Friday, May 3, 2024

గుజరాత్‌లో ఘోరం: నగ్నంగా నిలబెట్టి కళాశాల బాలికలకు రుతుస్రావ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్: గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందిన భుజ్ పట్టణంలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక మత సంస్థ నిర్వహించే కళాశాలకు చెందిన 68 మంది బాలికలను కళాశాల యాజమాన్యం నగ్నంగా నిలబెట్టి వారి రుతుస్రావ రక్తాన్ని తనిఖీ చేయడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తమను కళాశాల ఆవరణలో పెరేడ్ చేయించారని, ప్రిన్సిపాల్‌తోపాటు నలుగురు మహిళా టీచర్ల సమక్షంలో వాష్‌రూమ్‌లో తమను ఒకరి తర్వాత ఒకరిగా లోదుస్తులను విప్పించి పరీక్షించారని బాలికలు ఆరోపించారు. ఈ దారుణ సంఘటన గత సోమావారం భుజ్ పట్టణంలోని శ్రీ సహజానంద్ బాలికల విద్యా కళాశాలలో చోటు చేసుకుంది. ఆ రోజు నుంచి బాధిత బాలికలు నిరసన తెలియచేస్తున్నప్పటికీ హాస్టల్ నుంచి వెళ్లగొడతామని కళాశాల అధికారులు బెదిరిస్తూ వారి నోళ్లు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు.

గురువారం మీడియా ముందుకొచ్చిన కొందరు బాలికలు జరిగిన సంఘటన గురించి వెల్లడించారు. ఒక మతాపరమైన సంస్థ యాజమాన్యంలో నడిచే ఈ కళాశాలలో బికాం, బిఎ, బిఎస్సీ కోర్సులను నిర్వహిస్తున్నారు. గత సోమవారం క్యాంపస్ గార్డెన్‌లో వాడిపారేసిన శానిటరీ ప్యాడ్ కనిపించడంతో కళాశాల నిర్వాహకులు సీరియస్ అయ్యారు. రుతుస్రావంలో ఉన్న బాలికలపై కళాశాల పాలకులు కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. వారు కిచెన్ లోకి, ఆవరణలో ఉన్న ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించడం, ఇతర బాలికలతో కలసి తిరగడంపై ఆంక్షలు ఉన్నాయి. వాడిన శానిటరీ ప్యాడ్ ఎవరు బయట పారేశారో తెలుసుకునే క్రమంలో హాస్టల్ వార్డెన్ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ రీటా రాణింగకు తెలిపారు.

దీంతో ప్రిన్సిపాల్ బాలికలందరినీ ఒక చోట సమావేశపరిచారు. వారిని గట్టిగా మందలించిన ప్రిన్సిపాల్ ఎవరు ఈ పని చేశారో చెప్పాలంటూ నిలదీశారు. ఇద్దరు బాలికలు తామే ఈ పని చేశామని, అందుకు క్షమించాలని కూడా వేడుకున్నారు. అయితే ప్రిన్సిపాల్ అంతటితో ఆగకుండా 68 బాలికలనూ వాష్‌రూమ్ వద్ద క్యూ కట్టించారు. ఒక్కొక్కరినీ లోపలకు పిలిపించి వారిని లోదుస్తులను విప్పించి పరీక్షించారు. ఈ సంఘటన అనంతరం బాలికలు తమ పట్ల దారుణంగా వ్యవహరించిన తీరుపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా వారి నోళ్లు మూయించడానికి కళాశాల పాలకులు బెదిరింపులకు దిగారు. ప్రిన్సిపాల్, నలుగురు టీచర్లపై చట్టపరమైన చర్యలకు డిమాండు చేస్తే హాస్టల్ నుంచి బహిష్కరిస్తామని తమను బెదిరిస్తున్నారని బాలికలు వాపోయారు. ఈ సంఘటనపై ఫిర్యాదు రావడంతో కచ్ యూనివర్సిటీ అధికారులు హుటాహుటిన కళాశాల చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాలికలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసేందుకు కచ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

 

Girls institute students were stripped by Authorities, Girls forced to strip in Shri Sahajanand Institute menstruation check
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News