లు శాంతి నెలకొన్న మణిపూర్‌లో మళ్లీ ఈ రోజు మధ్యాహ్నం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ప్రాంతంలో మెయితీ, కుకీ సముదాయాలు మళ్లీ బాహాబాహీకి దిగాయని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఘర్షణలు స్థానిక మార్కెట్‌లో మొదలయ్యాయి. ఆ ప్రాంతంలో దహనకాండ వార్తలు అందగానే కర్ఫూ ప్రకటించారు. మణిపూర్‌లో అనేక అంశాలపై నెలకు పైగా తెగల ఘర్షణలు జరుగుతున్నాయి.

ఈ నెల ఆరంభంలో కూడా ఘర్షణలు చెలరేగగా, సైన్యం పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఘర్షణలో దాదాపు 70 మంది చనిపోయారు. కోట్లాది ఆస్తి నష్టం జరిగింది. వేలాది మంది ప్రభుత్వ నిర్వహణ శిబిరాలకు తరలి వెళ్లారు. రిజర్వు ఫారెస్ట్ నుంచి కుకీ గ్రామస్థులను ఖాళీ చేయించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో చిన్నపాటి ఘర్షణలు మొదలయ్యాయి.
మణిపూర్‌లో మెయితీలు 64 శాతం ఉన్నారు. వారు 10 శాతం భూమిని ఆక్రమించారు. గిరిజనేతరులు నోటిఫైడ్ హిల్ ఏరియాలో భూమి కొనడానికి అనుమతిలేదు. అయితే వారిని ఎస్టీ క్యాటగిరిలో చేర్చితే భూములు కొనడానికి అర్హులవుతారు. ఇది గిరిజనులకు దిగ్భ్రాంతిని కలిగించింది.

ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తమని లక్షంగా చేసుకుంటోందని కుకీలు ఆరోపిస్తున్నారు. తమని అడవి ప్రాంతం, కొండ ప్రాంతం నుంచి తొలగించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. డ్రగ్స్‌పై యుద్ధం అన్నది కూడా తొలగింపు కోసం పన్నిన ఎత్తుగడ అని వారు ఆరోపిస్తున్నారు.

సైన్యం, పారా మిలిటరీ బలగాలు మణిపూర్‌లో క్యాంపింగ్ చేస్తున్నాయి. అవి సాధారణ గస్తీ నిర్వహించడమే కాక పౌరులకు సాయపడుతున్నాయి. ఇదిలావుండగా హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అంతేకాక ఇరువర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News